Begin typing your search above and press return to search.

"రావాలి జగన్.. చెప్పాలి సాక్ష్యం.. కావాలి నిజం"!

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడికత్తితో దాడి ఘటన ఎంత సంచలనంగా మారిందనేది తెలిసిన విషయమే

By:  Tupaki Desk   |   18 Oct 2024 9:26 AM GMT
రావాలి జగన్.. చెప్పాలి సాక్ష్యం.. కావాలి నిజం!
X

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడికత్తితో దాడి ఘటన ఎంత సంచలనంగా మారిందనేది తెలిసిన విషయమే. ఈ క్రమంలో తాజాగా ఈ కేసుపై నేడు విశాఖలో ఎన్.ఐ.ఏ. కోర్టులో విచారణ జరిగింది. ఈ సమయంలో విచారణకు ప్రధాన నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు.

ఇదే సమయంలో.. అతడితో పాటు న్యాయవాది సలీం, దళిత సంఘాల నేత బూసి వెంకటరావుతో కలిసి ఎన్.ఐ.ఏ. కోర్టుకు వచ్చారు. అయితే... ఈ కేసులో సాక్షిగా వాంగ్మూలం ఇవ్వాల్సిన జగన్ మాత్రం విచారణకు హాజరుకాలేదు. దీనిపై శ్రీనివాస్ తరుపు న్యాయవాది సలీం స్పందిస్తూ... జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... కోడికత్తి కేసు విచారణలో భాగంగా వాంగ్మూలం ఇవ్వాల్సిన జగన్ విచారణకు హాజరుకాకపోవడంపై ప్రధాన నిందితుడు శ్రీనివాస్ తరుపు న్యాయవాది సలీం స్పందించారు. ఇందులో భాగంగా... కోర్టుకు వస్తే తన బండారం మొత్తం బయట పడుతుందనే జగన్ రావడం లేదని, వాంగ్మూలం ఇవ్వడం లేదని అన్నారు.

సుమారు ఎనిమిది తొమ్మిది నెలల నుంచి ఈ ప్రక్రియ పెండింగ్ లో ఉందని తెలిపారు. ఈ రోజు కోర్టుకి జన్నుపల్లి శ్రీనివాస్ హాజరయ్యారని.. ఈ కేసులో సాక్షిగా ఉన్న జగన్ వచ్చి కోర్టుకు తన వాంగ్మూలం ఇవ్వాల్సి ఉందని అన్నారు. ఇదే సమయంలో ఈ కేసులో ఎన్.ఐ.ఏ. డబుల్ స్టాండ్ తో పనిచేస్తుందని ఆయన ఆరోపించారు.

ఈ సందర్భంగా ఈ కేసులో తనది ఒకటే డిమాండ్ ఉందని చెబుతూ... "రావాలి జగన్.. చెప్పాలి సాక్ష్యం.. కావాలి నిజం" అని అన్నారు. ఇదే కేసు భవిష్యత్తు అని స్పష్టం చేశారు. ప్రస్తుతం సాధారణ ఎమ్మెల్యేగా ఉన్న జగన్ కోర్టుకు ఎందుకు రావడం లేదంటూ సలీం ప్రాశ్నించారు.