Begin typing your search above and press return to search.

తిరుమల వెళ్తే జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే ?

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 28న తిరుమల వెళ్లబోతున్నారు.

By:  Tupaki Desk   |   26 Sep 2024 12:30 AM GMT
తిరుమల వెళ్తే జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే ?
X

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 28న తిరుమల వెళ్లబోతున్నారు. కాలి నడకన ఆయన వెళ్ళి స్వామిని దర్శించుకోనున్నారు. అయితే ఏపీలో లడ్డూ ప్రసాదం కల్తీ అయిందని అతి పెద్ద రాజకీయ దుమారం రేగిన నేపథ్యం ఉంది. వైసీపీ వైపు గురి పెట్టి టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ ఆరోపణల తూటాలను పేల్చింది.

దాని నుంచి బయటపడేందుకు వైసీపీ చేస్తున్న అనేక ప్రయత్నాలలో భాగమే స్వామి మీద తనకు అత్యంత భక్తి ప్రపత్తులు ఉన్నాయని జగన్ చెప్పుకోవడం. అందుకే ఆయన కాలి నడకన ఏడు కొండలూ ఎక్కి స్వామి వారిని దర్శించుకోబోతున్నారు. ఆ విధంగా ఆయన తనకు శ్రీవారి పట్ల ఎంతో అచంచల విశ్వాసం ఉందని హిందూ భక్తకోటికి చెప్పబోతున్నారు.

జగన్ ఎంచుకున్న ఈ మార్గం కరెక్టే. కానీ ఆయన సాఫీగా కాలి నడకన తిరుమల కొండకు చేరుకుని స్వామి దర్శనం చేసుకోగలుగుతారా అన్నది కూడా ఇక్కడ చర్చకు వస్తోంది. ఎందుకంటే జగన్ మీద ఇటీవల ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అనేక సార్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన సోనియా గాంధీ కంటే గొప్ప వారా అని అని కూడా అన్నారు.

వారంతా తిరుమలకు వస్తే స్వామి మీద విశ్వాసం ఉంది అని డిక్లరేషన్ మీద సంతకాలు చేస్తారు అని కూడా బాబు అన్నారు. దానిని బట్టి చూస్తే జగన్ కి ఈసారి తిరుమల శ్రీవరి దర్శనం అంత సులభం కాబోదు అని అంటున్నారు. ఆయన సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది.

గతంలో అయితే జగన్ కి ఈ ఇబ్బంది లేదు. ఆయన అయిదేళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన నియమించిన పాలక మండలి ఉంది. దాంతో ఆయన స్వామి దర్శనం చేసుకుని వచ్చేవారు. ఇక జగన్ రాజకీయాల్లోకి ప్రవేశించిన కొత్తలో పార్టీ పెట్టిన ప్రారంభంలో ఒకసారి డిక్లరేషన్ ఇచ్చినట్లుగా చెబుతారు.

ఇదిలా ఉంటే తిరుమల ప్రోటోకాల్ ప్రకారం చూస్తే అన్య మతస్థులు స్వామి దర్శనం కోసం వచ్చినపుడు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. తమకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉందని వారు స్పష్టం చేయాలి. జగన్ క్రిస్టియన్ కనుక తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది.

ఈసారి జగన్ దర్శన సమయంలో తప్పనిసరిగా దీనిని టీటీడీ అధికారులు ప్రస్తావిస్తారు అని అంటున్నారు. అయితే జగన్ ఏమి చేయబోతున్నారు అన్నదే చర్చగా ఉందిపుడు. జగన్ కనుక సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే ఏ సమస్యా ఉండదు. అలా కాకుండా ఆయన దానిని దాటవేస్తే మాత్రం అది పెద్ద ఇష్యూ అవుతుంది.

జగన్ కి వెంకన్న మీద విశ్వాసం లేదని చాటి చెప్పడానికి టీడీపీకి మరో ఆయుధం కూడా అవుతుంది. మరి తిరుమల వెళ్ళి తనకు దేవుడి మీద విశ్వసం ఉందని చెప్పుకోవడానికి చూస్తున్న జగన్ ఇపుడు కోరి మరీ కొత్త వివాదం తెచ్చుకుంటారా అన్న చర్చ సాగుతోంది. మరి జగన్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్న దానిని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది.