Begin typing your search above and press return to search.

జగన్ కీలక వ్యాఖ్యలు: ఈవీఎంలు వద్దు.. బ్యాలెట్ పేపర్లు ముద్దు!

ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు పరిమితం అయిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 Nov 2024 7:42 AM GMT
జగన్  కీలక వ్యాఖ్యలు: ఈవీఎంలు వద్దు.. బ్యాలెట్  పేపర్లు ముద్దు!
X

ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు పరిమితం అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటికీ ఈవీఎంలను తప్పుబడుతున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు పుష్కలంగా ఉన్నారనే సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే జగన్.. నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం!

గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంలో ఈవీఎంల పాత్ర కూడా ఉందనేది ఆ పార్టీలో ఓ వర్గం బలంగా భావిస్తోంది. ఇటీవల మాజీ మంత్రి రోజా కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు! ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈవీఎంలపై అనుమానాలు, బ్యాలెట్ పేపర్ల ఆవశ్యకతపై ఎక్స్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచీ ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు స్పందిస్తున్న జగన్.. ఇటీవల హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు కూడా ఇదే రకమైన అభిప్రాయంతో ట్వీట్ చేశారు! ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఈ విషయాని ప్రస్థావించారు.

భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇందులో భాగంగా... ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి ములస్తంభం అని.. దేశ వ్యాప్తంగా ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొందని.. వాటి పనితీరుపై అనేక అనుమానాలున్నాయని అన్నారు!

ప్రపంచ వ్యాప్తంగా మెజారిటీ దేశాల్లో బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు జరుగుతున్నాయని.. ఈ నేపథ్యంలో మన దేశంలో కూడా అదే పద్ధతిలో ఎన్నికలకు ఎందుకు వెళ్లకూడదని మనల్ని మనం ప్రశ్నించుకోవాలని జగన్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాదు.. అభివృద్ధి చెందేలా ఉండాలని ఆయన తెలిపారు.

దేశంలో అత్యంత ముఖ్యమైన ప్రాథమిక హక్కు అయిన వాక్ స్వాతంత్ర్యాన్ని అణిచివేయడానికి దూకుడుగా ప్రయత్నించడం.. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించిన పవిత్రమైన రోజున.. మనల్ని ఏకీకృత, సమాన భారతదేశం వైపు నడిపించిన దూరదృష్టి గల నాయకులకు నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు.

దీంతో.. మరోసారి ఈవీఎంలపై అనుమానాలు, బ్యాలెట్ పేపర్ల ఆవశ్యకతపై జగన్ చర్చ లేవనెత్తినట్లయ్యిందని అంటున్నారు. అయితే... పోటీ చేసిన దాదాపు చాలా చోట్ల ప్రత్యర్థులకు ప్రతిపక్ష హోదాకు అవకాశం లేకుండా.. వార్ వన్ సైడ్ అన్నట్లుగా దూసుకుపోతున్న ఎన్డీయే కూటమి ప్రభుత్వం అందుకు అంగీకరించడం లేదని అంటున్నారు!