చెల్లి మాదిరి తల్లిని అనే ధైర్యం చేయలేని జగన్!
పిల్లలు ఇద్దరు ఆస్తుల మీద ఎవరికి వారు తమ వాదనల్ని వినిపిస్తున్నారు.
By: Tupaki Desk | 30 Oct 2024 6:15 AM GMTపిల్లలు ఇద్దరు ఆస్తుల మీద ఎవరికి వారు తమ వాదనల్ని వినిపిస్తున్నారు. ఇలాంటి వేళ.. ఎవరైనా ఏం చెప్పగలరు? ఆస్తుల పంచాయితీ నడుస్తున్న కుటుంబం ఏమైనా ఆషామాషీనా? అంటే అదీ కాదూ. చిన్న వయసులోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి.. కోట్లాదిమందిలో క్రేజ్ ఉన్న వ్యక్తికి.. జాతీయపార్టీ రాష్ట్ర అధ్యక్షురాలి హోదాలో ఉన్న మహిళకు మధ్య నడిచే పోరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
వ్యక్తుల మీద ఉన్న అభిమానంతో ఎవరైనా ఎవరి పక్షమైనా నిలిచే వీలుంది. కానీ.. ఇక్కడ ప్రశ్నఏమంటే.. నాకౌట్ పంచ్ అన్నది ఒకటి ఉంటుందని.. వైఎస్ కుటుంబంలోని ఆస్తుల పంచాయితీలో ఆ తరహా నాకౌట్ పంచ్ విజయమ్మ చేతిలో ఉందన్నది మర్చిపోకూడదు. ఆస్తుల వివాదంపై స్పందించిన షర్మిలకు కౌంటర్ ఇచ్చేందుకు పదునైన వాదనను రెఢీ చేసినప్పటికీ.. దాని ఎక్సైపైరీ డేట్ అన్నది విజయమ్మ గొంతు విప్పే వరకే. ఒక్కసారి ఆమె సీన్లోకి ఎంట్రీ ఇచ్చేసిన తర్వాత చేయగలిగింది తక్కువగా ఉంటుంది.
వైఎస్ బతికి ఉండగానే షర్మిలకు ఆస్తులు ఇచ్చేశారని జాబితా చదివారని.. జగన్ పేరుతో పెట్టిన ఆస్తుల జాబితా ఎందుకు బయటపెట్టలేదన్న ప్రశ్నను తెర మీదకు తీసుకొచ్చారు విజయమ్మ. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మనసుకు చాలా బాధేస్తుందని.. అబద్ధాల పరంపరకు తెర దించాలనే లెఖ రాస్తున్నట్లుగా విజయమ్మ లేఖ స్పష్టం చేసింది. తాజా పరిణామం పిల్లలు ఇద్దరికే కాదు.. రాష్ట్రానికి మంచిది కాదన్న ప్రస్తావన ఆమె తీసుకొచ్చారు.
ఆస్తుల పంపకాలు జరిగిపోయినట్లుగా వాదనలు వినిపించిన వైవీ సుబ్బారెడ్డి.. విజయసాయి రెడ్డిలు ఇప్పుడు మాట్లాడలేని రీతిలోవిజయమ్మ లేఖ మారిందని చెప్పాలి. తన లేఖలో వైవీ సుబ్బారెడ్డిని.. విజయసాయి రెడ్డిని విజయమ్మ కాస్తంత ఘాటుగా విరుచుకుపడ్డారు. జగన్.. షర్మిల ఇద్దరు తన పిల్లలేనని.. వారిద్దరిని తాను.. వైఎస్సార్ ఎంతో అపురూపంగా.. ప్రేమగా పెంచుకున్నామన్నవిషయాన్ని ప్రస్తావించిన విజయమ్మ.. ‘అమ్మగా నాకు ఇద్దరూ సమానమే. రాజశేఖర్ రెడ్డి మాటా సమానమే. ఆస్తులు కూడా ఇద్దరికీ సమానమనేది నిజం. నలుగురుచిన్న బిడ్డలకు ఆస్తులు సమానంగా ఉండాలన్న వైఎస్సార్ ఆజ్ఞ అంతే నిజం. ఆస్తుల పెరుగుదలలో జగన్ కష్టం ఉందనేది నిజమైనా.. ఉన్నవన్నీ కుటుంబ ఆస్తులే అనేది వాస్తవం’’ అని చెప్పటం ద్వారా కుటుంబ పెద్దగా తన పాత్రను నూటికి నూరు శాతం న్యాయంగా వ్యవహరిస్తున్నారన్న భావన కలిగేలా చేశారు.
అంతేకాదు.. కొడుకు బాధ్యతఎలా ఉంటుంది? ఇంటి ఆడపిల్లను ఎలా చూసుకోవాలన్న విషయంతో పాటు. వైఎస్ కు జగన్ ఇచ్చిన మాటను గుర్తు చేయటం ద్వారా విజయమ్మ ఆయన్ను ఇరుకున పడేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘‘జగన్ బాధ్యత కల కుమారుడిగా కుటుంబ ఆస్తులను సంరక్షించాలి. వైఎస్సార్ చివరి రోజుల్లో.. ‘నాన్నా.. నీ తర్వాత ఈ లోపంలో పాప మేలు కోరేవారిలో నేనే మొదటివాడిని’ అంటూ జగన్ మాట ఇచ్చింది కూడా నిజం’’ అంటూ పేర్కొన్న అంశాలకు జగన్ తో సహా ఎవరు మాత్రం కౌంటర్ ఇవ్వగలరు? ఒకవేళ ఇచ్చినా అది ఇట్టే తేలిపోవటం ఖాయం. చెల్లిని రెండు మాటలు అనేందుకు ధైర్యం చేసిన జగన్.. అదే రీతిలో తల్లిని అనే సాహసం చేయలేరన్నది తెలిసిందే. ఈ కారణంతోనే సమయానికి తగ్గట్లు విజయమ్మ పాత్రను షర్మిల తెర మీదకు తీసుకొచ్చారని చెప్పకతప్పదు.