జగన్ కూడా కొత్త రాగమేనా ?
అలా జరగకపోతే ఆ పార్టీయే కాల పరీక్షకు తట్టుకోలేక భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.
By: Tupaki Desk | 22 Jan 2025 3:42 AM GMTఏ రంగం అయినా కొత్తదనమే కోరుకుంటుంది. రాజకీయాలలోనూ అదే సాగుతుంది. ఎందుకు అంటే యువత ఎక్కువగా ఉండాల్సిన రంగం రాజకీయం. వారు దూకుడుగా ఉంటేనే ఏ పార్టీ పంట అయినా పండుతుంది. అందుకే ప్రతీ పార్టీ సమయం సందర్భం వచ్చినపుడు పార్టీలోకి కొత్త నీరుని ఆహ్వానిస్తూ ఉంటుంది.
అలా జరగకపోతే ఆ పార్టీయే కాల పరీక్షకు తట్టుకోలేక భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. విషయానికి వస్తే టీడీపీ చాలా దశాబ్దాల తరువాత కొత్త నాయకత్వం అంటోంది. సీనియర్లకు చెక్ పెట్టేలా ఆ పార్టీ నిర్ణయాలు ఉంటున్నాయి. అవి మొన్నటి ఎన్నికల్లో పార్టీ టికెట్ల పంపిణీ నుంచి మంత్రి పదవుల నుంచి మొదలెడితే నామినేటెడ్ పదవుల దాకా కొత్త వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఇక చూస్తే వైసీపీలోనే పాత తరం నాయకులు కొనసాగుతున్నారు. ఎక్కువగా సీనియర్ నేతలు కనిపిస్తున్నారు. వారిలో కూడా కాంగ్రెస్ నుంచి ఉంటూ దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న వారే ఉంటున్నారు. వీరందరి విషయంలో ఇపుడు వైసీపీ అధినాయకత్వం సీరియస్ గానే ఆలోచన చేస్తోంది అని అంటున్నారు.
పైగా సీనియర్ల తీరు కూడా గమనిస్తోంది అని అంటున్నారు. వారంతా గమ్మున ఉండడం మరి కొందరు వీలు చూసుకుని వేరే పార్టీల వైపు చూడడం వంటివి కూడా హైకమాండ్ దృష్టిని దాటి పోనీయడం లేదు అని అంటున్నారు. ఈ క్రమంలో సీనియర్ల కంటే కొత్త వారికి యువతకు చాన్స్ ఇస్తే వారు పార్టీని నమ్ముకుని ఉంటారని అంత తొందరగా వారు జంప్ చేయరని భావిస్తోందిట.
ఇదిలా ఉంటే వైసీపీ అధినాయకత్వం ఇటీవల ఇచ్చిన పలు ఆందోళనలో కూడా యువ నేతలే ఎక్కువగా పాలు పంచుకోవడం సైతం అధినాయకత్వం మనసులో కొత్త ఆలోచనలు పుట్టడానికి కారణమైంది అని అంటున్నారు. దాంతో వీలైనంత త్వరలో పార్టీలో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు బాధ్యుల నుంచి కీలక పదవులలోనూ కొత్త వారికే చాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయిందట.
జగన్ వచ్చే నెల నుంచి జిల్లాల టూర్లు వేయబోతున్నారు. అక్కడ ఆయన పార్టీ కోసం పనిచేసే యువ నేతలను స్వయంగా గమనించి వారికి అవకాశాలు ఇస్తారని అంటున్నారు. అదే విధంగా పార్టీ కార్యక్రమాలను నిరంతరం ప్రజలలో ఉండేలా తీసుకుని పోయే యువతరం నేతలకు వైసీపీ పెద్ద పీట వేస్తుందని అంటున్నారు.
వైసీపీ తీసుకుంటున్న ఈ నిర్ణయాలతో ఆ పాటీలో సీనియర్లకు ఇక రెస్ట్ తీసుకోవడమే మిగులుతుందా అన్న చర్చ ఉంది. ఏపీలో చూస్తే టీడీపీ కూడా కొత్త వారే అంటోంది. జనసేన కూడా ఆచీ తూచీ నేతలను తీసుకుంటోంది. దీంతో వైసీపీ కూడా యూత్ కే పట్టాభిషేకం అంటే ఇక సీనియర్ల రాజకీయం నిండా ముగిసినట్లే అని అంటున్నారు. చూడాలి మరి ఏపీ రాజకీయంలో కొత్త రాగాలు ఏ రకమైన రాజకీయ సరాగాలు ఆలపిస్తాయో.