"లిక్కర్ కేసులో 'పెద్ద'రెడ్డి, మిథున్ రెడ్డి" పై జగన్ కీలక వ్యాఖ్యలు!
ఈ నేపథ్యంలో 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకూ ఏపీలో మద్యం విధానంపై దర్యాప్తు చేసేలా సిట్ ను ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం.
By: Tupaki Desk | 6 Feb 2025 12:12 PM GMTఏపీలో గత ప్రభుత్వ హయాంలోని లిక్కర్ పాలసీ విషయంలో అక్రమాలు భారీ ఎత్తున జరిగాయని కూటమిలోని పార్టీల పెద్దలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకూ ఏపీలో మద్యం విధానంపై దర్యాప్తు చేసేలా సిట్ ను ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం.
మరోపక్క జగన్ ఇంటి ముందు జరిగిన అగ్ని ప్రమాదంపై స్పందిస్తూ.. ఉదయం లిక్కర్ స్కాంలో సిట్ పడింది.. రాత్రికి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడింది.. ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు, డైరీలు ఏమిటి? సిట్ తన ఇంటి దాకా వస్తుందని, ముందే లిక్కర్ స్కాంకి సంబంధించి తాను రాసుకున్న లెక్కలు, డాక్యుమెంట్లు తగల బెట్టారా? అని టీడీపీ ప్రశ్నించింది.
దీంతో.. ఏపీ రాజకీయాల్లో లిక్కర్ మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో గురువారం తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి, "పెద్ద" రెడ్డికి ప్రమేయం ఉందంటూ వచ్చిన కథనాలపైనా ఆ పత్రిక పేరు చెబుతూ ఘాటుగా స్పందించారు.
అవును... ఏపీ రాజకీయాల్లో లిక్కర్ కేసు వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో మిథున్ రెడ్డి పేరు చేర్చుతూ మీడియాలో వచ్చిన కథనాలపై జగన్ స్పందించారు. అసలు.. లిక్కర్ కేసుకీ మిథున్ రెడ్డికి ఏమిటి సంబంధం? అని జగన్ ప్రశ్నించారు.
మిథున్ రెడ్డి పార్లమెంటులో ఫ్లోర్ లీడర్, ఆయన తండ్రి ఏ శాఖ మంత్రి.. ఆయనకూ మధ్యానికీ సంబంధం ఏమిటి? అని జగన్ ప్రశ్నించారు. "ఎవరైనా ఈ వ్యవహారంలో ఎందుకు డబ్బులు ఇస్తారు.. మద్యం రేట్లు పెంచామా..? మద్యం బేసిక్ రేట్లు పెంచి, సరఫరా తగ్గించినందుకు నాకు లంచాలు ఇస్తారా.. రేట్లు పెంచి, సరఫరా పెంచిన చంద్రబాబుకు మామూళ్లు ఇస్తారా?" అని జగన్ ప్రశ్నించారు.
డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇలా ఎవరో ఒకర్ని కేసుల్లో ఇరికించడం, కేసులు పెట్టడం వాళ్లకు అలవాటేనని జగన్ అన్నారు. తన లాగా చంద్రబాబు ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నారని ప్రశ్నించారు. తనకు డబ్బుపై వ్యామోహం లేదని చెప్పిన జగన్.. అందుకే డీబీటీలో రెండున్నర లక్షల కోట్ల రూపాయలను ఇచ్చామని.. కమీషన్లు ఉండవు కాబట్టే చంద్రబాబు బటన్ నొక్కరని అన్నారు.