మారిన నేత.. కేరాఫ్ జగన్... నిజమేనా.. !
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లో మారిన మనిషిని చూడొచ్చా? ఇప్పుడు ఇదే ప్రశ్న వైసీపీలో వ్యక్తమవుతోంది.
By: Tupaki Desk | 21 Oct 2024 4:44 AM GMTవైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లో మారిన మనిషిని చూడొచ్చా? ఇప్పుడు ఇదే ప్రశ్న వైసీపీలో వ్యక్తమవుతోంది. ఆయన పూర్తిగా మార్పు దిశగా అడుగులు వేస్తున్నారా అంటే ప్రస్తుతం జరిగిన నాలుగు సమావేశాలను గమనిస్తే కొంత మార్పు అయితే కనిపిస్తోంది. ఒకప్పుడు అంతా ''నేనే'' ''నన్ను చూసే ప్రజలు ఓట్లు వేశారు'' ''నేను ఇచ్చిన టికెట్లు నేను చేసిన ప్రచారంతోనే ఎమ్మెల్యేలు గెలిచారు'' అని బహిరంగంగా చెప్పకపోయినా అంతర్గత సమావేశాల్లో పదేపదే జగన్ చెప్పుకొచ్చారు.
''నేను లేకపోతే నీకు పదవి ఏముంది అన్న'' అంటూ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొందరు కొత్త ముఖాలను పరిచయం చేసినప్పుడు చాలామంది ''వాళ్లు గెలుస్తారా గెలవరా'' అని సందేహం వ్యక్తం చేసిన సమయంలో ''అసలు వాళ్లను చూసి ఎవరు ఓటేస్తారు నన్ను చూసి కదా ఓటేస్తారు'' అని చాలా గర్వంగా జగన్ చెప్పుకొచ్చారు. మైలవరం అదేవిధంగా సింగనమల నియోజకవర్గాల్లో ఏ మాత్రం ప్రభావం చూపించలేని వ్యక్తులను నాయకులుగా నిలబెట్టి టికెట్లు ఇచ్చినప్పుడు జగన్ ఇదే ధైర్యం, ఇదే 'నేను' అనే భావనను ప్రదర్శించారు.
''మొత్తంగా అసలు నాయకుల ప్రమేయం ఏమీ లేదు నేను చెప్పింది నేను చేసిందే శాసనం నన్ను చూసే గెలిపిస్తున్నారు'' అనే వాదనను జగన్ ఎక్కువగా వినిపించారు. అయితే భయంకరమైన ఓటమి తర్వాత ఆయనలో కొంత రియలైజేషన్ కనిపించినట్టు తెలుస్తోంది. తాజాగా జరిగిన నాలుగు సమావేశాల్లో కూడా ''మీరంతా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుంది. క్షేత్రస్థాయిలో మీరు చేసే ప్రచారంతోనే పార్టీ పుంజుకుంటుంది. పార్టీలో అందరూ కష్టపడాలి'' అని జగన్ చెప్పుకొచ్చారు.
నిజానికి 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు కూడా ఇలా చెప్పలేదు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించండి అని మాత్రమే గీతోపదేశం చేసిన జగన్.. ఇప్పుడు మాత్రం మీరు పని చేయండి మీరు ప్రజల్లోకి వెళ్ళండి మీరు బలంగా ఉండండి అని చెప్పడం ద్వారా తన వల్ల పార్టీ బలోపేతం కాలేదు కాబోదు అని ఒప్పుకున్నట్టే అయింది. దీనిని బట్టి భవిష్యత్తులో వైసిపి కార్యకర్తలకు నాయకులకు జగన్మోహన్ రెడ్డి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో పాటు వారికి గుర్తింపు ఇచ్చే దిశగా కూడా అడుగులు వేస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. మరి ఇది ఎంతవరకు నిలబడుతుంది. ఎంతవరకు పార్టీకి ప్రయోజనం చేకూరుస్తుందనేది చూడాలి.