బెంగళూరులో జగన్ భారీ స్కెచ్...వారి మీదనే గురి ?
తాడేపల్లి లో ఆయన కేవలం సమీక్షలు నాయకులతో సమావేశాలకే పరిమితం అవుతున్నారు.
By: Tupaki Desk | 2 March 2025 8:00 PM ISTవైసీపీ అధినేత మాజీ సీఎం సేఫెస్ట్ ప్లేస్ గా బెంగళూరుని ఎంచుకున్న సంగతి తెలిసిందే. అక్కడ ఆయన యలహంక ప్యాలెస్ లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. తాడేపల్లి లో ఆయన కేవలం సమీక్షలు నాయకులతో సమావేశాలకే పరిమితం అవుతున్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అందువల్ల వైసీపీ రాజకీయ కదలికలు అన్నీ వారికి తెలుస్తాయన్న ముందు జాగ్రత్తతోనే బెంగళూరు నుంచే జగన్ పావులు కదుపుతున్నారు అని అంటున్నారు. ఇటీవల కాలంలో తాడేపల్లి జగన్ ప్యాలెస్ బయట అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో మొత్తం అంతా సీసీ కెమెరాలు అక్కడ పోలీసులు ఏర్పాటు చేసి గట్టి నిఘాను పెట్టారు. దాంతో మరింతగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ క్రమంలో జగన్ బెంగళూరు నుంచే తన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారు అని అంటున్నారు. ప్రస్తుతానికి ఆయన కాంగ్రెస్ మీదనే టార్గెట్ చేశారు అని అంటున్నారు. కాంగ్రెస్ లో ఉన్న వైఎస్సార్ సన్నిహితులు సీనియర్లను వైసీపీలోకి తీసుకుని రావాలని చూస్తున్నారు వైసీపీ నుంచి నేతలు అంతా కూటమి దిశగా క్యూ కడుతున్నారు. అధికారం ఎటు వైపు ఉంటే అటు వైపుగా చాలా మంది సాగుతున్న నేపథ్యం ఉంది.
ఈ క్రమంలో కూటమి వైపు నుంచి వైసీపీలోకి చేరికలు ఇప్పట్లో ఉండవని అంటున్నారు. ఎన్నికల వేళలో మాత్రం అటు నుంచి ఇటు ఉంటాయని అంటున్నారు. దాంతో ఏపీలో కాంగ్రెస్ నుంచి కీలక నేతలను తెచ్చి వైసీపీని బలోపేతం చేసుకోవడం మీద జగన్ ఫోకస్ పెడుతున్నారు అని అంటున్నారు.
అలా చేయడం వల్ల వైసీపీ ముఖ్య స్థానాలలో బలోపేతం అవుతుందని అలాగే తన సొంత చెల్లెలు షర్మిల నాయకత్వం వహిస్తున్న ఏపీ కాంగ్రెస్ ని నిర్వీర్యం చేయడం ద్వారా రాజకీయంగా ఆమెకు చెక్ చెప్పాలని భారీ స్కెచ్ తో ఉన్నారని అంటున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగానే జగన్ మార్క్ వ్యూహాలు సాగుతున్నాయని చెబుతున్నారు.
ఇంకో వైపు చూస్తే కాంగ్రెస్ లో గత పదేళ్ళుగా ఎలాంటి పదవులు లేకపోయినా సీనియర్లు ఆ పార్టీని అట్టే పెట్టుకుని ఉన్నారు. వారంతా టీడీపీ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నారు. దాంతో వారిని చేర్చుకుంటే వైసీపీకి కొండంత అండ దొరుకుతుందని జగన్ అంచనా వేస్తున్నారు అని అంటున్నారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన సాకె శైలజానాధ్ ని జగన్ ఈ విషయంలో ఉపయోగిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఆయన కూడా కాంగ్రెస్ లోని సీనియర్లను వైసీపీలోకి రప్పించేందుకు రాయబారాలు నడుపుతున్నారని అంటున్నారు ఇక వైసీపీ అధినేత కూడా చాలా మంది కీలక నేతలతో చర్చలు జరిపారని తెలుస్తోంది.
కొందరు సీనియర్లు అయితే తమ వారసులకు రాజకీయ భవిష్యత్తు ఇస్తే కీనుక తప్పకుండా వైసీపీలో చేరేందుకు సిద్ధమని చెబుతున్నారని అంటున్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక కీలక నేత కేంద్ర స్థాయిలో మంత్రి పదవి చేసిన బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అయితే తమకు ఎంపీ టికెట్ ఇస్తే తప్పకుండా పార్టీలో చేరుతాను అని చెప్పారని అంటున్నారు.
ఆయన కుటుంబానికి రాజకీయంగా ఉన్న పలుకుబడి ఆయనకు ఉన్న క్లీన్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని వైసీపీ ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని చెబుతున్నారు. ఇలా చాలా మంది కాంగ్రెస్ కీలక నేతలను వైసీపీలోకి ఆహ్వానిస్తూ అధినాయకత్వం ఫుల్ బిజీగా ఉందని అంటున్నారు. ఏప్రిల్ నుంచి జగన్ జిల్లాల టూర్లు మొదలెడుతున్నారు. ఈ టూర్లలోనే ముఖ్య నాయకులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా వైసీపీకి కొత్త ఊపు ఇవ్వాలని భావిస్తున్నారు అని అంటున్నారు.
ఏపీలో నలభై శాతం ఓట్లు షేర్ తో బలమైన పార్టీగా వైసీపీ మాత్రమే ఉందని వేరే ఏ పార్టీకి కూటమిని ఎదుర్కొనే సత్తా లేదని వైసీపీ అధినాయకత్వం చెబుతూ ఆపరేషన్ ఆకర్ష్ కి తెర తీస్తోంది. 2029లో కచ్చితంగా అధికారంలోకి వస్తామని అందరికీ న్యాయం చేస్తామని చెబుతూ వస్తున్నారు. చూడాలి మరి ఈ ఆపరేషన్ కి ఎవరు చిక్కుతారో.