Begin typing your search above and press return to search.

జగన్ విజయమ్మ కలిశారు...భారతి దూరంగా !

ఈ సందర్భంగా తల్లీ కొడుకులు కొద్ది సేపు మాత్రమే మాట్లాడుకోవడం అందరి దృష్టిలో ఉంది. అదే సమయంలో మరో విశేషాన్ని కూడా మీడియా తన దృష్టికోణంలో నుంచి గమనించింది.

By:  Tupaki Desk   |   24 Dec 2024 2:09 PM GMT
జగన్ విజయమ్మ  కలిశారు...భారతి దూరంగా !
X

దివంగత నేత వైఎస్సార్ కుటుంబంలో విభేదాలు అందరికీ తెలిసిందే. అవి కాస్తా చివరికి ఆస్తుల వివాదం కోర్టుల దాకా వెళ్లి రచ్చ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆస్తుల వివాదం తర్వాత మొదటిసారి వైఎస్ జగన్ వైఎస్ విజయమ్మ కలిసి బహిరంగంగా కనిపించారు. దాంతో మీడియా తో పాటు అక్కడ ఉన్న వారికి అది అత్యంత ప్రాధాన్యత సంతరించకున్న వార్త అయింది. జగన్ నాలుగు రోజుల పర్యటన కోసం సొంత జిల్లా కడపకు వచ్చారు. ఆయన పులివెందులలోని ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అక్కడికి తల్లి విజయమ్మ కూడా వచ్చరు.

అయితే ఈ పర్యటనలో తల్లి విజయమ్మను జగన్ కలుసుకుని ముచ్చటించడం ఆసక్తిని రేపింది. అయితే ఈ ఇద్దరూ కూడా కొద్ది సేపు మాత్రమే మాట్లాడుకోవడం కనిపించింది. మరోవైపు చూస్తే విజయమ్మకు ఇచ్చిన సరస్వతీ పవర్ ఆస్తులను తిరిగి షర్మిలకు బదిలీ చేయాలని జగన్ గతంలో ట్రిబ్యునల్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. దంతో కొద్ది నెలల క్రితం ఏపీలో ఇది హాట్ టాపిక్ గా మారింది. అన్నా చెల్లెళ్ళు అయిన జగన్ షర్మిల మధ్య తీవ్రమైన ఆస్తి పోరుకు కూడా ఇది దారితీసింది.

ఆ తరువాత విజయమ్మ బహిరంగ లేఖ రాశారు. అలాగే వీడియో బైట్ ని కూడా విడుదల చేశారు. అందులో ఆమె వైఎస్ జగన్ షర్మిల ఇద్దరూ తన బిడ్డలే అన్నారు. రెండు కళ్ళుగా అభివర్ణించారు. అంతే కాదు, ఇద్దరూ కూడా ఆస్తులను సమానంగా పంచుకోవాలని కూడా సూచించారు.

ఇంకో వైపు చూస్తే ఈ ఆస్తులు అన్నీ జగన్ సొంతంగా సంపాదించుకున్నవి కాబట్టి వాటాల ప్రసక్తి లేదని వైసీపీ నేతలు చెబుతూ వచ్చారు. కానీ విజయమ్మ ప్రకటన కొంత వైసీపీకి ఇబ్బందిగా మారింది. ఇలా జరిగాక విజయమ్మతో జగన్ భేటీ కావడం ఇదే తొలిసారి అని చెప్పాలి.

ఈ సందర్భంగా తల్లీ కొడుకులు కొద్ది సేపు మాత్రమే మాట్లాడుకోవడం అందరి దృష్టిలో ఉంది. అదే సమయంలో మరో విశేషాన్ని కూడా మీడియా తన దృష్టికోణంలో నుంచి గమనించింది. అదేంటి అంటే వైఎస్ విజయమ్మ కోడలు,జగన్ సతీమణి వైఎస్ భారతి దూరంగా ఉండడం.

ఆమె తన అత్తగారు అయిన విజయమ్మ దగ్గర కాకుండా దూరంగా ఉండడాన్ని మీడియా ఫోకస్ చేస్తోంది. సాధారణంగా అయితే ఇడుపులపాయలో జరిగే కార్యక్రమాలలో అత్తా కోడలు సన్నిహితంగా కలసి మెలసిన దృశ్యాలు గతంలో కనిపించేవి. ఇపుడు అలాంటివి లేవని అంటున్నారు. అంతే కాకుండా ఒక గ్యాప్ అయితే స్పష్టంగా ఉందని అంటున్నారు. భారతి ముభావంగానే కూర్చున్నారు అని అంటున్నారు. దీంతో ఆస్తుల గొడవ దివంగత నేత కుటుంబాన్ని రెండుగా చీల్చేశాయా అన్న చర్చ సాగుతోంది.

వైఎస్సార్ అభిమానులు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంతా ఈ రకమైన సన్నివేశాలను చూడలేకపోతున్నారు. తొందరలో ఇవన్నీ పరిష్కారం అయితే బాగుంటుంది అని వారు ఆశిస్తున్నరు. అంతే కాదు కుటుంబం అంతా ఒక్కటిగా ఉండాలని అంతా కలసి ముచ్చటగా ఉండాలని కూడా కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇడుపులపాయకు వైఎస్సార్ కుటుంబం మొత్తం వచ్చింది. ప్రత్యేక పూజలను అక్కడ నిర్వహించారు.