జగన్ ములాఖత్ లతో బిజీ కావాల్సిందేనా ?
ఆయనను పరామర్శించేందుకు జగన్ గుంటూరు జైలుకు వస్తున్నారు.
By: Tupaki Desk | 11 Sep 2024 1:30 AM GMTవైసీపీ అధినేత జగన్ మరో ములాఖత్ కి రెడీ అవుతున్నారు. పార్టీలో యువ నేత. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్. ఆయనను పరామర్శించేందుకు జగన్ గుంటూరు జైలుకు వస్తున్నారు. అక్కడ ములాఖత్ ద్వారా జగన్ నందిగం సురేష్ తో మాట్లాడుతారు.
ఇదిలా ఉంటే అంతకు ముందు నెల్లూరు వెళ్ళి ఈవీఎం మిషన్ బద్దలు కొట్టారు అన్న వివాదంలో జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డిని కూడా ములాఖత్ ద్వారా ఈ మధ్యనే జగన్ పరామర్శించారు. అయితే జగన్ ఈ ములాఖత్ లు పరామర్శలు చేయడం లిస్ట్ చాలానే ఉంది అని అంటున్నారు. వరసబెట్టి వైసీపీ నేతలను అందరినీ అరెస్ట్ చేస్తోంది టీడీపీ కూటమి ప్రభుత్వం వారిని జైలు గోడల మధ్య బంధిస్తోంది. ఈ నేపధ్యంలో జగన్ వారికి భరోసా ఇవ్వడానికి ఈ ములాఖత్ లు చేస్తున్నారు. అయితే ఇదే పని మీద జగన్ ఇక మీదట ఉండాల్సి వస్తుందా అన్న సెటైర్లు కూడా పడుతున్నాయి.
ఎందుకంటే టీడీపీ కూటమి వేట మొదలెట్టింది. వైసీపీ నేతల మీద కేసులు పెడుతోంది. అలాగే పాత కేసులను తిరగతోడుతోంది. దాంతో వైసీపీ నేతలు కొందరు అజ్ఞాతంలో ఉన్నారు. మరి కొందరు సుప్రీం కోర్టు దాకా కూడా స్టేల విషయం లో వెళ్తున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే జగన్ ఇలా నిందితులను జైలు గోడల మధ్య కలుసుకుని ములాఖత్ జరపడం పట్ల కూడా విమర్శలు వస్తున్నాయి. పిన్నెల్లి ఈవీఎష్ మిషన్ ని బద్ధలు కొట్టడాన్ని సమర్ధించారా అని అపుడు టీడీపీ సహా ఇతర పార్టీ నేతలు విమర్శించారు. ఇపుడు టీడీపీ ఆఫీసు మీద దాడి కేసులో నందిగం సురేష్ ని అరెస్ట్ చేస్తే ఆయనను జగన్ పరామర్శించడం ఎంతవరకూ సమంజసం అని అంటున్న వారూ ఉన్నారు.
ఒక వైపు బెజవాడ ముంపునకు గురి అయి లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులైతే వారిని పరామర్శించాల్సిన వైసీపీ అధినాయకత్వం ఒకటి రెండు సార్లు మాత్రమే అక్కడికి వెళ్ళిందని అదే సమయంలో ఈ ములాఖత్ ద్వారా ఏ రకమైన సంకేతాలను పంపిస్తోంది అని అంటున్నారు.
అయితే తమ పార్టీని చెందిన నేతల మీద తప్పుడు కేసులు పెడితే అధినేత హోదాలో జగన్ పరామర్శించడం తప్పు ఎలా అవుతుంది అని వైసీపీ నుంచి కౌంటర్లు వస్తున్నాయి. మరో వైపు చూస్తే జగన్ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అలాగే క్యాడర్ కి మనో నిబ్బరం కలిగించాల్సి ఉందని కూడా గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సమయంలో ములాఖత్ అవసరమా అన్నది కూడా చర్చగా ఉందిట. మరి జగన్ నందిగం సురేష్ ని పరామర్శించిన తరువాత మీడియాతో ఏమి మాట్లాడుతారో చూడాల్సి ఉంది.