అసెంబ్లీలో జగన్ !
మాటకు వస్తే చాలు మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా కూటమిలో పెద్దలు అయినా గత ప్రభుత్వం జగన్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు
By: Tupaki Desk | 5 March 2025 7:00 PM ISTఏపీ అసెంబ్లీలో జగన్ ప్రస్తావన లేకుండా ఏ చర్చా సాగడం లేదు. మాటకు వస్తే చాలు మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా కూటమిలో పెద్దలు అయినా గత ప్రభుత్వం జగన్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ నెల 12 కి అచ్చంగా పది నెలలు నిండుతుంది.
ఇంకా గత ప్రభుత్వం అంటూ వైసీపీ మీద సభలో విమర్శలు చేయడం ద్వారా జగన్ సభకు గైర్ హాజరు అయినా ఆ లోటుని తీరుస్తున్నారు అని అంటున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు విపక్ష హోదా జగన్ కి ఎందుకు ఇవ్వలేకపోతున్నామని చెబుతూ జగన్ ఆయనకు గతంలో రాసిన లేఖను సభ ముందు ఉంచారు. దాని మీద కూడా చర్చ సాగింది.
ఇక మరో సందర్భంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే మాట్లాడుతూ సభకు ప్రతిపక్షం వస్తే బాగుంటుంది అని ఆకాంక్షను వ్యక్తం చేశారు. దాని మీద ఉప సభాపతి మాట్లాడుతూ కొన్ని కోరికలు తీరనివి అని వ్యాఖ్యానించడం వంటివి చూస్తూంటే అసెంబ్లీ జరిగిన ప్రతీ రోజూ ఏదో ఒక సందర్భంలో జగన్ ప్రస్తావన వస్తోంది.
అంతే కాదు సభలో వైసీపీ మీద విమర్శలు కూడా అంతా చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వాలన్నది సభలో చట్టం అయితే లేదు అని నిపుణులు అంటున్నారు. స్పీకర్ వివేచన తో ఏమైనా చేయవచ్చు అని అంటున్నారు. గతంలో తెలంగాణా అసెంబ్లీలో కేవలం ఏడు మెంబర్స్ మాత్రమే ఉన్నా మజ్లిస్ కి విపక్ష హోదా ఇచ్చారని అంటున్నారు.
కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నా బీజేపీకి గత ఢిల్లీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాని ఇచ్చారు. ఇలా చూసుకుంటే పోతే ఇచ్చిన సభలూ ఉన్నాయి. అలాగే 2014 నుంచి 2024 వరకూ మధ్యలో రెండు సార్లు పార్లమెంట్ లో కాంగ్రెస్ కి పది శాతానికి సరిపడా సీట్లు రాలేనందున విపక్ష హోదా ఇవ్వలేదు.
దాంతో ఈ అంశం మీద ఎవరిని తోచిన పాయింట్ ని వారు తీసుకుని మాట్లాడవచ్చు. జగన్ విపక్ష హోదా ఇవ్వవచ్చు అని ఢిల్లీ అసెంబ్లీని చూపిస్తే కూటమి పెద్దలు అయితే గతంలో కాంగ్రెస్ ని ఇవ్వని సంగతిని చూపిస్తారు.
దాంతో ఈ వివాదం అయితే తెలేదు కాదు, వైసీపీ సభకు హాజరయ్యేది అయితే లేనే లేదు. ఈ విధంగా ఏపీ 16వ అసెంబ్లీ సెషన్ జగన్ ఆయన ఎమ్మెల్యేలు లేకుండా ముగుస్తుందా అన్నది కూడా ఉంది. ఈ విషయం మీద న్యాయ పోరాటం వైసీపీ చేస్తోంది కానీ కోర్టులు ఎంతవరకూ జోక్యం చేసుకుంటాయో కూడా తెలియదు అని అంటున్నారు. మొత్తానికి అసెంబ్లీకి గైర్ హాజర్ అవుతున్నా జగన్ సభలో పరోక్షంగా తన మీద తన పార్టీ మీద ప్రభుత్వం మీద చర్చ జరిగేలా చూసుకుంటున్నారా అన్నది కూడా ఉంది మరి.