Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌.. ఇమేజ్ పెరిగిందా.. ఏపీలో బిగ్ హాట్ టాపిక్‌...!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ఇమేజ్ పెరిగిందా? ఆయ‌న విష‌యంలో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయా? అంటే.. తాజాగా జ‌రిగిన ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే ప‌రిశీల‌కులు చెప్పాల్సి వ‌స్తోంది.

By:  Tupaki Desk   |   10 Jan 2025 3:30 PM GMT
జ‌గ‌న్‌.. ఇమేజ్ పెరిగిందా.. ఏపీలో బిగ్ హాట్ టాపిక్‌...!
X

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ఇమేజ్ పెరిగిందా? ఆయ‌న విష‌యంలో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయా? అంటే.. తాజాగా జ‌రిగిన ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే ప‌రిశీల‌కులు చెప్పాల్సి వ‌స్తోంది. అయితే.. ఇది ఇప్ప‌టికిప్పుడు తీర్మానం చేసే విష‌యం కూడా కాద‌నేది మ‌రికొంద‌రి ఆలోచ‌న‌. ఏం జ‌రిగిందంటే.. తిరుప‌తిలో జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న త‌ర్వాత‌.. బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు జ‌గ‌న్ అక్క‌డ‌కు వెళ్లారు.నేరుగా ఆయ‌న స్విమ్స్‌కు వెళ్ల‌గా.. అప్ప‌టికే డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మీడియాతో మాట్లాడుతున్నారు. అధికారుల‌పై విమ‌ర్శ‌లు చేస్తూ.. వార్నింగులు ఇస్తున్నారు.

అంద‌రి చూపూ ఆయ‌న‌ వైపే ఉంది. ఇక‌, మీడియా గొట్టాలు కూడా ప‌వ‌న్ వైపే ఉన్నాయి. ఇంత‌లో పెద్ద కోలాహ‌లం.. అరుపులు, నినాదాలు.. జై జ‌గ‌న్ అంటూ.. చేతులు గాలిలోకి లేచాయి. అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌శాంతంగా ఉన్న వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా మారింది. అప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ చెబుతున్న మాట‌లే వినిపిస్తున్న చోట‌.. అనూహ్యంగా జ‌గ‌న్ నినాదాలు మార్మోగాయి. ఎంతగా అంటే.. ప‌వ‌న్ సైతం `ఏం జ‌రిగింది? ఎందుకీ కోలాహ‌లం?`` అని ప్ర‌శ్నించే స్థాయిలో అక్క‌డ కోలాహ‌లం నెల‌కొంది.

ఇంత‌లోనే మ‌రో ఆశ్చ‌ర్య‌క‌ర ఘ‌ట‌న కూడా జ‌రిగింది. నాలుగు ప్ర‌ధాన మీడియా సంస్థ‌ల ప్ర‌తినిధులు ప‌వ‌న్ మీడియా సమావేశం నుంచి త‌మ మైకులు తీసుకుని(అప్ప‌టికి ప‌వ‌న్ ప్ర‌సంగిస్తూనే ఉన్నారు) ప‌రుగు ప‌రుగున జ‌గ‌న్ వ‌స్తున్న వైపు ప‌రుగులు తీసారు. దీంతో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మ‌రింత ఆశ్చ‌ర్యం వేసింది. వెంట‌నే రెండు మూడు ముక్క‌ల్లో త‌న ప్ర‌సంగాన్ని ముగించిన ఆయ‌న‌.. అక్క‌డ నుంచి వెళ్లిపోయారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన వారు జ‌గ‌న్ విష‌యంపై ఆస‌క్తిగా చ‌ర్చించుకున్నారు.

నిజానికి ప‌వ‌న్‌కు ఉన్న సినీ ఇమేజ్‌తో పోలిస్తే.. జ‌గ‌న్‌కు ఉన్న ఇమేజ్ చాలా త‌క్కువ‌నే చెప్పాలి. ఇక‌, మాస్‌లోనూ ప‌వ‌న్‌కు ఉన్న ఇమేజ్‌తో పోలిస్తే. జ‌గ‌న్ వెనుక‌బ‌డ్డార‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు. అయినా.. ఇప్పుడు అనూహ్యంగా అంద‌రి చేతులు జ‌గ‌న్‌ వైపు లేవ‌డం, మీడియా సైతం జ‌గ‌న్ క‌వ‌రేజీ కోసం ప‌రుగులు పెట్ట‌డం వంటివి ఆసక్తిగా మారాయి. అంత‌మాత్రాన జ‌గ‌న్ ఇమేజీ పెరిగిపోయింద‌ని కానీ.. ప‌వ‌న్ ఇమేజీ త‌గ్గిపోయింద‌ని కానీ ఎవ‌రూ విశ్లేషించ‌క‌పోయినా.. అనూహ్య ప‌రిణామాలు మాత్రం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.