చంద్రబాబు జిల్లా నుంచే...జగన్ మాస్టర్ ప్లాన్!
అంటున్నారు. మొత్తం మీద 2024 ఎండింగ్ తో కూటమి సర్కార్ కి గట్టి ఝలక్ ఇచ్చేసి 2025 నుంచి అసలైన పొలిటికల్ సినిమాను ఏపీ వెండి తెర మీద చూపించేందుకు జగన్ రెడీ అవుతున్నారు అని అంటున్నారు.
By: Tupaki Desk | 29 Oct 2024 7:30 AM GMTవైసీపీ అధినేత జగన్ ఏపీలో టూర్లకు పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. దానికి ఆయన ముహూర్తం కూడా పెట్టేశారు. జూన్ 11న అధికారంలోకి టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది. డిసెంబర్ నాటికి ఆరు నెలలు పూర్తి అవుతాయి. అంటే హానీమూన్ పూర్తి అయినట్లే.
దాంతో డిసెంబర్ నుంచి జగన్ జనంలోకి రానున్నారు అని అంటున్నారు. జగన్ జిల్లాల పర్యటనలకు సంబంధించిన రోడ్ మ్యాప్ రెడీ అవుతోంది. ఇక జగన్ ఒక వ్యూహం ప్రకారమే కీలక ప్రాంతాలలో తన పర్యటనలు ఉండేలా చూసుకుంటున్నారు.
వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ అయిన రాయలసీమ జిల్లాలు 2024 ఎన్నికల్లో హ్యాండ్ ఇచ్చేశాయి. దాంతో అక్కడ నుంచే జగన్ తన టూర్ ని మొదలెడతారు అని అంటున్నారు. ఆ తరువాత దశలో నెల్లూరు ప్రకాశం జిల్లాలను టచ్ చేస్తారు అని అంటున్నారు. అంటే గ్రేటర్ రాయలసీమలో ఉన్న మొత్తం 74 నియోజకవర్గాలలో పోయిన పట్టుని పార్టీ ప్రతిష్టను తిరిగి తెచ్చుకోవడానికి జగన్ ఈ రోడ్ మ్యాప్ ని సిద్ధం చేశారు అని అంటున్నారు.
ఇక జగన్ డిసెంబర్ నుంచి చేపట్టే జిల్లాల పర్యటన చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు నుంచే మొదలవుతుందని అంటున్నారు. చిత్తూరు జిల్లా నుంచే బాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతారు అని అంటున్నారు. అంతే కాదు సూపర్ సిక్స్ పేరుతో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని కూడా జగన్ జనం సాక్షిగా సర్కార్ మీద శర సంధానం చేస్తారు అని అంటున్నారు.
సామాజిక పెన్షన్లు పెంచామని ఒక వైపు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇంకో వైపు పెన్షన్లను కట్ చేస్తోందని అర్హులైన వారంతా ఆ విధంగా రోడ్డున పడుతున్నారని వైసీపీ అంటోంది. వారి పక్షాన నిలబడి జగన్ పోరాటం చేస్తారు అని అంటున్నారు. అలాగే ఉచిత బస్సు మహిళలకు ఎక్కడ అని నిలదీస్తారని అలాగే 18 ఏళ్ళు నిండిన మహిళలకు నెలకు ఇచ్చే 1500 రూపాయలు తల్లికి వందనం హామీ ఇలా చాలా చెప్పి ఏమీ చేయలేదని కూడా జగన్ విమర్శలు గుప్పిస్తారు అని అంటున్నారు
ఇక జగన్ చిత్తూరు జిల్లా తరువాత అనంతపురం, అలాగే కర్నూలు, కడప జిల్లాలలో తొలి విడత జిల్లా టూర్లు పూర్తి చేస్తారు అని అంటున్నారు. ఆ తరువాత నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో పర్యటనలు ఉంటాయని అంటున్నారు.
ఇక ప్రతీ నియోజకవర్గం స్థాయిలో మీటింగులు పెట్టి క్యాడర్ ని నేరుగా కలిసే కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుడతారని అంటున్నారు. క్యాడర్ తో చర్చించిన మీదటనే నియోజకవర్గాల ఇంచార్జిలను నియమిస్తారు అని అంటున్నారు.
ఆ మీదట జిల్లా స్థాయిలోనూ నియోజకవర్గాల స్థాయిలోనూ కార్యవర్గాలను ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేసే చర్యలకు ఉపక్రమిస్తారు అని అంటున్నారు. అంటే జగన్ ఒక వైపు పార్టీని బలోపేతం చేస్తూనే మరో వైపు జనంలోకి వెళ్ళడం ద్వారా కోల్పోయిన ఓటు బ్యాంక్ ని తిరిగి పొందడానికి కృషి చేస్తారు అని అంటున్నారు. మొత్తం మీద 2024 ఎండింగ్ తో కూటమి సర్కార్ కి గట్టి ఝలక్ ఇచ్చేసి 2025 నుంచి అసలైన పొలిటికల్ సినిమాను ఏపీ వెండి తెర మీద చూపించేందుకు జగన్ రెడీ అవుతున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.