అసెంబ్లీకి వస్తున్నారా అంటే జగన్ పక్కా క్లారిటీ ఇచ్చేశారు !
తాను అసెంబ్లీకి రావడంలేదు అని జగన్ క్లియర్ కట్ గా చెప్పేశారు. అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షంగా వైసీపీ ఉందని, కానీ వైసీపీని విపక్షంగా గుర్తించడానికి ప్రభుత్వానికి ఇష్టం లేదని ఆయన అన్నారు.
By: Tupaki Desk | 7 Nov 2024 9:30 PM GMTఏపీ శాసన సభ సమావేశాలు ఈ నెల 11 నుంచి మొదలు కానున్నాయి. మొత్తం పది రోజులకు పైగా ఈ శాసన సభ బడ్జెట్ సెషన్ జరగనుంది. పూర్తిస్థాయి బడ్జెట్ ని ప్రభుత్వం ఈసారి సభలో ప్రవేశపెట్టనుంది. అలాగే కీలకమైన అనేక బిల్లులు కూడా సభ ముందుకు వస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు అంటే అందరికీ ఠక్కున వైసీపీ గుర్తుకు వస్తోంది. వైసీపీ విపక్షంలోకి వచ్చి 11 సీట్లకే పరిమితం అయ్యాక అసెంబ్లీ కి వెళ్లడం లేదు. జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినపుడు ఒకసారి వెళ్లారు. గవర్నర్ కొత్త సభను ఉద్దేశించి ప్రసంగించినపుడు మరోసారి వెళ్లారు.
ఆ మీదట ఆయన అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారు. తనతో పాటు ఎమ్మెల్యేలను దూరంగా ఉంచుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు జగన్ ని అసెంబ్లీకి వస్తున్నారా అని అడిగారు. దానికి ఆయన పక్కాగా క్లారిటీ ఇచ్చేశారు.
తాను అసెంబ్లీకి రావడంలేదు అని జగన్ క్లియర్ కట్ గా చెప్పేశారు. అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షంగా వైసీపీ ఉందని, కానీ వైసీపీని విపక్షంగా గుర్తించడానికి ప్రభుత్వానికి ఇష్టం లేదని ఆయన అన్నారు. ప్రతిపక్షంగా గుర్తిస్తే విపక్ష నేతకు మైకు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
ప్రభుత్వాన్ని ఎక్కడ గట్టిగా నిలదీస్తామో అన్న భయంతోనే ప్రతిపక్షం గుర్తింపు మైకూ ఇవ్వకుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అందుకే సభకు వెళ్లకపోవడమే ఉత్తమమని అన్నట్లుగా జగన్ మాట్లాడారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో తీసుకునే ప్రతి నిర్ణయం మీద ప్రవేశపెట్టే ప్రతీ బిల్లు మీద మీడియా సమావేశం పెట్టి వారిని ధీటుగా ప్రశ్నిస్తామని అన్నారు.
అంటే మీడియా సమావేశాల ద్వారానే ప్రభుత్వాన్ని నిలదీస్తామని జగన్ అంటున్నారు అన్న మాట. సభకు వెళ్ళినా ఉపయోగం లేదని వైసీపీ అధినేత ఒక కచ్చితమైన నిర్ణయానికి వచ్చినట్లుగా ఉన్నారు . దీంతో ఈసారి కూడా జగన్ సభలో కనిపించరని అంటున్నారు.
ఇక ఆయన పార్టీ తరఫున ఈసారి ఎక్కువ మంది కొత్తవారు ఎన్నిక అయ్యారు. వారంతా కూడా అసెంబ్లీకి దూరం కావాల్సిందే అని అంటున్నారు. జగన్ అసెంబ్లీకి వెళ్లకపోయినా తన ఎమ్మెల్యేలను అయినా సభకు పంపిస్తే కొంతలో కొంత ప్రజా వాణిని వైసీపీ తరఫున వినిపించినట్లుగా ఉంటుందని అంటున్నారు. కానీ జగన్ మాత్రం వైసీపీ మొత్తం బాయ్ కాట్ అని అంటున్నారు.
మీడియా ద్వారానే ప్రభుత్వాన్ని నిలదీస్తే ఎన్నుకున్న ప్రజలకు న్యాయం జరుగుతుందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అయితే తమ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా జగన్ గుర్తించమని కోరుతున్నారు. తనకు ప్రతిపక్ష నేత హోదా కావాలని అది కూడా ప్రజా సమస్యల కోణంలోనే అని ఆయన అంటున్నారు. అయితే 18 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే తప్ప విపక్ష హోదా ఇవ్వలేమని ప్రభుత్వం అంటోంది. మొత్తం మీద చూస్తే జగన్ అసెంబ్లీకి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా వస్తారా అన్నది మాత్రం చర్చగా ఉంది. దానికి జవాబు కూడా రారు అని అనుకోవాల్సి ఉంటుందేమో.