దావోస్...ఆ ఇద్దరినీ ఆకట్టుకోలేదా ?
అక్కడికి వచ్చే పారిశ్రామికవేత్తలతో భేటీ అయి పెట్టుబడులను తమ రాష్ట్రానికి తీసుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తూంటారు.
By: Tupaki Desk | 2 Jan 2025 10:30 PM GMTదావోస్ అంటే భారత దేశంలోని ముఖ్యమంత్రులు రాజకీయ నాయకులు చాలా ఆసక్తిని చూపిస్తారు. ప్రతీ ఏటా దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫారం కి దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాల నుంచి కీలక మంత్రులు సీఎంలు వెళ్తారు. అక్కడికి వచ్చే పారిశ్రామికవేత్తలతో భేటీ అయి పెట్టుబడులను తమ రాష్ట్రానికి తీసుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తూంటారు.
ఏపీలో చూస్తే 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయకత్వంలో ఒక ప్రతినిధి బృందం దావోస్ కి తప్పనిసరిగా వెళ్ళి వచ్చేది. పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయని చెప్పేది. అందులో ఎన్ని వచ్చాయన్నది పక్కన పెడితే నాడు టీడీపీ ప్రభుత్వం ఈ విషయంలో చేసిన కృషిని అంతా మెచ్చుకునేవారు.
ఇక 2019 నుంచి 2024 వరకూ అయిదేళ్ల పాటు సీఎం గా పాలించిన వైఎస్ జగన్ అయితే దావోస్ కి ఒకే ఒకసారి వెళ్లారు. దానికి ముందూ తరువాత ఆయన వెళ్ళలేదు. వైసీపీ మంత్రులు అయితే దావోస్ కి వెళ్లకుండానే పెట్టుబడులు తెస్తున్నామని చెప్పేవారు. తమ ప్రభుత్వం పెట్టుబడులు పేరుతో ప్రచారం చేసుకోదని కూడా వారు అంటూండేవారు.
కట్ చేస్తే తెలంగాణాలో అదే సీన్ ఉంది. ముఖ్యమంత్రిగా పదేళ్ల పాటు పాలించిన కేసీఆర్ కూడా ఏ నాడూ దావోస్ కి వెళ్లలేదు. ఆ మాటకు వస్తే ఆయన తన జీవితంలో విదేశాలకే వెళ్ళింది లేదు అని చెబుతారు. ఇక సీఎం హోదాలో ఆయన చైనా సింగపూర్ మాత్రమే తిరిగారు అని అంటారు.
అయితే కేసీఅర్ కి బదులుగా కేటీఅర్ క్రమం తప్పకుండా దావోస్ కి వెళ్ళేవారు. పెట్టుబడులలో ఇతర రాష్ట్రాలతో తెలంగాణా పోటీ పడుతోందని కూడా చెప్పేవారు. ఇక ఇపుడు చూస్తే రేవంత్ రెడ్డి పాలన సాగుతోంది. ఆయన గతంలో ఒకసారి దావోస్ కి వెళ్ళి వచ్చారు. సీఎం గా బాధ్యతలు స్వీకరించిన నాలుగు నెలలకే రేవంత్ రెడ్డి విదేశీ టూర్ పెట్టుకుని పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేశారు.
ఇక ఇపుడు మరోమారు రేవంత్ రెడ్డి దావోస్ కి వెళ్తున్నారు. దాని కంటే ముందు అస్ట్రేలియా టూర్ కూడా చేస్తున్నారు. ఇలా సీఎం గా కేవలం ఏడాది కాలంలోనే అయిదారు దేశాలు రేవంత్ రెడ్డి చుట్టేశారు. ఆయన పెట్టుబడులు తెలంగాణాను తేవాలని పట్టుదలతో వెళ్తున్నట్లుగా చెబుతున్నారు.
ఇక ఏపీలో చూస్తే నాలుగవ సారి సీఎం అయిన చంద్రబాబు దావోస్ కి ఈ తడవలో మొదటిసారి వెళ్తున్నారు. కుమారుడు లోకేష్ తో కలసి ఆయన దావోస్ టూర్ చేయడం ఈసారి ప్రత్యేకత. మొత్తానికి చూస్తే దావోస్ అంటే దేశంలో ఎందరు సీఎంలు దూరంగా ఉంటారో తెలియదు కానీ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి జగన్ కేసీఆర్ మాత్రం కాస్తా దూరంగానే ఉంటున్నారు. మరి అందరినీ ఆకట్టుకున్న దావోస్ వారిని ఆకట్టుకోలేదా అంటే జవాబు మాత్రం ఎవరి ఊహకు వారే వెతుక్కోవాల్సిందే.