Begin typing your search above and press return to search.

జగన్ నిజంగా ఒప్పుకున్నారా...అది జరిగితేనే 2.0 అంటారు !

అందుకే సుదీర్గమైన అనుబంధాన్ని సైతం జగన్ నుంచి తెంచుకుని చాలా మంది నేతలు పోతున్నారని చెబుతారు.

By:  Tupaki Desk   |   6 Feb 2025 5:30 PM GMT
జగన్ నిజంగా ఒప్పుకున్నారా...అది జరిగితేనే 2.0 అంటారు !
X

వైసీపీ అధినేత జగన్ ది అరుదైన విధానం ఆయన తనకంటూ కొన్ని నిబంధనలు పెట్టుకున్నారు. అలాగే తాను నమ్మిన ఫిలాసఫీనే అనుసరిస్తారు. దాని నుంచి ఇంచి కూడా ఆయన ముందుకు జరగరని అంటారు. అందుకే సుదీర్గమైన అనుబంధాన్ని సైతం జగన్ నుంచి తెంచుకుని చాలా మంది నేతలు పోతున్నారని చెబుతారు.

ఇదిలా ఉంటే జగన్ కార్యకర్తల మాత్రం నిజంగా తప్పు జరిగింది అని ఒప్పుకున్నారా అన్న చర్చ సాగుతోంది. 2019లో జగన్ ని ముఖ్యమంత్రిగా చూడడానికి వైసీపీని అధికారంలోకి తీసుకుని రావదానికి రెక్కలు ముక్కలు చేసుకుని పార్టీ కార్యకర్తలు పనిచేసారు. నిజానికి వారంతా అప్పటికి పదేళ్ళుగా అలుపెరగని తీరులో పనిచేస్తున్నారు.

అయితే అధికారంలోకి వచ్చిన జగన్ కార్యకర్తలను పట్టించుకోలేదు అన్న విమర్శలు వెల్లువలా వచ్చాయి. అంతే కాదు జగన్ పార్టీ కార్యకర్తల ప్లేస్ లో వాలంటీర్లను తెచ్చి పెట్టారని వారితోనే అంతా జరిగిపోతుందని భ్రమించారని కూడా చెబుతారు. అయితే వాలంటీర్లు ఎన్నికల వేళ పూర్తిగా సైడ్ అయిపోయారు. ఇక పార్టీ క్యాడర్ నిండా నిరాశతో చేతులెత్తేసింది. దాంతో కనీ వినీ ఎరగని విధంగా వైసీపీ దారుణమైన ఓటమిని చవి చూసింది.

ఇదిలా ఉంటే వైసీపె ఓడిన చాలా నెలల తరువాత జగన్ అసలు తప్పు ఏమి జరిగింది అన్నతి తెలుసుకున్నారా అన్నది చర్చగా ఉంది. క్యాడర్ విషయంలో సరిగ్గా పట్టించుకోలేదు అన్నది జగన్ విచారం వ్యక్తం చేశారా అంటే అవును అనే చెప్పాల్సి ఉంది. విజయవాడకు చెందిన కార్పోరేటర్లతో జగన్ నిర్వహించిన సమావేశంలో తనౌ మళ్ళీ అధికారంలోకి వస్తాను అని గట్టిగా చెప్పారు.

ఈసారి అంతా మీకోసమే పనిచేస్తాను అని క్యాడర్ కి చెప్పుకొచ్చారు. తాను 2019 నుంచి 2024 మధ్యన ప్రజల కోసం పనిచేశాను అని దాని వల్ల కార్యకర్తల సమస్యలను పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు. ఈసారి అలా జరగదని ఆయన అన్నారు. జగన్ అంటే ఇక మీదట 2.0 గా కనిపిస్తారని అంతే కాకుండా క్యాడర్‌ విషయంలో పూర్తి దృష్టి సారిస్తామని చెప్పారు.

టీడీపీ కూటమి పాలనలో పార్టీ క్యాడర్ బాగా ఇబ్బంది పడుతోందని అందువల్ల తాము క్యాడర్ కి అండగా ఉండి కాపాడుకుంటామని జగన్ భరోసా ఇచ్చారు. గతంలో జరిగింది వేరు ఇక మీదట వేరు అని కూడా చెప్పారు. జగన్ 2.0 పూర్తి భిన్నంగా ఉంటుందని కూడా అంటున్నారు.

ఇక తన రాజకీయ జీవితాన్ని టీడీపీ కాంగ్రెస్ సర్వనాశనం చేయాలని చూశాయని తనను పదహారు నెలల పాటు జైలులో పెట్టారని కూడా జగన్ ఆరోపించారు. అయినా తాను అన్నీ తట్టుకుని నిలబడ్డానని పార్టీ నాయకులు క్యాడర్ తనను చూసి స్పూర్తి పొంది పార్టీ కోసం పనిచేయాలని కోరారు.

సూపర్ సిక్స్ అంటూ తప్పుడు హామీలతోనే టీడీపీ అధికారంలోకి వచ్చిందని జగన్ విమర్శించారు. రాజకీయాల్లో విలువలకు విశ్వసనీయతకు ఎపుడూ గౌరవం ఉంటుదని మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని జగన్ అన్నారు. అంతే కాదు తొమ్మిది నెలల టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవేర్చడంతో పూర్తిగా విఫలం అయింది అని జగన్ అంటున్నారు.

మొత్తానికి జగన్ క్యాడర్ కి భరోసా ఇచ్చారు. వారిని మంచిగా చూసుకుంటామని అంటున్నారు. మరి క్యాడర్ ఈ మాటలను నమ్ముతుందా అన్నది చర్చగా ఉంది. అంతే కాదు జగన్ ని క్యాడర్ సులువుగా కలిసే వీలు ఉంటుందా అన్నది మరో చర్చ. జగన్ చుట్టూ ఒక కోటరీ ఉంది. దానిని దాటుకుని ఆయనను చేరుకోవడం ఈ రోజుకీ కష్టం. అది జరిగితేనే జగన్ 2.0 అన్నది నిజమని క్యాడర్ నమ్ముతారని అంటున్నారు.