Begin typing your search above and press return to search.

గోల్డెన్ చాన్స్ మిస్ చేసుకుంటున్న జగన్ ?

వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ వ్యూహాత్మకంగా చేస్తున్న పొరపాట్లు, తడబాట్లూ ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి.

By:  Tupaki Desk   |   25 Feb 2025 3:33 AM GMT
గోల్డెన్ చాన్స్ మిస్ చేసుకుంటున్న జగన్ ?
X

వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ వ్యూహాత్మకంగా చేస్తున్న పొరపాట్లు, తడబాట్లూ ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం బలంగా ఉన్న మాట నిజం. అంతే కాదు అసెంబ్లీ నిండా కూటమి పార్టీలు పరచుకున్నదీ నిజం. అయితే నిక్కమైన నేస్తం ఒక్కడున్నా చాలు అన్నట్లుగా విపక్షంగా వైసీపీ ఒక్కటి ఉన్నా చాలు, అసెంబ్లీలోనూ బయటా అందరి అటెన్షన్ వైసీపీ మీదనే ఉంటుంది.

వైసీపీకి 11 మంది సభ్యులు ఉన్నారు. ఇది అందరికె తెలిసిన విషయమే. కానీ జగన్ మాత్రం దానికి తనకు తానుగా కెలికి వదిలిపెడుతున్నారు. కోరి మరీ కూటమి పక్షాల చేత సెటైర్లు వేయించుకుంటున్నారు. సోషల్ మీడియాలో అయితే ఇప్పటికే ఎలెవెన్ పార్టీ అని ముద్ర పడింది వైసీపీకి. ఇదంతా ఎందుకు అంటే వైసీపీ సరైన వ్యూహాలు లేక కోరి చిరిగి చాట చేసుకుంటున్న వైనమే.

అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం పట్టుబట్టడం వైసీపీ చేస్తున్న తప్పుగానే అంతా చూస్తున్నారు. 18 మంది సభ్యులు ఉంటే ప్రతిపక్ష హోదా వస్తుంది. అది సంప్రదాయంగా ఆనవాయితీగా ఉంది. ఈ రోజున కూటమి ప్రభుత్వమే అది విధించిన నిబంధన కాదు. అంతకు ముందు నుంచి ఉంది.

అయితే జగన్ కోరుతున్నట్లుగా అసెంబ్లీలో ఏకైక విపక్షం కాబట్టి వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించమని. అది చేయాలీ అంటే అధికార విపక్షాల మధ్య ఇచ్చీ పుచ్చుకునే ధోరణి ఉండాలి. ఏపీలోని రాజకీయమే అలా లేదు కదా. ఉప్పూ నిప్పు మాదిరిగా టీడీపీ జనసేనలతో వైసీపీకి వ్యవహారం ఉంటుంది. అందువల్ల రూల్స్ అంటే రూల్స్ అన్నట్లుగానే కూటమి వెళ్తుంది.

ఆ సంగతి జగన్ కి తెలిసి మరీ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అంటే జనాలకు తెలియాలి అని అనుకోవాలి. జనాలకు ఏమి తెలియాలి అంటే కూటమి ప్రభుత్వం వైసీపీని ఇబ్బంది పెడుతోందని అన్నది బాగా ప్రచారంలోకి వచ్చి సింపతీ యాంగిల్ వర్కౌట్ అవుతుందని భావిస్తున్నట్లుగా ఉంది.

కానీ జనాలు అలా అనుకోవడం లేదు. వైసీపీ ఎందుకు సభకు రాదు అనే వారు అంటున్నారు. వైసీపీ సభకు రావాలి. జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజా పక్షంగా నిలిచి ప్రశ్నలు సంధించాలి. అపుడు అధికార పక్షం కనుక ఇబ్బందులు పెడితే అవమానాలకు గురి చేస్తే అపుడు జనాలు ఆలోచిస్తారు. అపుడు అయ్యో వైసీపీని ఇలా టార్గెట్ చేస్తున్నారేంటి అని అనుకుంటారు.

మరి అది జరగాలీ అంటే వైసీపీ వరసగా కొన్నాళ్ళ పాటు అయినా సభకు వెళ్ళాలి. తమకు ఒక నిమిషం సమయం ఇచ్చినా లేక అర నిమిషం సమయం ఇచ్చినా దానిని జాగ్రత్తగా వాడుకోవాలి. అంతే కాదు మైకు ఇవ్వమని కోరాలి. అపుడు ఇవ్వకపోతే తప్పు అధికార పక్షం వైపు వెళ్తుంది.

ఇక జగన్ సభలో సీఎం బాబుతో సమానంగా మాట్లాడేందుకు మైకు కోరుతున్నారు. ముందే చెప్పుకున్నట్లుగా విపక్ష హోదా లేకపోవడం వల్ల అది సాధ్యపడదు. అందువల్ల జగన్ సభలో మాట్లాడకుండా కూర్చున్నా ఆయన మీద మీడియా ఫోకస్ ఉంటుంది. ఆయన తన సభ్యుల చేత మాట్లాడించవచ్చు. వారిని ఆ విధంగా కూటమి ప్రభుత్వం మీదకు ప్రజా పక్షాన పోరాటానికి సన్నద్ధులను చేయవచ్చు. తాను తన సీటులో ఉండే ఇదంతా చేయవచ్చు.

ఇలా చేసినా వైసీపీకి అసెంబ్లీలో రావాల్సిన మైలేజ్ వస్తుంది. జనాలు కూడా వైసీపీ వైపు చూస్తారు. ప్రజా సమస్యల మీద వైసీపీ ప్రశ్నలు సంధిస్తే అధికార పక్షమూ ఇరుకునపడుతుంది. మరి ఈ విధంగా చేయకుండా సభకే రాము అని చెప్పడం వల్ల ఉపయోగం ఏమిటో జగన్ కే తెలియాలి అని అంటున్నారు. అంతే కాదు అసెంబ్లీలో కనిపించని ఎమ్మెల్యేలు అని వైసీపీకి నెగిటివిటీ దీని వల్ల పెరిగే అవకాశాలు ఉన్నాయి.

మొత్తానికి తేలేది ఏమిటంటే జగన్ అసెంబ్లీలో ఉంటే ఆ పార్టీకి గోల్డెన్ చాన్స్. అది ఆయన మిస్ చేసుకుంటే మాత్రం వైసీపీకి అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని ఇతర పార్టీలకు అసలు తేడా ఉండదు. ఇక అధికార కూటమికి అసెంబ్లీ నల్లేరు మీద నడక అవుతుంది. వైసీపీయే జనంలో కార్నర్ అవుతుందని అంటున్నారు.