కాంగ్రెస్ తో జగన్ కి పెద్ద పని పడిందా ?
జగన్ 2009లో కాంగ్రెస్ ఎంపీ కావచ్చు. కానీ ఆయన అనేక ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం పనిచేశారు. ముఖ్యంగా తన తండ్రి వైఎస్సార్ గెలుపు కోసం సొంత జిల్లాలో తిరిగారు
By: Tupaki Desk | 20 Dec 2024 8:30 AM GMTజగన్ కాంగ్రెస్ లోనే పుట్టి పెరిగారు. ఆయన ఇంట్లో ఒంట్లో కూడా కాంగ్రెస్ రక్తం ఉంది. అపుడెపుడో చంద్రబాబు ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో మాట్లాడుతూ తన రక్తంలో ముప్పయి శాతం కాంగ్రెస్ బ్లడ్ ఉందని చెప్పినట్లుగా ప్రచారంలో ఉంది. మరి జగన్ రక్తంలో కాంగ్రెస్ బ్లడ్ ఎంత అంటే చాలానే అని చెప్పాలి. జగన్ 2009లో కాంగ్రెస్ ఎంపీ కావచ్చు. కానీ ఆయన అనేక ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం పనిచేశారు. ముఖ్యంగా తన తండ్రి వైఎస్సార్ గెలుపు కోసం సొంత జిల్లాలో తిరిగారు.
ఇక జగన్ కి కాంగ్రెస్ తో మరో విచిత్ర బంధం ఏంటి అంటే కాంగ్రెస్ ని ధిక్కరించే ఆయన పెద్ద లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ ఆయనను పదహారు నెలలు జైలులో పెట్టించడం వల్లనే ఆయన వైసీపీని స్టార్ట్ చేసి ఏపీలో తిరుగులేని లీడర్ గా ఎస్టాబ్లిష్ అయ్యారు. అలా కాంగ్రెస్ తెలిసీ తెలియకో జగన్ కి బాగానే హెల్ప్ చేసింది అన్నది ఒక విశ్లేషణగా చూడాల్సి ఉంది.
ఇక జగన్ వైసీపీలో నూటికి ఎనభై మంది కాంగ్రెస్ వారే చేరి కొత్త పార్టీని సత్తువ కలిగిన పార్టీగా మార్చారు. అలాగే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తాన్ని జగన్ సొంతం చేసుకుని దశాబ్దాల టీడీపీని ఢీ కొట్టే స్థాయికి ఎదిగారు. ఇవన్నీ ఫ్లాష్ బ్యాక్ కధలే అయితే ఇపుడు మరోసారి జగన్ కి కాంగ్రెస్ తో పెద్ద పని పడింది అని అంటున్నారు.
అదెలా అంటే 2011లో ప్రారంభించిన వైసీపీలో అత్యధిక శాతం కాంగ్రెస్ నేతలు ఉంటే ఆ మిగిలిన శాతం టీడీపీ సహా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు. ఇపుడు చూస్తే 2024 లో ఘోర ఓటమి తరువాత వైసీపీ పునాదుల నుంచి ఉన్న వారు కూడా పార్టీని వదిలేసి బయటకు పోతున్నారు.
ఇక వైసీపీలో చేరిన ఇతర పార్టీల నేతల సంగతి సరేసరి. వారంతా కూడా వైసీపీ ఫిలాసఫీ నచ్చి చేరలేదు. వారికి కాంగ్రెస్ వాసనలు కూడా లేవు. దాంతో చాలా సులువుగా ఫ్యాన్ పార్టీని వదిలించేసుకుంటున్నారు. దీంతో వైసీపీ డీమోరలైజ్ అవుతోంది. ప్రతీ రోజూ మీడియాలో వస్తున్న వార్తలు అన్నీ వైసీపీకి షాక్ అంటూనే ఉన్నాయి. దానిని చూసి క్యాడర్ షాక్ తింటోంది.
