బాబు ష్యూరిటీ మోసానికి గ్యారెంటీ... జగన్ నిప్పులు!
అవును... చంద్రబాబు అబద్ధాలు, మోసాలను ప్రజలకు వివరిస్తానని వైఎస్ జగన్ అన్నారు.
By: Tupaki Desk | 6 Feb 2025 4:00 PM ISTఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి, చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టి తొమ్మిది నెలల తర్వాత ‘బాబు ష్యూరిటీ మోసానికి గ్యారెంటీ’ అని రుజువైందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. తాజాగా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన జగన్... తీవ్ర స్థాయిలో ప్రభుత్వంలో విమర్శలు చేశారు.
అవును... చంద్రబాబు అబద్ధాలు, మోసాలను ప్రజలకు వివరిస్తానని వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికల ముందు బటన్ నొక్కడం పెద్ద గొప్పా..? ముసలావిడ కూడా నొక్కుతుంది అని చెప్పి, సూపర్ సిక్స్ తో పాటు వందల సంఖ్యలో హామీలు ఇచ్చి, హామీలు అమలు చేయకపోతే చొక్కాపట్టుకోండి అని చెప్పిన హామీలు, ఇచ్చిన బాండ్లు ఏమయ్యాయి అని జగన్ ప్రశ్నించారు.
ఇదే సమయంలో.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తొమ్మిది నెలలో సుమారు 1 లక్షా 45 వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారని.. ఇన్ని అప్పులు చేసినా బటన్ నొక్కలేదని.. పేదలకు ఏమీ ఇవ్వలేదని.. మరి ఈ 1.45 లక్షల కోట్లు ఎవరి జెబుల్లోకి వెళ్లాయి అంటూ ప్రశ్నించిన జగన్... 9 నెలల్లో చేసిన అప్పులు రికార్డ్స్ బద్దలు అని కామెంట్ చేశారు.
అదేవిధంగా... ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఉద్యోగాలు ఏమీ లేవని చెప్పిన జగన్... వాలంటీర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పి చెతులెత్తేశారని.. సుమారు 2.60 లక్షల మంది వాలంటీర్లను ఉద్యోగాల్లోంచి తొలగించరని.. మరో 18 వేల ఉద్యోగాలను బేవరేజెస్ నుంచి తీసేశారని.. పీఆర్సీ ఛైర్మన్ ను బలవంతంగా రాజీనామా చేయించారని జగన్ మండిపడ్డారు.
తన ప్రభుత్వ హయాంలో ఏపీలో నాలుగు పోర్టులు నిర్మించామని.. అందులో రామాయపట్నం పోర్టును 75 శాతం పూర్తి చేశామని.. 10 షిప్పింగ్ హార్బర్స్ నిర్మాణం చేపట్టామని.. వీటిలో రెండు హార్బర్లు తమ హయాంలోనే ప్రారంభిస్తే.. ఒకటి ఇటీవల ప్రధాని వర్చువల్ గా ప్రారంభించారని జగన్ తెలిపారు.
అయితే.. బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసులన్నీ అమ్మేస్తున్నారని జగన్ ఫైర్ అయ్యారు. తమ హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణాలు జరిగితే... చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తమ రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు వద్దు అంటూ కేంద్రానికి లేఖ రాశారని.. ఆ మెడికల్ కాలేజీలు అన్నీ ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని జగన్ తీవ్ర విమర్శలు చేశారు.