రాజాను ఓడించండి: వైసీపీ నేతలకు జగన్ పిలుపు
వైసీపీ అధినేత జగన్.. ఆదివారం ఉదయం బెంగళూరు నుంచి తాడేపల్లికి చేరుకున్నారు. ఆ వెంటనే ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు
By: Tupaki Desk | 23 Feb 2025 11:27 AM GMTవైసీపీ అధినేత జగన్.. ఆదివారం ఉదయం బెంగళూరు నుంచి తాడేపల్లికి చేరుకున్నారు. ఆ వెంటనే ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అనుకూల విధానాన్ని నాయకులకు వివరించారు. ``మనం పోటీలో లేకపోయినా కూటమి అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను ఓడించాలి`` అని జగన్ పిలుపునిచ్చారు.
తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కేఎస్ లక్ష్మణరావుకి సపోర్ట్ చెయ్యాలని గుంటూరు జిల్లా వైసీపీ నాయకులకు జగన్ సూచించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ మంత్రి విడదల రజినీ, మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి తదితరులు హాజరయ్యారు.
``ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయడం లేదని సైలెంట్ గా ఉండొద్దు. కూటమి అభ్యర్థులను ఓడిం చేందుకు బలమైన అభ్యర్థులకు మద్దతుగా నిలవాలి. కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీగా కేఎస్ లక్ష్మణరావు పోటీ చేస్తున్నారు. బలం లేకపోయినా ఆయన పీడీఎఫ్ తరపున పోటీ చేయడానికి మనం మద్దతు ఇవ్వడం వల్లే జరిగింది. లక్ష్మణరావు విజయానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలి. లక్ష్మణరావు గతంలో మనకు సహకరించారు. కూటమికి పోటీ ఇచ్చేది లక్ష్మణరావు అని చూడకుండా వైసీపీ అన్న భావనలో మీరు పని చేయాలి`` అని జగన్ దిశానిర్దేశం చేశారు.
కాగా, మరో మూడు రోజుల్లో రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ ఈ నెల 27న జరగ నుంది. ఉమ్మడి గుంటూరు, కృష్నాజిల్లాల నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఆది నుంచి కూడా వైసీపీ పీడీఎఫ్‌కు మద్దతు ఇస్తోందన్న ప్రచారం ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకు బయట పడలేదు. కానీ, తాజాగా జగన్.. సమావేశం పెట్టి మరీ పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావును గెలిపించాలని కోరడం గమనార్హం. దీంతో పోటీ రసవత్తరంగా మారనుంది.