Begin typing your search above and press return to search.

పవన్ వదిలేసిన చోటు నుంచి జగన్ ?

ఇపుడు సడెన్ గా జగన్ మళ్లీ ఒక ట్వీట్ వేశారు. టీటీడీలో ఇంత పెద్ద తప్పు జరిగితే కేవలం క్షమాపణలతో సరిపెడతారా అని ఆయన నిలదీశారు.

By:  Tupaki Desk   |   13 Jan 2025 4:42 AM GMT
పవన్ వదిలేసిన చోటు నుంచి జగన్ ?
X

ఏపీలో పవిత్ర పుణ్య క్షేత్రం అయిన తిరుపతిలో ఒక మహా ఘోరం జరిగిపోయింది. తొక్కిసలాటలో ఏకంగా ఆరుగురి అమాయక భక్తుల ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. ఆ రోజున సీఎం డిప్యూటీ సీఎంలతో పాటు జగన్ కూడా బాధితుల వద్దకు వెళ్ళారు పరామర్శలు చేసి వచ్చారు.

అయితే మీడియాతో మాట్లాడినపుడు జగన్ మృతులకు భారీ పరిహారం కోరారు. బాధ్యుల మీద చర్యలకు డిమాండ్ చేశారు. అయితే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ అయితే ఈ ఘటనకు టీటీడీ చైర్మన్ ఈవో జేఈవో కారణం అని నిందించారు. డైరెక్ట్ గా కార్నర్ చేశారు. ఆ తరువాత నాటకీయ పరిణామాల నేపథ్యంలో టీటీడీ చైర్మన్ చేత క్షమాపణలు చెప్పించారు. ఇంకో వైపు చెక్కులు రెడీ చేసి బాధిత కుటుంబాలు మృతుల కుటుంబాలకు పంపిణీ చేసే కార్యక్రమం టీటీడీ పూర్తి చేసింది. మొత్తానికి ఒక సెన్సేషనల్ నేషనల్ ఇష్యూగా మొదట మారినా చివరికి అది సద్దుమణిగింది.

దాని వెనక చంద్రబాబు తీసుకున్న జాగ్రత్త చర్యలు ఉన్నాయి. ఇక వైసీపీ నేతలు అయితే ఈ విషయంలో విమర్శలు చేసినా పెద్దగా జనాల్లోకి వెళ్లలేదు. పైగా అవి భక్తిలో రాజకీయాన్ని పులిమేలా ఉన్నాయని టీడీపీ నేతలు తిప్పికొట్టేసారు.

ఇపుడు సడెన్ గా జగన్ మళ్లీ ఒక ట్వీట్ వేశారు. టీటీడీలో ఇంత పెద్ద తప్పు జరిగితే కేవలం క్షమాపణలతో సరిపెడతారా అని ఆయన నిలదీశారు. తిరుమల తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన టీటీడీ చైర్మన్ ఈవో, జేఈవో కలెక్టర్ ఎస్పీల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.వారి పై కేసు పెట్టి దేవుడి మీద తనకు భక్తి ఉందని చంద్రబాబు చాటుకోవాలని జగన్ కోరుతున్నారు

కేవలం క్షమాపణలు చెప్పించి చాలంటే ఎలా అని జగన్ అంటున్నారు. ఆరుగురు చనిపోతే ప్రాయశ్చిత్తంగా క్షమాపణలు సరిపోతాయా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. సీఎం డిప్యూటీ సీఎం రాజకీయ డ్రామాలు ఆపేయాలని జగన్ హాట్ కామెంట్స్ చేశారు.

ఇదిలా ఉంటే ఎక్కడైతే పవన్ వదిలేసారో అక్కడ నుంచి జగన్ పట్టుకున్నారు అని అంటున్నారు. నిజానికి ఈ ఇష్యూలో వైసీపీ విపక్షంగా ఫెయిల్ అయింది అన్న చర్చ కూడా ఉంది. పవన్ మొదట బాధ్యులు ఫలానా వారు అని ప్రభుత్వంలో ఉంటూ ఓపెన్ గా చెప్పగలిగారు. ఆ తరువాత సారీతో సరి అన్నది వేరే విషయం అయినా ఆ విషయంలో బలంగా ప్రశ్నించాల్సింది వైసీపీ.

మరి వైసీపీ నేతలు ఎవరూ పెద్దగా రియాక్ట్ కాలేదు. జగన్ సైతం పరామర్శ చేసి విమర్శలు కొన్ని చేసి వెళ్లిపోయారు. ఇపుడు మళ్లీ దీనిని వైసీపీ కెలుకుతోంది. అయితే ఇప్పటికే బాధితులకు తగిన పరిహారం ఇచ్చేసి వారి విషయంలో తగిన న్యాయం చేశామని అటు టీటీడీ ఇటు ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ఎంతో బాధాకరమైన ఒక ఇష్యూలో వైసీపీ ప్రతిపక్షంగా చేయాల్సిన తీరులో యాక్ట్ చేయలేదని అంటున్నారు. ఇపుడు డిమాండ్ చేస్తే ఫలితం ఏంటి అని కూడా చర్చకు వస్తోంది.