జగన్ ప్రయోగాలే కొంపముంచాయ్.. !
మరక మంచిదే! అన్నట్టు.. రాజకీయాల్లోనూ కొన్ని ప్రయోగాలు మంచివే. కానీ, అన్నింటా అవి కుదరవు.
By: Tupaki Desk | 30 Aug 2024 4:51 AM GMTమరక మంచిదే! అన్నట్టు.. రాజకీయాల్లోనూ కొన్ని ప్రయోగాలు మంచివే. కానీ, అన్నింటా అవి కుదరవు. పూర్తిగా సమూల ప్రక్షాళన చేస్తానని చెప్పడం వరకు బాగానే ఉంటుంది. కానీ, చేతల వద్దకు వచ్చేస రికి ఆచితూచి అడుగులు వేయకపోతే.. ఇప్పుడు వైసీపీ ఎదుర్కొంటున్న పరిస్థితి మాదిరిగానే ఉంటుంది. ఎన్నికలకు ముందు వైసీపీ చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. సొంత పార్టీలో కీలక నేతలను పక్కన పెట్టి.. కొత్తవారికి పట్టం కట్టిన తీరు.. అప్పట్లోనే ముసలం పుట్టించింది.
కొలుసు పార్థసారథి, వసంత కృష్ణ ప్రసాద్, ఆరణి శ్రీనివాసులు, బాలశౌరి, శ్రీకృష్ణ దేవరాయులు.. ఇలా అనేక మంది నాయకులు పార్టీకి రిజైన్ చేసి.. పొరుగు పార్టీల్లో చేరి విజయం దక్కించుకున్నారు. అదే సమయంలో.. జగన్ తీసుకువచ్చిన కొత్త ముఖాలు పుంజుకోలేక పోయాయి. పైగా.. భారీ స్థాయిలో ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. అంటే.. ఎన్నికలకు ముందు టికెట్లు మార్చి.. నాయకులను మార్చి చేసిన ప్రయోగం వికటించింది. అయితే.. దీని నుంచి పాఠాలు ఎలా ఉన్నా.. వైఫల్యాలను మాత్రం ఎదుర్కోవడం కనాకష్టంగా ఉంది.
ఇక, మరో ప్రయోగం.. ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మార్పు చేయడం. ఇది మరింత వివాదంగా మారిపోయింది. అప్పటి వరకు నాయకులు.. తమ తమ నియోజకవర్గంలో అన్ని వర్గాలను ఆకర్సించేలా ప్రయత్నించారు. కానీ, ఎన్నికలకు ముందు నియోజకవర్గం మార్చడంతో ఆయుధాలను వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే.. ఈ ప్రయోగం కూడావిఫలమైంది. పార్టీ ఓటమికి.. నాయకులను తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నది ఈ రెండు ప్రయోగాలు స్పష్టం చేస్తున్నారు.
అందుకే.. ఇప్పుడు నాయకులు పార్టీని వదిలేసి వెళ్లిపోతున్నా.. అధినాయకుడు.. చేతులు కట్టుకుని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో నాయకులు తప్పులు లేవని.. జగన్‌కు కూడా తెలుసు. అంతా ఆయనే చేసుకున్న స్వయంకృతం. ఒకసర్వేను నమ్మక పోవడం.. క్షేత్రస్థాయిలో వలంటీర్ల సర్వేలు.. పార్టీ ఇంచార్జ్‌ల సర్వేలు.. ఐప్యాక్ సర్వేలు.. ఇలా.. లెక్కకు మిక్కిలి సర్వేలు నమ్ముకుని.. ఒక్కదానినీ పూర్తిగా అమలు చేయలేక పోయిన ఫలితంగా.. ఈ ప్రయోగాలన్నీ.. వికటించాయి. నాయకులు వెళ్లిపోవడం.. ఉండిపోవడం .. అనేది అధినేత తీసుకునే నిర్ణయంపైనే ఉంటుంది తప్ప.. మరొకటి కాదనే విషయాన్ని జగన్ ఇప్పటికైనా గుర్తించాలి.