జగన్ 2.0 : ఫస్ట్ షాక్ షర్మిలకే ?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాను ఇక మీదట 2.0 ఏంటో చూపిస్తాను అని ప్రకటించారు. క్యాడర్ కి అలా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు.
By: Tupaki Desk | 7 Feb 2025 3:30 AM GMTవైసీపీ అధినేత వైఎస్ జగన్ తాను ఇక మీదట 2.0 ఏంటో చూపిస్తాను అని ప్రకటించారు. క్యాడర్ కి అలా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ ఇచ్చి నలభై ఎనిమిది గంటలు గడవక ముందే తనదైన వ్యూహాలకు జగన్ తెర తీస్తున్నారు. ఆయన ఏపీలో కాంగ్రెస్ నుంచి కీలక నేతలను వైసీపీలో చేర్చుకోవడం ద్వారా పార్టీకి హుషార్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ శుక్రవారం వైసీపీ రాజకీయ సంచలానికి తెర తీస్తుంది అని అంటున్నారు. పీసీసీ మాజీ ప్రెసిడెంట్ అనంతపురం జిల్లాకు చెందిన సాకే శైలజానాధ్ ని వైసీపీలో చేరుతారు అని అంటున్నారు. ఈ మేరకు జగన్ తో చర్చలు పూర్తి అయ్యాయని చెబుతున్నారు. సాకే శైలజానాధ్ 2004, 2009లలో కాంగ్రెస్ నుంచి అనంతపురం జిల్లా సింగనమల అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.
ఇక ఆయన తరువాత కాలంలో మంత్రిగా కూడా పనిచేశారు. పీసీసీ చీఫ్ గా వ్యవహరించిన శైలజానాధ్ కి మంచి మాటకారిగా సబ్జెక్ట్ మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్న వ్యక్తిగా పేరుంది. ఆయనను వైసీపీలోకి తీసుకుని రావడం ద్వారా బలమైన వాయిస్ ని కూటమికి వ్యతిరేకంగా వినిపించే ప్రయత్నం చేయాలని చూస్తున్నారు. అంతే కాదు రాష్ట్రంలో కీలకమైన సామాజిక వర్గాలను ఆ విధంగా వైసీపీ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు.
అదే విధంగా గోదావరి జిల్లాలకు చెందిన మరో కీలక నేత, మాజీ ఎంపీగా ఉన్న లీడర్ ని కూడా వైసీపీలో చేర్చుకోవాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే ఆ నాయకుడు జగన్ బెటర్ చంద్రబాబు పాలన కంటే అని కామెంట్స్ చేశారు. ఆయన వైసీపీ పట్ల సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారని అంటున్నారు. దాంతో ఆయన చేరిక కూడా దాదాపుగా ఖాయమని అంటున్నారు. ఆయనను చేర్చుకుంటే గోదావరి జిల్లాలలో వైసీపీకి బలమైన వాయిస్ దొరుకుతుంది అని అంటున్నారు.
అలాగే అదే గోదావరి జిల్లాలో మరో బలమైన సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడిని వైసీపీలో చేర్పించేలా చూస్తున్నారు. ఆయన వస్తే కనుక గోదావరి జిల్లాలలో జనసేన టీడీపీకి మద్దతుగా నిలిచిన ఒక బలమైన సామాజిక వర్గం వైసీపీ వైపు మళ్ళుతుందని లెక్క వేస్తున్నారు.
వైసీపీ అధినేత కాంగ్రెస్ నే ఇపుడు టార్గెట్ చేశారు. వైసీపీ నుంచి వరసబెట్టి నేతలు వెళ్ళిపోతున్న నేపథ్యంలో క్యాడర్ లో నైతిక స్థైర్యం దెబ్బ తింటోంది. దాంతో వైసీపీలో కొత్తగా చేర్చుకోవడం ద్వారా పార్టీకి బూస్టప్ తెచ్చే ప్రయత్నం చేయాలని జగన్ భావిస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి జగన్ 2.0 కాదు కానీ షర్మిలకే పెద్ద షాక్ ఇవ్వబోతున్నారా అన్న చర్చ సాగుతోంది.
షర్మిల పీసీసీ చీఫ్ గా ఉన్నది వైసీపీ నుంచి నేతలను కాంగ్రెస్ వైపు ఆకర్షించడానికి. కానీ వైసీపీ నేతలు అంతా కూటమి పార్టీలనే ఎంచుకుంటున్నారు. దాంతో కాంగ్రెస్ కి బలం ఏమీ లేకుండా పోతోంది. ఇపుడు ఉన్న నాయకులను వైసీపీ లాగేస్తే షర్మిల ఇబ్బందులో పడుతుంది అని అంటున్నారు. కాంగ్రెస్ ని వీక్ చేయాలన్నదే వైసీపీ ఆలోచన అదే సమయంలో షర్మిల జగన్ ని ఎంతసేపూ విమర్శలు చేస్తున్న క్రమంలో ఆ పార్టీ కూడా ఏపీ నాయకత్వం మీద పునరాలోచించుకునేలా వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ ఉండబోతోంది అని అంటున్నారు.