Begin typing your search above and press return to search.

వెల్ కమ్ టూ 2025 : కోటి ఆశలతో జగన్

ఈ ఏడాది ఎంత తొందరగా ముగిస్తే బాగుండును అని ఆయన తప్పనిసరిగా అనుకునే ఉంటారు అని విశ్లేషకులు అంటారు.

By:  Tupaki Desk   |   31 Dec 2024 6:30 PM GMT
వెల్ కమ్ టూ 2025 : కోటి ఆశలతో జగన్
X

వైసీపీ అధినేత మాజీ సీఎం కి 2024 చేదుని మిగిల్చిన ఏడాదిగా ఉంది. ఈ ఏడాది ఎంత తొందరగా ముగిస్తే బాగుండును అని ఆయన తప్పనిసరిగా అనుకునే ఉంటారు అని విశ్లేషకులు అంటారు. ఎందుకంటే 2024 వచ్చేనాటికి జగన్ 151 సీట్లతో తిరుగులేని అధికారం చలాయిస్తున్న ముఖ్యమంత్రి. అయితే చిత్రంగా అదే ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో జగన్ ని గద్దె నుంచి దించేస్తూ జనం తీర్పు ఇచ్చేశారు. అది కూడా అలా ఇలా కాదు 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఒక్కసారిగా దించి పడేసారు.

ఏ అసెంబ్లీలో అయితే ఎదురులేకుండా సీఎం గా సింహాసనం అధిష్టించారో అదే అసెంబ్లీలో విపక్ష హోదా కూడా లేకుండా వైసీపీని చేశారు. దాంతో జగన్ ఏకంగా అసెంబ్లీకే ఒక నమస్కారం అనేసారు. ఇక తొలి ఆరేడు నెలలూ ఆయనకు విపక్షంలో భారంగానే గడచింది.

కూటమి ప్రభుత్వానికి అపూర్వమైన బలం దానికి తోడు చంద్రబాబు వ్యూహం లోకేష్ దూకుడు, పవన్ గ్లామర్, మోడీ అండ అన్నీ కలసి ఏపీలో వైసీపీకి చుక్కలు చూపించేశాయి. అది చాలదు అన్నట్లుగా వైసీపీ ఓటమి చెందగానే చాలా మంది నేతలు వరసబెట్టి పార్టీని వీడి పోయారు. ఇంకా ఆ పరంపర కొనసాగుతూనే ఉంది. అంతే కాదు వైసీపీ పునాదుల నుంచి ఉన్న వారు జగన్ కి అత్యంత సన్నిహితులు, సహచరులు, బంధువులు కూడా వైసీపీని వీడి పోయారు

ఇలా ఎటు చూసినా నిరాశ నిర్వేదం తప్ప ఏమీ మిగలని చోట వైసీపీ మౌనంగానే చేష్టలుడిపోయి అంతా చోద్యం చూసిన నేపధ్యం ఉంది. అలా 2024 ద్వితీయ అర్ధభాగం మొత్తం సాగింది. కొసమెరుపు ఏంటి అంటే డిసెంబర్ నెలలో తొలిసారిగా వైసీపీ జనంలోకి వచ్చింది. రెండు కీలకమైన అంశాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. రైతుల కోసం చేపట్టిన ఆందోళనలు అలాగే విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా అందోళనతో వైసీపీ క్యాడర్ లీడర్ రోడ్డు మీదకు వచ్చాయి. ఆ విధంగా ఎంతో కొంత సక్సెస్ అయితే వైసీపీకి దక్కింది.

ఇక అసలైన పోరాటానికి 2025ని వేదికగా జగన్ చేసుకోబోతున్నారు. ఈ ఏడాది జనవరి నెలాఖరు నుంచి జనంలోకి రానున్నారు. ఏకంగా ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు ఆయన ప్రజలలోనే ఉండబోతున్నారు. 2025లో ప్రజలు పూర్తిగా వైసీపీ వైపుగా వస్తారని కూటమి ప్రభుత్వం ఇదే ఏడాది తొలి అర్ధ భాగంలో ఏడాది పాలన పూర్తి చేసుకోబోతుందని దాని వల్ల జనాలకు వాస్తవాలు అన్నీ అర్ధమవుతాయని కూడా జగన్ భావిస్తున్నారు.

అందువల్ల మళ్లీ వైసీపీకి ఆదరిస్తారని, గత ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయని వర్గాలు కూడా ఈసారి తమకు అండగా నిలుస్తాయని కూడా తలపోస్తున్నారు. ఒక వైపు జనంతో మమేకం అవుతూనే ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక విధానాల మీద ఎప్పటికపుడు జనంలోకి వెళ్ళి నిరసనలు తెలియచేసే విధంగానూ 2025లో భారీ యాక్షన్ ప్లాన్ కి కూడా వైసీపీ సిద్ధపడుతోంది.

దీంతో పాటుగా 2026లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని భావిస్తోంది. దాంతో ఆనాటికి పార్టీని పటిష్టం చేసుకుంటే లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటవచ్చు అని కూడా లెక్కలేసుకుంటోంది. అంతే కాదు వైసీపీలో ఇప్పటిదాకా వీడిన నేతలు అంతా ఒక ఎత్తు అయితే ఆ కధ 2024తోనే సమాప్తం కావాలని 2025లో ఏ ఒక్కరూ పార్టీని వీడకుండా ఉంటారని కూడా ఆశిస్తోంది.

అంతే కాదు ఇక మీదట వైసీపీలోకి చేరికలు మొదలవుతాయని కూడా సరికొత్త ఆశలు పెంచుకుంటోంది. మొత్తానికి 2025 మీద కోటి ఆశలు పెట్టుకుని జగన్ జనంలోకి రాబోతున్నారు. మరి ఈ కొత్త ఏడాది వైసీపీకి ఏ రకమైన ఫలితాలను ఇస్తుందో చూడాల్సిందే అంటున్నారు.