వాటే పిటీ : డ్రీం ప్రాజెక్ట్ ని చూడని జగన్
ఎవరైనా కూడా తాము అనుకున్న దానిని అందుకుంటేనే ఆనందం.
By: Tupaki Desk | 4 Nov 2024 4:41 AM GMTఎవరైనా కూడా తాము అనుకున్న దానిని అందుకుంటేనే ఆనందం. అలాగే జగన్ కి ఒక తీరని కోరిక అలాగే ఉండిపోయింది. ఆయన విశాఖ నుంచి పాలించాలని అనుకున్నారు. విశాఖను అందుకే పాలనా రాజధానిగా చేయాలని ప్రతిపాదించారు. అయితే ఆయన చేసిన పొరపాటు ఏంటి అంటే మూడు రాజధానులు అని చట్టం చేయడానికి చూడడం.
అలా కాకుండా ఆయన విశాఖను క్యాంప్ ఆఫీస్ గా చేసుకుని నెలలో కొన్ని రోజులు అక్కడ ఉంటే ఎవరూ ఆక్షేపించేవారు కాదు. కానీ జగన్ ఎపుడైతే మూడు రాజధానులు అంటూ మొదలెట్టారో మొదట్లో అదేదో బాగుందని అనిపించినా ఆ తరువాత దానిలోని పొలిటికల్ మూడ్ ని జనాలు పసిగట్టారు. విపక్షాలు కూడా గట్టిగా ఊదరగొట్టాయి.
దాంతో వైసీపీ అధినేత నాటి ముఖ్యమంత్రి కల నెరవేరలేదు. ఇక విశాఖలో తాను రెండోసారి ప్రమాణం చేస్తాను అని జగన్ ఎన్నికల వేళ ప్రకటించారు అంటే ఆయన ధీమా ఏ లెవెల్ లో ఉందో ఆలోచించాల్సిందే. తాను ఓడిపోను అన్నది జగన్ గట్టి నమ్మకంగా అలా అంతా భావించారు.
ఈ ధీమా ఎంతదాకా వెళ్ళింది అంటే జగన్ సీఎం గా ఉండగా విశాఖలోని రుషికొండ మీద టూరిజం శాఖ ఆధ్వర్యంలో భారీ భవంతిని నిర్మాణం చేశారు. ఒక విధంగా చెప్పాలీ అంటే తెలుగులో దానికి రాజ ప్రాసాదం అన్న మాట వాడితే కరెక్ట్. అలాగే ఇంగ్లీష్ లో ప్యాలేస్ ని వాడాల్సి ఉంది.
అంతటి రాజప్రాసాదం కట్టిన జగన్ తాను అక్కడ ఏదీ చూడకుండానే ఫలానా చోట ఫలనాది ఏర్పాటు చేయమని నిర్దేశించారు అని అంటారు. ఆయన ఎన్నో సార్లు విశాఖ వచ్చినా ఎపుడూ రుషికొండ ప్యాలెస్ వైపు వెళ్లలేదు. దానిని వైసీపీ అధికారంలో ఉండగానే ఆనాటి టూరిజం మంత్రి రోజా ప్రారంభించారు కూడా.
ఇంత చేసినా కూడా జగన్ వెళ్లి అక్కడ ఒకసారి చూసి తాను అనుకున్నట్లుగా ప్యాలెస్ ఉందని సంతోషం పడవచ్చు. సంతృప్తి చెందవచ్చు. కానీ అది ఎపుడూ చేయలేదు. దానికి కారణం మొదట్లో చెప్పుకున్నట్లుగా మేము కాక మరెవరూ ఏపీకి సీఎం అవరు అన్నదే ఆయనలో ఉన్న ధీమా అని అంటారు. అందుకే తాను సీఎం గా రెండోసారి గెలిచిన తరువాతనే రుషికొండ ప్యాలెస్ లోకి అంగరంగ వైభవంగా అడుగుపెట్టాలని భారీ ప్లాన్ వేశారు.
కానీ విధి మరోలా తలచింది. అందుకే జగన్ సీఎం గా ఉండగా ప్యాలెస్ లోకి వెళ్లలేకపోయారు. తీరా చూస్తే ఆయన మాజీ అయ్యారు. ఇపుడు చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో అక్కడికి వెళ్ళారు అన్నీ పరికించి చూశారు. అలాగే ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఆయన కూడా అక్కడ నిర్మాణాన్ని చూశారు.
ఇలా టీడీపీ ముఖ్యులు మంత్రులు కూటమి నేతలు అంతా వెళ్ళినా వైసీపీ నుంచి మంత్రి రోజా మాత్రమే వెళ్ళగలిగారు. జగన్ అయితే కనీసం కాలు కూడా పెట్టలేకపోయారు. దాంతో వాటే పిటీ అని అంతా అంటున్న పరిస్థితి ఉంది. మొత్తానికి జగన్ డ్రీం ప్రాజెక్ట్ ని ఆయన తనివి తీరా తన కళ్ళతో చూసుకునే చాన్స్ అయితే లేకుండా చేసుకున్నారు అనే అంటున్నారు.