అమిత్ షాకు అండగా బాబు...సైలెంట్ గా జగన్
ఆయన రాజ్యసభలో చేసిన కొన్ని వ్యాఖ్యలతో అంబేద్కర్ మీద అనుచితంగా వ్యాఖ్యలు చేశారంటూ విపక్షాలు నాన్ స్టాప్ గా ఆందోళనలు చేస్తున్నాయి.
By: Tupaki Desk | 20 Dec 2024 6:50 AM GMTకేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నడూ లేని విధంగా పెను రాజకీయ దుమారంలో చిక్కుకున్నారు. ఆయన రాజ్యసభలో చేసిన కొన్ని వ్యాఖ్యలతో అంబేద్కర్ మీద అనుచితంగా వ్యాఖ్యలు చేశారంటూ విపక్షాలు నాన్ స్టాప్ గా ఆందోళనలు చేస్తున్నాయి. పార్లమెంట్ బయట కూడా బీజేపీ ఇండియా కూటమి ఎంపీల మచ్చ రచ్చ కూడా జరిగింది.
అమిత్ షా అంబేద్కర్ గురించి మాట్లాడుతూ దేవుడి పేరుని పదే పదే తలచుకుంటే స్వర్గానికి పోతారు అని కామెంట్స్ చేశారు. అయితే హోం మంత్రి పూర్తి పాఠాన్ని వినకుండా కట్ చేసి ఇలా ఇవ్వడం వల్లనే చిక్కులు వచ్చాయని బీజేపీ అంటోంది. ఆయన అంబేద్కర్ ని ఏమీ కామెంట్స్ చేయలేదని అంబేద్కర్ పేరుతో రాజకీయం చేస్తున్న వారి మీదనే సెటైర్లు వేశారని అంటోంది.
ఇదిలా ఉంటే ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ ఈ విషయంలో తన స్టాండ్ ఏంటో చెప్పాలని ఆప్ అధినేత ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఒక లేఖను బాబుకు సంధించిన విషయం విధితమే. అయితే బాబు ఓపెన్ గా మీడియాతో దీని మీద ఏమీ కామెంట్స్ చేయకపోయినా గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతూ అంబేద్కర్ మీద అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరిస్తున్నారు అని అన్నట్లుగా చెబుతున్నారు.
గతంలో తన విషయంలోనూ ఇలాగే జరిగిందని వ్యవసాయం దండుగ అని తాను అన్నట్లుగా లేని దానిని ప్రచారం చేశారని బాబు గుర్తు చేసుకున్నారు. మరో వైపు చూస్తే అంబేద్కర్ ని బీజేపీ గౌరవించిందని భారత రత్నను ప్రకటించిందని బాబు అన్నారు. అలాగే వీపీ సింగ్ ప్రధానిగా ఉండగా పార్లమెంట్ లో ఆయన విగ్రహాన్ని స్థాపించారని కూడా చెప్పారు.
అదే కాంగ్రెస్ టైం లో అంబేద్కర్ ని ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడించారని కూడా బాబు అన్నారు. మొత్తానికి అమిత్ షాకు అండగా నిలబడి పూర్తిగా బాబు మద్దతు ఇచ్చిన వైనంగా దీనిని చూస్తున్నారు. అంతే కాదు అంబేద్కర్ కి ఎవరు గౌరవించారు అన్న దాని మీద డిబేట్ జరగాలని కూడా బాబు కోరుకున్నారు.
ఈ నేపధ్యంలో చూస్తే అమిత్ షా వ్యాఖ్యలకు అనుకూలంగా వ్యతిరేకంగా దేశంలోని పార్టీలు చీలి పోయి తమ కామెంట్స్ చేస్తున్నాయి. చిత్రంగా ఏపీలో విపక్షంలో ఉన్న వైసీపీ మాత్రం దీని మీద ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు. జగన్ ఈ విషయంలో సైలెంట్ గానే ఉన్నారని తెలుస్తోంది అంటున్నారు.
బీజేపీతో పొత్తులో ఉన్న కారణంగానే బాబు స్పందించారు అని వైసీపీ బయట ఉన్న పార్టీ కాబట్టి రియాక్ట్ కానవసరం లేదని అంటున్న వారూ ఉన్నారు. అయితే బీజేపీ కొన్ని విధానాల పట్ల వైసీపీ ఆలోచన చేస్తోందని ముఖ్యంగా వక్ఫ్ బోర్డు బిల్లు విషయంలో వ్యతిరేకిస్తోందని గుర్తు చేస్తున్నారు.
ఇపుడు అమిత్ షా వ్యాఖ్యల మీద ఒక రాజకీయ పక్షంగా వైసీపీ మౌనమే తన స్టాండ్ అని చెప్పడం ద్వారా న్యూట్రల్ విధానమే ఎంచుకుందని అంటున్నారు. ఏది ఏమైనా బీజేపీ టీడీపీ పొత్తులు ఉన్నాయి కాబట్టి బీజేపీకి పెద్దగా వైసీపీ అండ ఉండదని చెప్పడమూ ఇందులో ఉన్న మరో సంకేతం అని అంటున్నారు. ఇక ఇండియా కూటమి మొత్తం అమిత్ షా వ్యాఖ్యలను తప్పుపడుతోంది. జాతీయ రాజకీయాల్లో వైసీపీది తటస్థ విధానం కాబట్టే ఇలా సైలెంట్ గా ఉందని కూడా అంటున్నారు.