పవన్ మీద పెద్ద డిమాండ్ నే పెట్టిన జగన్!
ఒకరు ఏపీ ఉప ముఖ్యమంత్రి. మరొకరు మాజీ ముఖ్యమంత్రి. ఇద్దరి హోదాలలో మార్పు భారీగా ఉంది.
By: Tupaki Desk | 21 Nov 2024 3:53 AM GMTఒకరు ఏపీ ఉప ముఖ్యమంత్రి. మరొకరు మాజీ ముఖ్యమంత్రి. ఇద్దరి హోదాలలో మార్పు భారీగా ఉంది. అయితే గత అయిదేళ్ళలో ఇద్దరి మధ్య సాగిన రాజకీయ సమరం మరోసారి కొనసాగుతోంది అనే చెప్పాలి. గత అయిదేళ్లలో ముఖ్యమంత్రి జగన్ అధికారంలో ఉంటే జనసేన అధినేతగా పవన్ వైసీపీ మీద జగన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు.
ఇక కూటమి కట్టడంలో పవన్ చూపించిన పట్టుదల వల్ల అది సక్సెస్ అయి ఏపీలో వైసీపీ దారుణమైన పరాజయం పాలు అయింది. ఇపుడు వైసీపీ విపక్షంలోకి వచ్చింది. జగన్ ఎపుడూ చంద్రబాబు నే టార్గెట్ చేసుకుంటూ ఉంటారు. ఆయన మీదనే ఆరోపణలు అన్నీ ఎక్కుపెడతారు.
కానీ ఆయన తాజాగా పెట్టిన ప్రెస్ మీట్ లో బాబుతో పాటు పవన్ కళ్యాణ్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏకంగా 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని ఇది దేశంలోనే అతి పెద్ద విమెన్ ట్రాఫికింగ్ అని ఊరూ వాడా తిరిగి పవన్ తప్పుడు ప్రచారం చేశారు అని జగన్ ఫైర్ అయ్యారు.
అయితే కూటమి నాయకత్వంలో ప్రస్తుతం సాగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానం చూస్తే కనుక 2019 నుంచి 2024 మధ్యలో కేవలం 46 మంది మాత్రమే అదృశ్యం అయినట్లుగా అధికారిక లెక్కలలో చెప్పారని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆ జవాబుని మీడియాకు జగన్ చూపించారు. ఇందులో 36 మంది మీద కేసులు కట్టడం జరిగిందని కూడా చెప్పారు
మరి ఏకంగా 30 వేల మంది అదృశ్యం అయ్యారని పవన్ ఏ విధంగా ఆరోపణలు చేస్తారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షంలో ఉన్నపుడు తన చిత్తం వచ్చినట్లుగా మాట్లాడిన పవన్ కి నిజాయితీ ఉంటే క్షమాపణలు చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు
మొత్తానికి చూస్తే జగన్ పవన్ మీద మొదటిసారి ఈ స్థాయిలో విరుచుకు పడడం అది కూడా ఒక విధాన పరమైన అంశం మీద ఆయనను కార్నర్ చేస్తూ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం విశేషం. అయితే పవన్ విపక్షంలో ఉన్నపుడే కాదు ఉప ముఖ్యమంత్రిగా కూడా ఇటీవల కొన్ని సందర్భాల్లో గత ప్రభుత్వ హయాంలో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని చెబుతున్నారు
వారి మీద గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే పవన్ తన ఆరోపణలకు అలా కట్టుబడి ఉన్నారని అంటున్నారు. మరి పవన్ జగన్ చేసిన ఈ డిమాండ్ కి క్షమాపణలు చెబుతారా అంటే చూడాల్సిందే అని అంటున్నారు.