పోసాని అరెస్ట్ పై స్పందించిన జగన్... రాజంపేటకు వైసీపీ లాయర్లు!
ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి అరెస్టును వైసీపీ అధినేత జగన్ స్పందించారు.
By: Tupaki Desk | 27 Feb 2025 8:03 AM GMTగత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో పాటు పలువురు నాటి ప్రతిపక్ష నేతలపై వైసీపీ నేత, నటుడు, పోసాని కృష్ణ మురళి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే! దీనిపై జనసేన నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా పోసానిపై 196, 353 (2), 111 రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో.. బుధవారం రాత్రి హైదరాబాద్ లోని పోసాని నివాసానికి చేరుకున్న పోలీసులు.. అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇవాళ ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు! ఈ సమయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ స్పందించారు.
అవును... ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి అరెస్టును వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఈ సందర్భంగా అరెస్టును ఖండించిన ఆయన.. పోసాని కృష్ణమురళి భార్య కుసుమలతను ఫోన్ లో పరామర్శించారు. ఈ సందర్భంగా కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని.. ఈ సమయంలో పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా స్పందించిన జగన్... పోసాని కృష్ణమురళికి వైసీపీ అండగా ఉంటుందని.. తాము అందరం మీకు తోడుగా ఉంటామని.. ప్రజలు, దేవుడు అంతా చూస్తున్నారని.. ఈ సమయంలో పోసానికి పార్టీ తరుపున న్యాయ సహాయం అందిస్తామని జగన్ తెలిపారు. ఈ సమయంలో.. సీనియర్ న్యాయవాదులకు ఆ బాధ్యతలు అప్పగించామని పేర్కొన్నారు.
ఇందులో భాగంగా.. పొన్నవోలు సుధాకర్ రెడ్డి సహా అందరినీ రాజంపేటకు పంపించామని తెలిపారు. ఇదే సమయంలో పార్టీ నాయకులందరినీ కోర్టు వద్దకు పంపించామని.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిరంకుశ పాలన ఎక్కువ రోజులు కొనసాగదని జగన్ అన్నారు.
మరోవైపు పోసాని అరెస్టుపై వైసీపీలోని పలువురు సీనియర్ నేతలతోనూ జగన్ చర్చించినట్లు చెబుతున్నారు. జీవీరెడ్డి ఆరోపణలు, రాజీనామా ఎపిసోడ్ తర్వాత ఈ అరెస్టు వ్యవహారం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని వారితో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇక.. పోలీసులు పోసానిని ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టి.. రిమాండు కోరనున్నారని అంటున్నారు.
ఇక... పోసానిని ఇప్పటికే అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్ కు తీసుకొచ్చిన పోలీసులు.. స్టేషన్ లోనే ప్రభుత్వ వైద్యుడు గురుమహేష్ ఆధ్వర్యంలో వైద్యపరీక్షలు నిర్వహించారు. ఆయన స్టేట్ మెంట్ ను రైల్వేకోడూరు సీఐ నమోదు చేశారు. ఈ సమయంలో పోసానిని రైల్వేకోడూరు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని అంటున్నారు.