వైరల్ వీడియో... జగన్ ప్రజాదరణ చెక్కుచెదరడం లేదుగా?
దీంతో.. పలువురు కీలక నేతలు, సీనియర్లు పార్టీని వదిలి వెళ్లిపోయారు.
By: Tupaki Desk | 18 March 2025 10:23 AM ISTగత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో రికార్డ్ విక్టరీ సాధించి ఐదేళ్లు పాలించిన ఆ పార్టీ.. 2024 ఎన్నికలకు వచ్చేసరికి 11 స్థానాలకే పరిమితమైన పరిస్థితి. దీంతో.. పలువురు కీలక నేతలు, సీనియర్లు పార్టీని వదిలి వెళ్లిపోయారు. జగన్ ని విమర్శిస్తూ పక్కపార్టీల్లో చేరిపోయారు!
ఈ నేపథ్యంలో జగన్ పని అయిపోయిందని.. ఇప్పట్లో తేరుకోవడం కష్టమనే కామెంట్లు వినిపించాయి. కట్ చేస్తే... ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన కొన్ని మాసాలకే జగన్ జనాల్లోకి వెళ్లడం మొదలుపెట్టారు. ఈ సమయంలో ఆయన వెంట అభిమాన సంద్రం పోటెత్తిన దృశ్యాలు సరికొత్త చర్చకు తెరలేపుతున్నాయి. 40 శాతం ఓటు బ్యాంకును గుర్తు చేస్తున్నాయి.
అవును... గత ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం జగన్ ఇప్పట్లో తేరుకోవడం కష్టమని.. మళ్లీ మొదటి నుంచి మొదలుపెట్టాలని రకరకాల వ్యాఖ్యానాలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే... జగన్ కు ప్రజాదరణ ఏమాత్రం చెక్కుచెదరలేదనే సంఘటనలు ఇటీవల వరుసగా తెరపైకి వస్తున్నాయి. తాజాగా తెనాలిలో కనిపించిన దృశ్యాలు వైరల్ గా మారాయి.
గుంటూరు జిల్లా తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ హాజరయ్యారు. తెనాలిలోని ఏ.ఎస్.ఎన్. ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు జగన్ హాజరవుతున్నారనే విషయం తెలియడంతో వేలాదిమంది అభిమానులు పోటెత్తారు.
ఆ ప్రాంగణాన్ని “జై జగన్” నినాదాల్తో హోరెత్తించారు. జగన్ ఫోటోలు ప్రదర్సించారు. జగన్ నడుస్తున్న సమయంలో గులాబీల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో... ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యి ఏడాది కూడా కాకపోయినా... జగన్ అభిమాన సంద్రం పోటెత్తుతున్న విధానం సరికొత్త విశ్లేషణలకు దారితీస్తుందని అంటున్నారు.
వాస్తవానికి తెనాలి నియోజకవర్గం సంప్రదాయ టీడీపీ ఓటు బ్యాంకును కలిగి ఉంటుందని.. ఆ పార్టీవైపు మొగ్గు చూపే బలమైన సామాజికవర్గానికి పెట్టని కోటగా ప్రసిద్ధి చెందిందని చెబుతారు! ప్రస్తుతం అక్కడ జనసేన ఎమ్మెల్యే, మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆలపాటి రాజా లాంటి బలమైన టీడీపీ నేతలు ఉన్నారు.
ఇలాంటిచోట.. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ రావడంతో ఈ స్థాయిలో అభిమానులు పోటెత్తడం సంచలనంగా మారిందని అంటున్నారు. దీంతో... జనాల్లో జగన్ పై అభిమానం ఏమాత్రం చెక్కుచెదిరినట్లు లేదనే చర్చ మొదలైంది. సరికొత్త రాజకీయ విశ్లేషణలకు మరోసారి తెరలేపింది.