జగన్ ని వదిలేసినట్లేనా ?
ఇక జగన్ సీఎం గా తొలిసారి కలిసిన పొరుగు సీఎం కేసీఆర్ అన్నది తెలిసిందే.
By: Tupaki Desk | 5 Jan 2025 2:30 AM GMTఏపీలో వైసీపీ తెలంగాణాలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు జగన్ కేసీఆర్ అన్నదమ్ములుగా మెలిగారు. ఎంతో ఆప్యాయంగా ఉన్నారు. జగన్ సీఎం గా ప్రమాణ స్వీకార ఘట్టానికి ముఖ్య అతిధిగా కేసీఆర్ వచ్చి దీవించారు. ఇక జగన్ సీఎం గా తొలిసారి కలిసిన పొరుగు సీఎం కేసీఆర్ అన్నది తెలిసిందే.
ఆనాడు కేసీఆర్ ఆయన మంత్రులు జగన్ ని బాగా స్వాగతించారు. ఆ మీదట మరిన్ని సమావేశాలు కూడా ఈ ఇద్దరు సీఎం ల మధ్య సాగాయి. అయితే రెండు రాష్ట్రాల సీఎంలు ఇలా కలసిమెలసి ఉన్న తరుణంలో బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. తెలంగాణాలో బీజేపీ కేసీఅర్ ని గట్టిగా టార్గెట్ చేయడంతో బీఆర్ఎస్ ఆ పార్టీని పూర్తిగా ఎటాక్ చేస్తూ ముందుకు వెళ్ళింది.
అదే సమయంలో జగన్ కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సన్నిహితంగా ఉంటూ వచ్చారు. అది కేసీఆర్ కి నచ్చలేదని కూడా ప్రచారం సాగింది. ఒక దశలో బీఆర్ఎస్ గా టీఆర్ఎస్ ని మార్చి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కేసీఆర్ చూసినపుడు ఆయన ఎక్కువగా జగన్ మీదనే ఆశ పెట్టుకున్నారు అని చర్చ సాగింది.
అయితే జగన్ బీజేపీతో ఉండాలనుకోవడంతోనే కొత వరకూ ఇద్దరు మధ్య గ్యాప్ వచ్చింది అని అనుకున్నారు. ఇవన్నీ పక్కన పెడితే కేసీఆర్ జగన్ ల మధ్య ఇలాంటివి చిన్నపాటి అభిప్రాయభేదాలు తప్పించి వారి అసలైన బంధానికి ఇవి ఇబ్బందిపెట్టలేదని కూడా అన్న వారూ ఉన్నారు.
దానికి ఉదాహరణలు కూడా ఎన్నో ఉన్నాయి. తెలంగాణాలో 2023 ఎన్నికల్లో కేసీఆర్ గెలవాలని ఆయన మూడవసారి సీఎం అవాలని వైసీపీ అధినాయకత్వం బలంగా కోరుకుందని కూడా చెప్పుకున్నారు ఇక చూస్తే 2024 సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీ సీఎం గా మళ్లీ జగనే గెలుస్తారు అని కేసీఅర్ మీడియా ముఖంగా జోస్యం చెప్పారు. అలాగే కేటీఆర్ కూడా చెప్పారు.
కానీ ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత నుంచి చూస్తే బీఆర్ఎస్ నేతలు జగన్ విషయం పెద్దగా పట్టించుకోవడం లేదు అని అంటున్నారు. కేటీఆర్ అయితే అనేక సందర్భాలలో చంద్రబాబు రిఫరెన్స్ తెస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు.
బాబు ఉమ్మడి సీఎం గా ఉన్నపుడు అభివృద్ధి జరిగింది అని కూడా అంటున్నారు ఇక లేటెస్ట్ గా ఆయన చంద్రబాబు కేంద్రంలో కీలకంగా ఉన్నారని చెప్పి మరీ మరోసారి ఆయనను రాజకీయంగా ఎత్తున నిలబెట్టారు. కేసీఆర్ కూడా ఇదే విధంగా భవిష్యత్తులో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కీలకం అవుతారని జోస్యం చెబుతున్నారు.
ఇవే కాదు చాలా సందర్భాలలో చంద్రబాబు గురించి మంచిగానే బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. దానికి కారణం తెలంగాణాలో 2023 ఎన్నికల్లో ఓటమికి టీడీపీ విషయంలో అనుసరించిన వ్యతిరేకత ఒక కారణం అని అంటున్నారు. అంతే కాదు బాబు అరెస్ట్ సమయంలో కేటీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా టీడీపీ అభిమానుల ఆగ్రహానికి కారణం అయ్యాయి.
మరో వైపు చూస్తే మళ్లీ బీఆర్ఎస్ బలంగా పుంజుకోవాలంటే క్షేత్ర స్థాయిలో టీడీపీ ఓటు బ్యాంక్ ఎంతో కొంత ఉంటే దానిని పోలరైజ్ చేసి తన వెంట ఉంచుకోవాలని చూస్తున్నారు అని అర్ధం అవుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో జగన్ ని పక్కన పెట్టారా అన్న చర్చ కూడా సాగుతోంది.
ఏపీలో జగన్ రాజకీయంగా ఇబ్బందులలో ఉన్నారు. దీంతో ఆయన విషయం ఇపుడు ఎందుకు అన్నట్లుగా వ్యూహాత్మకంగా పక్కన పెట్టారా అన్న చర్చ ఉంది. ఏది ఏమైనా జగన్ కి రాజకీయంగా మిత్రులు అయిన వారు పెద్దగా లేరు అంటారు. అటువంటిది బీఆర్ ఎస్ కూడా దూరం పెడితే మాత్రం ఆయనది మరింత ఒంటరి పోరాటమే అవుతుంది అంటున్నారు. అయితే రాజకీయాంలో ఇవన్నీ మామూలే ఏ పార్టీ వ్యూహం ఆ పార్టీకి ఉంటుందని అందువల్ల వీటి వల్ల వచ్చే కొత్త ఇబ్బందులు ఏమీ ఉండబోవని అంటున్న వారూ ఉన్నారు. చూడాలి మరి ఫ్యూచర్ పాలిటిక్స్ బీఅర్ఎస్ అండ్ వైసీపీల మధ్య ఎలా ఉంటాయో.