ఒంటరి నుంచి భవిష్యత్తు దిశగా.. జగన్ సంచలన నిర్ణయం..!
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది.
By: Tupaki Desk | 1 Nov 2024 4:45 AM GMTవైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది. ఆయన ఇప్పుడు ఎవరిని నమ్మాలి? అనేది మొదటి ప్రశ్న. కుటుంబాన్ని నమ్మి.. ఆస్తుల విషయంలో వీధిన పడ్డానన్న ఆవేదన జగన్‌లో ఉంది. ఇక, పార్టీలో ఉన్న సామినేని ఉదయభాను, బాలినేని వంటి వీర విధేయులను నమ్మి వారి వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్న వాదనను మూటగట్టుకున్నారు. ఈ క్రమంలో ఎవరిని నమ్మాలి? అనేది ఇప్పుడు జగన్‌కు పెద్ద పరీక్షగా మారిపోయింది.
ఈ పరిణామాలను అంచనా వేసుకున్న జగన్ మరోసారి జనాన్ని నమ్మాల్సిందేనని తీర్మానించుకున్నారు. అయితే.. ఈ సారి అతిగా కాకుండా.. ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా మూడు రోజుల పాటు కడపలో పర్యటించిన జగన్.. తనకు అత్యంత విశ్వసనీయు లైన నాయకులతోఅంతర్గత చర్చలు జరిపారు. సొంత మేనమామ.. రవీంద్రనాథ్‌రెడ్డి(కమలాపురం నియోజకవర్గం), రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి(ప్రొద్దుటూరు), అంజాద్ బాషా(కడప) సహా అత్యంత ముఖ్యులతో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో ప్రధానంగా భవిష్యత్తు ప్రణాళికలపైనే చర్చించినట్టు తెలిసింది. నిజానికి ఇప్పుడు పార్టీలో ఎవరు ఉంటారో.. ఎంతమంది వెళ్లిపోతారో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పార్టీని కాపాడుకోవడంతోపాటు.. ఎన్నికల సమయంలో పార్టీకి వచ్చిన 40 శాతం(వైసీపీ అంటున్నా.. వచ్చింది 37.86%) ఓటు బ్యాంకును కాపాడుకోవడం, అదేసమయంలో తన ఇమేజ్‌ను దెబ్బతీయాలని అనుకున్న వారికి తగిన విధంగా సమాధానం చెప్పడం అనే కీలక విషయాలపై జగన్ దృష్టి పెట్టినట్టు తెలిసింది.
అవసరమైతే.. వచ్చే నాలుగేళ్ల పాటు.. విడతల వారీగా జిల్లాల్లో పాదయాత్ర చేయాలని కూడా భావిస్తు న్నట్టు సమాచారం. అయితే.. దీనిపై పూర్తిస్థాయి నిర్ణయం తీసుకోలేదు. కానీ, ఇప్పటికిప్పుడు మాత్రం.. ప్రజల్లోకివెళ్లాలనినిర్నయించుకున్నారు. తాను ఒక్కడిగానే.. పార్టీని నిలబెట్టానని. మిగిలిన వారంతా తర్వాత వచ్చారని.. కాబట్టి.. తనకు ఒంటరి తనం కొత్తకాదని ఈ సందర్భంగా.. జగన్ వ్యాఖ్యానించినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. సో.. దీనిని బట్టి.. మళ్లీ జగన్‌ప్రజల్లోకి వచ్చేందుకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.