అప్పులు-లెక్కలు-జగన్ తెలుసుకోవాల్సింది ఇదే!
అంతేకాదు.. అప్పులు చేసిన సొమ్ముతో తమ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమం రూపంలో ఇచ్చామని జగన్ చెప్పారు. దీనివల్ల మార్కెట్లకు డిమాండ్ పెరిగిందన్నారు.
By: Tupaki Desk | 7 Feb 2025 2:30 AM GMTఏపీలో కూటమి సర్కారుపై.. ముఖ్యంగా సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ విరుచుకుపడ్డారు. అధికా రంలోకి వచ్చిన ఏడు మాసాల్లోనే తెగ అప్పులు చేసేస్తున్నారంటూ.. ఆయన దుయ్యబట్టారు. ఇప్పటి వరకు 1.45 లక్షల కోట్ల వరకు అప్పులు చేశారని, ఇంకా చేయనున్నారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ మొత్తం సొమ్మును ఏం చేశారని జగన్ ప్రశ్నించారు. ``అప్పుల మీద అప్పులు చేశారు. మేం అప్పు చేస్తే.. రాష్ట్రం శ్రీలంక అయిపోతుందన్నారు. మరి వీరు మాత్రం చేయొచ్చు`` అని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. అప్పులు చేసిన సొమ్ముతో తమ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమం రూపంలో ఇచ్చామని జగన్ చెప్పారు. దీనివల్ల మార్కెట్లకు డిమాండ్ పెరిగిందన్నారు. కానీ, ఇప్పుడు కనీసం.. ఒక్క పథకాన్ని కూడా అమలు చేయడం లేదన్నారు. సంక్షేమానికి ఖర్చు చేయకుండా.. అప్పులు చేసిన సొమ్మును ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మాతృవందనం లేదు, ఆర్టీసీ ఉచిత ప్రయాణం లేదు, కొత్త ఉద్యోగాలు ఇచ్చింది లేదని జగన్ ఓ పెద్ద జాబితానే చదివారు.
అయితే.. జగన్ చెబుతున్న లెక్కపై టీడీపీ కౌంటర్ ఇచ్చింది. అప్పులు చేయడం తప్పని తాము చెప్పలేదని.. కానీ, మితిమీరిన అప్పులు చేయడమే తప్పదని తాము చెప్పామని.. కౌంటర్ ఇచ్చారు. మూల ధన వ్యయంలో ఖర్చు పెట్టాలని కూడా తాము చెప్పామని వ్యాఖ్యానించారు. మూల ధన వ్యయం ద్వారా ప్రాజెక్టులు డెవలప్ అయి.. రాష్ట్రానికి ఆదాయంతోపాటు.. పన్నులు కూడా పెరుగుతాయని, తద్వారా వచ్చే ఆదేయాన్ని ప్రజలకు పంపిణీ చేస్తామని ఇదే తమ ఆర్థిక సూత్రమని వ్యాఖ్యానించారు.
గత జగన్ చేసిన అప్పుల సొమ్ము ఎటు పోయిందో ఎవరికీ అర్ధం కావడం లేదని కూడా టీడీపీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. ప్రతి వ్యవస్థను తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చారని అన్నారు. కానీ, తాము చేస్తున్న అప్పుల ద్వారా.. వృద్ది జరుగుతోందన్నారు. అమరావతి అభివృద్ధికే సుమారు 35 వేల కోట్ల వరకు అప్పులు వస్తున్నాయని ఇది నిరర్ధకం ఎలా అవుతుందని ప్రశ్నించారు. అదేవిధంగా ప్రతి రూపాయికీ కౌంట్ ఉందని.. సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.