Begin typing your search above and press return to search.

అంబటి సత్తెనపల్లిలో ఆయన్ని దించుతున్న జగన్ ?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ వీర విధేయుడు పార్టీలో సీనియర్ అయిన మాజీ మంత్రి అంబటి రాంబాబుకు షాక్ ఇస్తున్నారా అంటే అవును అనే పరిణామాలు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   9 Dec 2024 3:41 AM GMT
అంబటి సత్తెనపల్లిలో ఆయన్ని దించుతున్న జగన్ ?
X

వైసీపీ అధినేత వైఎస్ జగన్ వీర విధేయుడు పార్టీలో సీనియర్ అయిన మాజీ మంత్రి అంబటి రాంబాబుకు షాక్ ఇస్తున్నారా అంటే అవును అనే పరిణామాలు చెబుతున్నారు. ఆయన 2024 ఎన్నికల్లో పోటీ చేసి భారీ ఓటమిని చూసిన సత్తెనపల్లి అసెంబ్లీ సీటులోకి కొత్త ఇంచార్జిని జగన్ నియమిస్తున్నారు అని ప్రచారం విస్తృతంగా సాగుతోంది.

అంబటి రాంబాబుకు దీంతో సీటు పోయినట్లే అని అంటున్నారు. నిజానికి చూస్తే అంబటికి 2014 నుంచి మూడు సార్లు ఇదే నియోజకవర్గంలో జగన్ టికెట్ ఇచ్చారు. ఆయన రెండు సార్లు ఓడారు. 2019లో గెలిచి మంత్రిగా కూడా జగన్ కేబినెట్ లో పనిచేశారు. ఆయనను జగన్ బాపట్ల జిల్లా అధ్యక్షులుగా కూడా వైసీపీ తరఫున నియమించారు.

ఆ బాధ్యతల బరువుకు సత్తెనపల్లి తోడు ఎందుకు అనుకున్నారో ఏమో తెలియదు కానీ సత్తెనపల్లిని ఒక కీలక నేత చేతుల్లో పెట్టబోతున్నారు అని అంటున్నారు. ఆ కీలక నేత ఎవరో కాదు మంగళగిరి నుంచి రెండు సార్లు గెలిచి 2024లో టికెట్ దక్కించుకోలేకపోయిన జగన్ సన్నిహితుడు అయిన ఆళ్ల రామకృష్ణారెడ్డి అని అంటున్నారు.

ఈ నియోజకవర్గంలో కాపులు రెడ్లు రాజకీయంగా కీలక పాత్ర పోషిస్తున్నారు. దాంతో బలమైన రెడ్డి సామాజిక వర్గానికి ఈసారి టికెట్ ఇవ్వాలని జగన్ ఆలోచిస్తున్నారు. దాంతో ఆళ్ళను తెచ్చి ఇంచార్జి చేస్తారు అని అంటున్నారు. దీని మీద జగన్ అందరి ఆలోచనలు అభిప్రాయాలను తీసుకునే ఈ విధంగా చేస్తున్నారు అని అంటున్నారు.

ఇక చూస్తే సత్తెనపల్లిలో టీడీపీ తరఫున మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గెలిచి ఉన్నారు. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. దాంతో వైసీపీ కూడా అంబటిని మార్చినా కాపులకే ఇక్కడ ఇంచార్జిగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లుగా చెబుతున్నారు.

అదే సమయంలో రెడ్లు కూడా ఇక్కడ నుంచి గతంలో పలు మార్లు గెలిచారు. అందువల్ల వారు ఈ సీటు తమకే కేటాయించాలని కోరుతున్నారు. ఇక సత్తెనపల్లి మీద మొదటి నుంచి మోజు ఉన్న ఆళ్ళను అక్కడ పెట్టడం ద్వరా బలమైన రెడ్ల మద్దతుతో వచ్చే ఎన్నికల్లో గెలుపు బాట పట్టవచ్చు అన్నది జగన్ ఆలోచంగా చెబుతున్నారు. మొత్తానికి చూస్తే అంబటి సీట్లో ఆళ్లకు చాన్స్ అని పెద్ద ఎత్తున ప్రచారం అయితే సాగుతోంది. ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.