జగన్ మారాల్సింది.. మార్చాల్సింది.. ఏంటి..!
ఇక, నిన్న మొన్నటి వరకు పరిస్థితి ఎలా ఉన్నా.. ఇప్పుడు చేతులు కాలిపోతున్న పరిస్థితి నెలకొంది.
By: Tupaki Desk | 3 Oct 2024 5:41 AM GMTతాజా ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత.. వైసీపీ నుంచి పోయేవారే తప్ప.. ఆ పార్టీలోకి వచ్చే నాయకు లు అంటూ ఎవరూ కనిపించలేదు. పైగా కీలక కూసాల వంటి నాయకులు కదిలిపోయారు. బాలినేని, ఉదయభాను.. వంటి వారు పొరుగు పార్టీల్లోకి మారిపోగా ఆళ్ల నాని వంటి వారు సైలెంట్ అయిపోయి.. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకొన్నారు. ఆయా విషయాలపై పార్టీ అధినేత జగన్ చింతించారో లేదో చెప్పడం కష్టమే. ఎందుకంటే.. పార్టీని కార్పొరేట్ స్థాయిలోనే ఆయన నడిపిస్తున్నారు.
ఇక, నిన్న మొన్నటి వరకు పరిస్థితి ఎలా ఉన్నా.. ఇప్పుడు చేతులు కాలిపోతున్న పరిస్థితి నెలకొంది. దీంతో హుటాహుటిన పార్టీ డెవలప్ మెంటుపై జగన్ దృష్టి పెట్టారు. తాజాగా నిర్వహించిన పార్టీ నేతల సమీక్షా సమావేశంలో పార్టీని ఏవిధంగా అభివృద్ధి చేయదలచిందీ ఆయన చెప్పుకొచ్చారు. ప్రపంచ స్థాయిలో ఏ పార్టీ కూడాలేని విధంగా తమ పార్టీ ఉండనుందని చెప్పుకొచ్చారు. క్షేత్రస్థాయిలో ఎంతో మందికి అవకాశం ఇచ్చామని.. ఇప్పుడు కూడా ఇస్తున్నట్టు తెలిపారు.
కానీ, వాస్తవం చూస్తే.. పదవులు తీసుకున్నవారు.. మాత్రం మౌనంగా ఉన్నారు. పదవులు రానివారు.. దూర మయ్యారు. ఇదీ ఇప్పుడు వైసీపీ పరిస్థితి. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో అనేక మంది నాయకులు సైలెంట్‌గానే ఉన్నారు. పార్టీ అధినేత పట్ల విధేయతను కూడా చూపించలేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో పార్టీ డెవలప్ మెంటు అంటే.. కేవలం నాలుగు మీటింగులు పెట్టి.. నాలుగు పదవులు పంచడం కాదనేది వాస్తవం. ఇది వర్కవుట్ అయ్యే పరిస్థితి కూడా కాదని అంటున్నారు.
జగన్ తనను తాను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేసమయంలో క్షేత్రస్థాయి కేడర్‌కు మరింత చేరువ కావాలి. నాయకులకు అందుబాటులో ఉండాలి. ఏ సమస్య వచ్చినా.. మధ్య వర్తుల ప్రమేయం లేకుండా.. కాచుకునేలా వ్యవహరించాలి. అప్పుడు కానీ పార్టీ అభివృద్ది బాట పట్టే పరిస్థితి ఉండదు. అప్పుడు కానీ.. పార్టీ పుంజుకునే పరిస్థితి కూడా రాదు. నిజానికి ఇప్పుడు మీటింగుకు వచ్చిన వారిలో చాలా మంది మనసు ఒక చోట ఉంటే.. మనుషులు మరో చోట ఉండడం గమనార్హం. కాబట్టి .. అసలు మార్పు ప్యాలెస్‌లోనే జరగాలన్నది వాస్తవం.