వరదల వేళ కూటమికి భారీ చాన్స్ ఇస్తున్న జగన్ ?
ఏపీ వరదల కోరలలో చిక్కుకుంది. ఎంతలా అంటే బుడమేరు పొంగి విజయవాడను అతలాకుతలం చేసింది.
By: Tupaki Desk | 6 Sep 2024 2:30 AM GMTఏపీ వరదల కోరలలో చిక్కుకుంది. ఎంతలా అంటే బుడమేరు పొంగి విజయవాడను అతలాకుతలం చేసింది. గత కొన్ని రోజులుగా అదే పరిస్థితి ఉంది. అయినా విజయవాడ ఇంకా కుదుట పడలేదు. మరో వైపు చూస్తే గోదావరి ఉగ్ర రూపం దాలుస్తోంది. ఏపీలో మరిన్ని తుఫాను గండాలు ఉన్నాయి. దాంతో ఏపీలో ప్రజలంతా బిక్కుబిక్కుమంటున్నారు.
ముఖ్యంగా బెజవాడ కష్టాలు కడగండ్లు అన్నీ ఇన్నీ కావు. వరద బాధితులను జగన్ రెండు విడతలుగా పర్యటించి పరామర్శించారు. అంతే కాదు కోటి రూపాయలు పార్టీ విరాళంగా ప్రకటించారు. మరో వైపు చూస్తే వరద మీద టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్లుగా రాజెకీయ రచ్చ సాగుతోంది. గత ప్రభుత్వం నిర్వాకం వల్లనే వరదలు వచ్చాయని కూటమి ధాటీగా విమర్శిస్తోంది.
అదే విధంగా బుడమేరు చుట్టూ ఆక్రమణలు వైసీపీ ఏలుబడిలోనే పెరిగిపోయాయని కూడా చెబుతోంది. ఇక చంద్రబాబు చూస్తే ఏకంగా విజయవాడ కలెక్టరేట్ లోనే మకాం వేశారు. ఆయన అక్కడ నుంచే పరిస్థితిని అధ్యయనం చేస్తున్నారు. వరసగా క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. బాధితులకు సహాయ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది.
అన్ని పార్టీలు కూడా ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే వైఎస్ జగన్ మాత్రం విదేశీ యాత్రకు ఈ కీలకమైన సమయంలో వెళ్తున్నారు అని అంటున్నారు. ఆయన యూకే టూర్ కి సీబీఐ కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. దాంతో జగన్ ఈ నెల 25 వరకూ యూకే టూర్ ని ప్లాన్ చేసుకున్నారు.
దాంతో ఆయన టూర్ లో మార్పులు ఏమైనా ఉన్నాయా అన్నదే చర్చగా ఉంది. అయితే జగన్ మాత్రం టూర్ కి వెళ్ళేందుకే సర్వం సిద్ధం చేసుకున్నారు అని ప్రచారం సాగుతోంది. దాంతో జగన్ కనుక విదేశీ టూర్ కి వెళ్తే వైసీపీ టీడీపీ కూటమికి గోల్డెన్ చాన్స్ ఇచ్చినట్లే అంటున్నారు. ఏపీలో వరదల గుప్పిట్లో చిక్కుకుని అతలాకుతలం అయిన వేళ మాజీ సీఎం, విపక్ష నేతగా ఉన్న జగన్ విదేశీ టూర్ కి వెళ్లడం ద్వారా భారీ విమర్శలకు గురు అవుతారు అని వైసీపీలోనూ చర్చ సాగుతోంది.
దీంతో వైసీపీలోనూ దీని మీద చర్చ సాగుతోంది అని అంటున్నారు. ఏపీలో వరదలు పెద్ద ఎత్తున ఉన్నాయి. దాంతో ప్రజలు అంతా సాయం కోసం అల్లాడుతున్నారు. నిన్నటి దాకా ప్రభుత్వంలో ఉన్న వైసీపీ కూడా తనదైన సాయం చేయాల్సి ఉంది. ప్రజలతో ముడిపడి ఉన్న రాజకీయ పార్టీలు ఈ సమయంలో అలాగే ఆలోచించాల్సి ఉంటుంది. మరి జగన్ కనుక కొన్నాళ్ళ పాటు తన పర్యటన వాయిదా వేసుకుని వరదల పరిస్థితి ఒక కొలిక్కి వచ్చేదాకా ఉంటారా అన్నదే చర్చగా ఉంది.
అలా కాకపోతే మాత్రం వైసీపీ కూటమి నుంచి దారుణమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. ప్రజలు నానా ఇబ్బందులు పడుతూంటే విదేశీ యాత్రలా అని అనేస్తారు. వైసీపీ నేతలు కూడా ఇదే విషయం ఆలోచిస్తున్నారు. జగన్ మరి ఏమి ఆలోచిస్తారో చూడాలని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ టూర్ మీదనే అందరి చూపు ఉంది.
ఇంతటి విపత్కర పరిస్థితిల్లో జగన్ యూకే టూర్ వెళ్తే అది వైసీపీకి బూమరాంగ్ అవుతుంది అని అంటున్నారు రేపటి రోజున ప్రజల వద్దకు వైసీపీ వెళ్ళినా ఇదే విషయం టీడీపీ కూటమి ప్రచారం చేస్తుందని దానికి సమాధానం చెప్పుకోవడం కూడా కష్టమే అని అంటున్నారు.