Begin typing your search above and press return to search.

ముప్పు కూటమి నుంచి కాదు...అందుకే జగన్ కి ధైర్యం !

పార్టీ నుంచి ఎంతమంది వెళ్ళిపోయినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ చాలా ధైర్యంగా ఉన్నారు.

By:  Tupaki Desk   |   7 Feb 2025 8:50 AM IST
ముప్పు కూటమి నుంచి కాదు...అందుకే జగన్ కి ధైర్యం !
X

పార్టీ నుంచి ఎంతమంది వెళ్ళిపోయినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ చాలా ధైర్యంగా ఉన్నారు. అది చాలా మందికి అతి విశ్వాసంగా కనిపిస్తోంది. కానీ లోతుగా ఆలోచిస్తే జగన్ ధీమా వెనక బలమైన కారణాలు ఉన్నాయి. అంతే కాదు సరైన రీజనింగ్ కూడా ఉంది. అందుకే జగన్ కూటమి నుంచి ఎంతగా సవాళ్ళు వస్తున్నా లైట్ తీసుకుంటున్నారు. మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చెప్పగలుగుతున్నారు.

పార్టీ నుంచి గడచిన ఎనిమిది నెలలుగా ఎంతో మంది వెళ్ళిపోయారు. అందులో బిగ్ షాట్స్ చాలా మంది ఉన్నారు. ఆఖరుకు విజయసాయిరెడ్డి వెళ్ళిపోవడమే బిగ్ ట్విస్ట్ అని అంటున్నారు. అయినా జగన్ పెద్దగా పట్టించుకోవడం లేదు అంటే ఆయన ఆలోచనలే వేరు అని అంటున్నారు. అవి ధీమాతో కూడినవి అని కూడా అంటున్నారు.

ఏపీలో రెండు పార్టీల వ్యవస్థ ఎలా ఉందో రెండు రాజకీయ సిద్ధాంతాలు వ్యవస్థ కూడా అలాగే ఉంది. ఒకటి మధ్యేవాద రాజకీయ సిద్ధాంతం. అది బీజేపీ తెలుగుదేశం జనసేన వంటి పార్టీలను ఆకట్టుకుంటుంది. ఉన్నత స్థాయి వర్గాలు, మధ్యతరగతి, పై మధ్య తరగతి వంటివి ఈ రాజకీయ ఫిలాసఫీకి కట్టుబడి ఉంటాయి. దాంతో ఈ వర్గాలు ఎపుడూ ఈ పార్టీల వైపు మొగ్గు చూపిస్తారు.

ఇక అట్టడుగు వర్గాలు ఉన్నాయి. అలాగే మైనారిటీ వర్గాలు కూడా ఉన్నాయి. ఈ వర్గాల రాజకీయ ఫిలాసఫీ వేరు. వీరంతా బీజేపీ సెంట్రిక్ పాలిటిక్స్ కి దూరం పాటిస్తారు. అంతే కాదు మధ్యేవాద రాజకీయ సిద్ధాంతానికి వీరు యాంటీగా తమదైన రాజకీయ ఫిలాసఫీని ఇష్టపడతారు.

ఈ వర్గాలు మొదట కాంగ్రెస్ ఆ తరువాత వైసీపీకి అండగా ఉన్నాయి. ఆ విధంగా చూస్తే రెండు పార్టీల వ్యవస్థ గా పైకి ఏపీలో కనిపించినా రెండు బలమైన సిద్ధాంతాల మధ్య పోరాటంగా లోతుగా చూస్తే అర్ధం అవుతుంది. అలా చూసినపుడు కూటమికి మద్దతుగా ఉన్న ఫిలాసఫీ కానీ వర్గాలు కానీ వైసీపీకి అండగా ఉన్న వర్గాలను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేసినా అవి ఫలించే అవకాశాలు అంతగా ఉండవు.

అందుకే వైసీపీకి 40 శాతం ఓటు బ్యాంక్ 2024 ఎన్నికల్లోనూ దక్కింది. అన్ని పార్టీలు కలసి వచ్చినా వైసీపీ బలంగా ఉంది అంటే ఈ సైద్ధాంతిక భూమిక ఆ పార్టీని కాపాడుతోంది అన్న మాట. మరో వైపు చూస్తే కనుక ఈ వర్గాలు కాంగ్రెస్ కనుక ఏపీలో బలపడితే మళ్ళీ అటు వైపు మొగ్గు చూపడం ఖాయం. కానీ ఇపుడున్న పరిస్థితుల్లో ఏపీలో కాంగ్రెస్ బలపడేందుకు ఆస్కారం తక్కువ. దాంతోనే వైసీపీకి ఈ ధీమా వచ్చింది అని అంటున్నారు.

సిద్ధాంత పునాది ఉన్న పార్టీలకు ఓటములు పలకరించినా తిరిగి లేచేందుకు ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకు టీడీపీ. ఆ పార్టీని అల్లుకుని ఉన్న వారంతా తిరిగి గెలిపించుకుంటారు. వైసీపీకి అదే రకమైన పొలిటికల్ ఫిలాసఫీ ఉంది. దాంతోనే వైసీపీ మళ్ళీ గెలుస్తామని అంటోంది. రాజకీయ పార్టీలతో పాటు ఈ సిధ్దాంతాల మధ్య జరిగే పోరాటంలో ఒకసారి ఒక పార్టీ గెలిస్తే మరోసారి ఇంకో పార్టీ గెలుస్తుంది. ఇది ఆనవాయితీగా ఉంటోంది.

ఇక చూస్తే కూటమి వదిలేసిన అలాగే కూటమికి అట్రాక్ట్ కానీ వర్గాలే వైసీపీ బలాలు. అలా ఆలోచిస్తే వైసీపీకి కావాల్సినంతగా పొలిటికల్ స్పేస్ ఏపీలో ఉంది. ఏపీలో ఎన్డీయేతర వర్గాలు అన్నీ కచ్చితంగా జగన్ వెంట ఉంటాయని రాజకీయ విశ్లేషకులూ చెబుతారు. ఎన్డీయేలో ఉన్న పార్టీల సిధ్దాంతాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటం జగన్ కి ఎపుడూ కలసి వస్తూనే ఉంటుంది.

జగన్ తాను నాయకత్వం వహించి పార్టీని దూకుడుగా ముందుకు తీసుకుని పోతే చాలు. ఇక నాయకులు అన్న వారు గాలి మారితే అటు నుంచి ఇటూ వస్తారు. అలాగే కొత్త నీరూ వస్తుంది. అందుకే జగన్ ధీమాగా మేమే గెలుస్తామని అంటున్నారు. కూటమి పార్టీలు వైసీపీ లీడర్స్ ని తీసుకోగలవు కానీ వైసీపీని మోస్తున్న పొలిటికల్ ఫిలాసఫీని ఏమీ చేయలేవని అంటున్నారు. ఏపీ మీద ఎంతో కొంత ద్రవిడ వాద ప్రభావం ఉంది. ఆ ప్రభావంతో ఉన్న వర్గాలే వైసీపీకి ఇపుడు కొండంత అండ. అదే శ్రీరామ రక్ష కూడా అన్నది సిసలైన విశ్లేషణ..