Begin typing your search above and press return to search.

జనాలు చూసుకుని మురిసి పోవడమేనా ?

అన్న వస్తే చాలు జన సందోహమే అని వారు హుషారు చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   19 March 2025 4:30 PM IST
జనాలు చూసుకుని మురిసి పోవడమేనా ?
X

వైసీపీ అధినేత తాజాగా తెనాలికి వచ్చారు. తమ పార్టీకి చెందిన ఒక నాయకుడి ఇంట్లో ఫంక్షన్ కి ఆయన రావడం జరిగింది అయితే దారి పొడవునా జనాలు జగన్ కి నీరాజనాలు పట్టారు. దాంతో వైసీపీ శ్రేణులు ఉప్పొంగుతున్నాయి. అన్న వస్తే చాలు జన సందోహమే అని వారు హుషారు చేస్తున్నారు.

జగన్ కి ఆదరణ ఎక్కడా తగ్గలేదని కూడా వైసీపీ అనుకూల మీడియాలో ప్రచారం సాగుతోంది. నిజమే జగన్ బయటకు వస్తే జనాలు ఆయనను చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. జగన్ వెంట పరుగులు తీస్తున్నారు. జగన్ కి జేజేలు పలుకుతున్నారు. జగన్ తో చేతులు కలిపి కరచాలనం చేయడానికి కూడా ఉరుకులు పెడుతున్నారు.

అయితే జగన్ కి ఈ ఆదరణ కొత్తదా ఏమైనా అన్న చర్చ కూడా ఉంది. జగన్ అంటే అభిమానం ఎపుడూ ఉంది. ఆయన చుట్టూ జనాలు ర్యాలీ కావడం అన్నది ఆయన రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి జరుగుతూనే ఉంది. జగన్ అంటే జనం అన్నట్లుగా ఆయన పాదయాత్ర సాగింది.

అలాగే 2024 ఎన్నికల ముందు జగన్ సిద్ధం సభలు పెడితే జనాలు పోటెత్తారు. సిద్ధం సభలను చూసిన వారు అంతా వైసీపీయే రెండోసారి అధికారంలోకి వస్తుందని కూడా అంచనా వేశారు. జగన్ బస్సు యాత్ర చేస్తే దాని వెంట జనాలు పరుగులు తీయడాన్ని అంతా చూశారు.

కానీ ఫలితం తేడా కొట్టింది. అలా ఇలా కాదు ఏకంగా 11 సీట్లకే వైసీపీకి పరిమితం చేసి ఘోరమైన రాజకీయ అవమానాన్ని మిగిల్చింది. దాంతోనే కదా వైసీపీకి నడ్డి విరిగినంత పని అయి చతికిలపడిపోయింది. తిరిగి లేచేందుకు కనీస ప్రయత్నం చేస్తున్నా శక్తి చాలడం లేదని అంటున్నారు.

ఇదిలా ఉంటే జనాలు రావడం అన్నది రాజకీయ పార్టీల విజయానికి కొలమానం కానే కాదు అన్నది చరిత్ర నిరూపించింది. ఇప్పటికి మూడు దశాబ్దాల క్రితం టీడీపీ రెండుగా చీలిపోయింది. బాబు టీడీపీ లక్ష్మీపార్వతి టీడీపీ అంటూ వేరు పడ్డాయి. 1996లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో లక్ష్మీపార్వతి ప్రచారానికి వస్తే జనాలు ఎక్కడ చూసినా విరగబడ్డారు. కానీ ఆమె పార్టీ ఒక్క సీటూ గెలుచుకోలేదు.

ఇక సినీ నటులు కొంతమంది పార్టీ పెట్టి జనంలోకి వచ్చినపుడు వారికి వచ్చిన జనాలు వేరే ఎవరికీ రాలేదు. కానీ విజయం మాత్రం వారికి అందకుండా పోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అందువల్ల జనాలను చూసి మురిసిపోతే ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు.

వైసీపీ మళ్ళీ 2029 ఎన్నికల్లో గెలిచి తీరాలీ అంటే దానికి చేయాల్సింది పార్టీని టాప్ టూ బాటం పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సి ఉంది. పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలి. కోటరీ మాటలు వినకుండా జగన్ స్వయంగా ఎవరు ఏమిటి అన్నది చూసుకుని మరీ లెక్క వేసుకుని పార్టీ పదవులు అప్పగించాలి.

అధినాయకత్వం జనాలకు చేరువగా ఉండాలి. అదే సమయంలో పార్టీ జనాలకు కూడా చేరువ కావాలి. నాయకుడి దగ్గరకు వెళ్ళి ఏమైనా చెప్పుకోవచ్చు అన్న ధీమా క్యాడర్ లో కలగాలి. అంతే కాదు అయిదేళ్ళ ప్రభుత్వ పాలనలో వైసీపీ ఏ ఏ తప్పులు చేసింది అన్నది పూర్తి స్థాయిలో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏ ప్రభుత్వంలో అయినా అన్నీ మంచే ఉండవు. జనాలకు నచ్చనివి ఉంటాయి.

అలాంటి వాటిని పట్టుకుని మనస్పూర్తిగా తప్పులను దిద్దుకోవాల్సి ఉంది. ఇక వైసీపీ ని వీడిన వర్గాలను కానీ ఆ పార్టీ విధానాల పట్ల ఇబ్బంది పడి దూరం అయిన వారిని కానీ చేరువ చేసుకోవాలి. ఇలా ఎన్నో రిపేర్లు చేసుకుంటే తప్ప ఏపీలో ఫ్యాన్ గిర్రున తిరిగే అవకాశాలు ఉండవని అంటున్నారు. అయితే జగన్ కి జనాలు వచ్చారు. ఆయన ప్రజాదరణకు తిరుగులేదు అని భావించి వందిమాగధులు ఎవరైనా ధీమాకు పోయి అవే నిజమని అధినాయకత్వానికి చెప్పినా కోటరీ మాటలు విని అధినేత కోటలో కూర్చున్నా కూడా వైసీపీకి షాకులు తప్పవని అంటున్నారు. సో అదన్న మాట మ్యాటర్. ఇక వైసీపీ అలెర్ట్ కావడమే కీలకం.