మరి క్యాడర్ కి ఉత్సహం తెప్పించేలా వైసీపీ హై కమాండ్ ఏదైనా చేయాలీ అంటే పోయిన చోట వెతుక్కోవాలి. పార్టీని పటిష్టం చేసుకోవాలి. ఇప్పటికిపుడు టీడీపీ కూటమి నుంచి వచ్చే నేతలు ఎవరూ ఉండరు. అధికారం మరో నాలుగున్నరేళ్ల పాటు వారికి జాగ్రత్తగా ఉంటుంది. దాంతో అది అయ్యే పని కాదు.
విపక్షంలో చూస్తే కామ్రేడ్స్ ఉన్నారు. వారిది సిద్ధాంత పోరాటం. అందువల్ల అక్కడ నుంచి ఎవరూ వచ్చే సమస్యే ఉండదు. మరి వైసీపీని బలోపేతం చేసుకోవాలీ అంటే ఏమి చేయాలి అన్నది చూస్తే కనుక కాంగ్రెస్ అన్న జవాబే వస్తుంది. ఏపీలో కాంగ్రెస్ కి ఒక్క శాతం ఓటు బ్యాంక్ ఉన్నా ఇంకా ఆ పార్టీని అట్టే బెట్టుకుని ఉన్న సీనియర్ నేతలు కనిపిస్తారు.
వారంతా పార్టీ ఏనాటికి అయినా ఎదగకపోతుందా అని చూసి విసిగి ఉన్నారు. కాంగ్రెస్ పెద్దలు కూడా ఏపీ విషయంలో పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు అన్న అసంతృప్తి కూడా ఉంది. ఇపుడు షర్మిలను తెచ్చి నాయకత్వ బాధ్యతలు ఇచ్చారు. కేంద్ర మంత్రులుగా చేసి కీలక శాఖలు చూస్తున్న వారు అంతా షర్మిల పోకడలతో దూరంగా ఉంటున్నారు అని ప్రచారంలో ఉంది.
సరిగ్గా ఈ పాయింటే ఇపుడు వైసీపీ ఆశలను పెంచుతోంది. కాంగ్రెస్ మీద మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ వల విసిరితే వైసీపీకి ఎన్నో రాజకీయ ప్రయోజనాలు చేకూరుతాయని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నేతలు అనుభవంలో దిట్టలు. జిల్లాలో కూడా ముఖ్యులు. సరైన పార్టీ, ఫ్లాట్ ఫారం దొరకాలే కానీ వారు మళ్లీ గేరు మారుస్తారు అన్నది కూడా ఉంది.
అందుకే జగన్ రాయలసీమ మీదుగా కోస్తా గోదావరి ఉత్తరాంధ్రా జిల్లాలలో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేతలను ఆకట్టుకునేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసి పెట్టుకున్నారు అని అంటున్నారు. అలా చూస్తే అనంతపురానికి చెందిన మాజీ మంత్రి ఒకరు వైసీపీలో చేరుతారు అని అంటున్నారు. అదే విధంగా ఈ జిల్లా నుంచే మరో కీలక నేత కూడా ఫ్యాన్ నీడకు రావచ్చు అని అంటున్నారు. ఇక చిత్తూరు జిల్లాలోనూ మరో బడుగు బలహీన వర్గాలకు చెందిన నేత వైసీపీలో చేరే చాన్స్ ఉందని అంటున్నారు.
గుంటూరు జిల్లాలో కూడా సీనియర్ నేతలు ఉన్నారని వారిని రప్పించాలని చూస్తున్నారు. గోదావరి జిల్లాలో ప్రముఖ నాయకులు కీలక సామాజిక వర్గాలకు చెందిన వారూ ఉన్నారు. వీరి విషయంలోనూ కదిపి చూడాలని అనుకుంటున్నట్లుగా భోగట్టా. అలా వైసీపీ అధినాయకత్వం తమ పార్టీ నుంచి బయటకు వస్తున్న సీనియర్లు కీలక నేతల స్థానంలో కాంగ్రెస్ నుంచి నేతలను తీసుకుని అలా పార్టీని పటిష్టం చేసుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. కొత్త ఏడాది ఈ ఆపరేషన్ ఆకర్ష్ మొదలవుతుంది అని అంటున్నారు.