ఇలా అయితే కేరాఫ్ తాడేపల్లి గానే ?
వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తాడో పేడో తేల్చుకునే నేతగా జనాలకు కనిపించ బట్టి ఆయనకు అంతా గతంలో నీరాజనం పట్టారు.
By: Tupaki Desk | 8 Oct 2024 3:44 AM GMTవైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తాడో పేడో తేల్చుకునే నేతగా జనాలకు కనిపించ బట్టి ఆయనకు అంతా గతంలో నీరాజనం పట్టారు. అక్కడ ఏటికి ఎదురీదే నైజమే సూపర్ ఫ్యాన్ మెయిల్ ని క్రియేట్ చేసింది. 2014 నుంచి 2019 దాకా జగన్ నిర్వహించిన విపక్ష పాత్ర అమోఘం అని కూడా చెప్పాల్సిందే.
ఆనాడు ఆయన హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉండేవారు. కానీ ఏపీలోనే దాదాపుగా ఆ అయిదేళ్ళూ గడిపారు. ఏ సమస్య వచ్చినా వెంటనే వాలిపోయేవారు. నాటి టీడీపీ ప్రభుత్వాన్ని గడగడలాడించే వారు. జగన్ వస్తున్నారు అంటే అప్పట్లో ఫుల్ అటెన్షన్ మీడియాకు ఉండేది. ప్రభుత్వం కూడా అప్రమత్తం అయ్యేది.
ఇపుడు చూస్తే జగన్ లో ఆ ఫైర్ కనిపించడం లేదు అని అంటున్నారు. జగన్ అన్న లీడర్ ఒకసారి ఒక డెసిషన్ తీసుకుంటే ఆరు నూరు అయినా అది జరిగి తీరాల్సిందే. ఆయన ఒక టూర్ పెట్టుకుంటే అక్కడికి వెళ్ళి తీరాల్సిందే. కానీ జగన్ ఇటీవల కాలంలో రెండు పర్యటనలను క్యాన్సిల్ చేసుకున్నారు. అది కూడా సరైన రీజన్లు లేకుండానే.
ఆయన గత నెల 27న తిరుమల రావాలనుకున్నారు. కాలినడకన స్వామి వారిని దర్శించుకోవాలని అనుకున్నారు. అయితే జగన్ పర్యటన పట్ల కూటమి నేతలు నిరసనలు తెలిపారు. హిందూ సంస్థలు కూడా రంగంలోకి దిగాయి. ఒక విధంగా కొంత ఉద్రిక్తత అయితే తిరుపతిలో ఏర్పడింది. సెక్షన్ 30ని అమలు చేశారు.
దాంతో జగన్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. అయితే జగన్ రాజకీయంగా ఇక్కడే తప్పు చేశారు అని అంటున్నారు. ఆయన తిరుమల వెళ్లాలీ అంటే శ్రీవారిని దర్శించుకోవాలీ అంటే డిక్లరేషన్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూనే ఆందోళన చేశారు. దానికి చెక్ పెట్టేందుకు జగన్ హుందాగా ఒక మాజీ సీఎం గా డిక్లరేషన్ ఇచ్చేస్తే కూటమి డిఫెన్స్ లో పడేది కదా అన్న చర్చ కూడా ఉంది.
అంతే కాదు అప్పటికే మనో భావాలు దెబ్బ తిని ఉన్న హిందువులు కూడా వైసీపీ పట్ల జగన్ పట్ల సాఫ్ట్ కార్నర్ చూపించే వీలు ఉండేది కదా అన్న ప్రశ్నలూ వచ్చాయి. కానీ జగన్ మాత్రం అలా చేయలేదు. పైగా ఆయన తనను తిరుమల రాకుండా అడ్డుకున్నారు అని మీడియా సమావేశం పెట్టి విమర్శించారు.
అయితే ఆయన డిక్లరేషన్ ఇవ్వకూడదనే తన టూర్ రద్దు చేసుకున్నారు అని కూటమి నేతలు అంతా కౌంటర్లు వేశారు. అదే జనంలోకి బలంగా వెళ్ళిపోయింది. ఇక ఆ తరువాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కుమార్తెతో డిక్లరేషన్ ఇప్పించి జగన్ చేసిన తప్పు ఏంటో లోకానికి చాటడం ద్వారా కార్నర్ చేశారు. దాంతో జగన్ తిరుమల టూర్ రద్దు అన్నది ఆయనకే బూమరాంగ్ అయింది అన్న ప్రచారమూ సాగింది.
ఇక చూస్తే లేటెస్ట్ గా పుంగనూరు టూర్. జగన్ ఈ నెల 9న పుంగనూరు వెళ్ళి హత్యకు గురి అయిన బాలిక అస్పియా కుటుంబాన్ని పరామర్శించాల్సి ఉంది. అయితే జగన్ ఈ విషయంలో కూడా చురుకుగా స్పందించలేదని అంటున్నారు. ఎందుకంటే అస్పియా కిడ్నాప్ అయింది సెప్టెంబర్ 29న, ఆమె చనిపోయింది అని తెలిసింది అక్టోబర్ 2. అంటే జగన్ పెట్టుకున్న పరామర్శ షెడ్యూల్ ఎంత లేట్ గా ఉందో అర్ధమవుతోంది అంటున్నారు. బాలిక హత్య జరిగింది అన్నది తెలిసిన వెంటనే జగన్ వెళ్ళి ఆ కుటుంబాన్ని ఓదారిస్తే వైసీపీ చిత్తశుద్ధి బయటపడేది అని అంటున్నారు.
ఇక పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డి పరామర్శించారు కూటమి ప్రభుత్వం అలెర్ట్ అయింది. వరసబెట్టి ముగ్గురు మంత్రులు బాలిక ఇంటికి వెళ్ళి పరామర్శించారు. చంద్రబాబు కూడా ఫోన్ ద్వారా వారిని పరామర్శించి భరోసా ఇచ్చారు. దీంతోనే జగన్ వచ్చి చేసేది ఏముంది అని టూర్ రద్దు చేసుకున్నారా అన్న చర్చ కూడా ఉంది.
మంత్రులు వచ్చి వెళ్ళినా ఒక ప్రతిపక్ష నేతగా జగన్ పరామర్శించి ఉంటే బాగుండేది అన్న మాట వింపిస్తోంది. ఇక పుంగనూరు లో కూడా జగన్ టూర్ సందర్భంగా ఉద్రిక్తతలకు ఆస్కారం ఉంటుందని ఆయన రాక ముందు ఆంక్షలు పెడతారని కూడా ప్రచారం సాగింది. మరి ఈ ప్రచారం వల్ల కూడా టూర్ క్యాన్సిల్ అయిందా అన్న చర్చ కూడా ఉంది.
ఏది ఏమైనా జగన్ టూర్ పెట్టుకుంటే సహజంగా కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టేలాగే చూస్తుంది. మరి దానిని ఆలోచించి టూర్లు క్యాన్సిల్ చేసుకుంటే ఎలా అని అంటున్నారు. ఇదే తీరున టూర్లు రద్దు చేసుకుంటూ పోతే కేరాఫ్ తాడేపల్లిగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది అని అంటున్నారు. మొత్తానికి జగన్ రెండు టూర్లు ఇటీవల కాలంలో రద్దు కావడం మాత్రం ఒక చర్చగానే ఉంది.