జమిలికి జై... మన తీరు మారదు: జగన్!!
త్వరలో నే ఎన్నికలు రానున్నాయని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. పార్టీ నాయకులు, కార్యకర్తలు రెడీగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.
By: Tupaki Desk | 17 Oct 2024 10:40 AM GMTవైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. జమిలి ఎన్నికలకు జై కొట్టారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. ఎదుర్కొ నేందుకు నాయకులు, కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉండాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. తాజాగా పార్టీ సీనియర్ నాయకులతో భేటీ అయిన జగన్.. భవిష్యత్తు కార్యాచరణపై వారితో చర్చించారు. త్వరలో నే ఎన్నికలు రానున్నాయని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. పార్టీ నాయకులు, కార్యకర్తలు రెడీగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.
`వన్ నేషన్-వన్ ఎలక్షన్`కు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. మనం కూడా దానికి సిద్ధమే. ఈ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. మనం రెడీగా ఉండాలి. ఆదిశగా అందరూ ఆలోచన చేయాలి. పార్టీని బలోపేతం చేయడంతోపాటు.. దేశంలోనే నెంబర్ 1 పార్టీగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. పార్టీలో నేతలు సమన్వయంతో ముందుకు సాగాలి. కీచులాటలు వద్దు. కష్టపడేవారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రమోషన్లు కూడా ఉంటాయి`` అని జగన్ తేల్చి చెప్పారు.
ఇక, పార్టీలు మారే సంగతి ప్రస్తావన వచ్చినప్పుడు.. ``ఎవరి ఇష్టం వారిది. ఇది ప్రజల కోసం పనిచేసే పార్టీ. దీనిలో ఉన్నవారంతా ప్రజల మనుషులు. మనం ప్రజలకోసమే ఉన్నాం. వారి సమస్యలు పట్టించు కునేందుకు మీరు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రజల మధ్య ఉండాలి. వారికి మద్దతుగా వ్యవహరించాలి`` అని జగన్ తెలిపారు. త్వరలోనే పార్టీలో నియామకాలు ఉంటాయని.. కష్టపడుతున్నవారికి తగిన విధంగా గుర్తింపు ఉంటుందని జగన్ వ్యాఖ్యానించారు.
కాగా.. ఈ సారి కూడా సోషల్ ఇంజనీరింగ్‌కే ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు జగన్ చెప్పారు. ``ఈ ఎన్నికల్లో ఫలితం చూసిన తర్వాత.. చాలా మంది సోషల్ ఇంజనీరింగ్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ, మనం చేసింది తప్పుకాదు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న సంకల్పంతో ముందుకు వెళ్లాం. భవిష్యత్తులోనూ అందరికీ అవకాశాలు ఉంటాయి`` అనిజగన్ పేర్కొన్నారు. కాగా, ఈ సమావేశానికి పిలిచిన వారిలో కొందరు డుమ్మా కొట్టడం గమనార్హం.