''రెడ్ బుక్ పెద్ద పనా?''... వైఎస్ జగన్ నోట గుడ్ బుక్ మాట!
అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తన శ్రేణులపై జరిగిన దాడులకు ఆ రెడ్ బుక్కే కారణం అనేది వైసీపీ నేతల ఆరోపణ!
By: Tupaki Desk | 9 Oct 2024 10:01 AM GMTఏపీ రాజకీయాల్లో రెడ్ బుక్ అనేది ఎంత హాట్ టాపిక్ అనేది తెలిసిన విషయమే. గత ప్రభుత్వ హాయాంలో తప్పు చేసిన అధికారులపై చట్టప్రకారం చర్యలు తీసుకొవడం కోసం తాను ఈ బుక్ మెయింటైన్ చేస్తున్నట్లు లోకేష్ తెలిపారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తన శ్రేణులపై జరిగిన దాడులకు ఆ రెడ్ బుక్కే కారణం అనేది వైసీపీ నేతల ఆరోపణ!
ఈ విధంగా ప్రతీ రోజూ ఏదో ఒకమూల ఏపీ రాజకీయాల్లో రెడ్ బుక్ అనేది హాట్ టాపిక్ గా మారుతుంటుంది.. రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అవుతుంటుంది. ఈ సమయంలో రెడ్ బుక్ అనేది పెద్ద పనా అని ప్రశ్నిస్తూ.. గుడ్ బుక్ అనేది కూడా రాస్తున్నామంటూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... తాజాగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళగిరి నేతలతో సమావేశమయ్యారు వైఎస్ జగన్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకు పూర్తి భరోసా ఇవ్వాలని భావించినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలోనే రెడ్ బుక్ అనేది ఏమైనా పెద్దపనా? అని ప్రశ్నించిన జగన్... గతంలో ఎన్నడూ లేని దుష్టసంప్రదాయాన్ని చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిందని.. ఇప్పుడు తాను చేయొద్దని చెప్పిన మా వాళ్లు కూడా బుక్స్ మెయింటెన్ చేయడం మొదలుపెట్టారని.. అన్యాయం చేసేవారి పేర్లను, అలాంటి అధికారుల పేర్లను రాసుకోంటున్నారని అన్నారు.
ఇదే సమయంలో... తాము గుడ్ బుక్ కూడా రాసుకోవడం మొదలుపెట్టామని చెప్పిన జగన్... పార్టీకి మంచి చేసినవారి పేర్లను, కష్టపడేవారి పేర్లను కూడా రాసుకుంటున్నట్లు తెలిపారు. వారికి తప్పకుండా అవకాశాలు, ప్రమోషన్లు ఉంటాయని స్పష్టం చేశారు.
అనంతరం రాష్ట్రంలో అత్యంత దారుణ పరిస్థితులు ఉన్నాయని చెప్పిన జగన్... ఐదేళ్ల పాలనలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ హామీని వైసీపీ నెరవేర్చిందని అన్నారు. ఇదే సమయంలో.. సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు అందించిన ఘనత కేవలం వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని జగన్ అన్నారు. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం అసలు ఎందుకు ఉందో అర్ధం కావడం లేదని జగన్ తెలిపారు.