జగన్‌కు 'ఆ ఒక్కటే' కాదు.. చాలానే ఉన్నాయ్.. !
తాజాగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ విషయాన్ని తేల్చేశారు.
By: Tupaki Desk | 7 March 2025 4:00 AM ISTవైసీపీ అధినేత జగన్.. ఒకే ఒక్క విషయాన్ని పట్టుకుని యాగీ చేస్తున్నారని సోషల్ మీడియా జనాలు నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. అదే.. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా! దీని కోసం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, అది ఫలించడం లేదు. ఎప్పుడు ఫలిస్తుందన్నది కూడా చె్ప్పలేని పరిస్థితి. తాజాగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ విషయాన్ని తేల్చేశారు. రూల్స్, నిబంధనలు.. ఒప్పుకోనప్పుడు.. ప్రజలు కూడా ఇవ్వనప్పుడు.. నేను ఎలా ఇస్తానంటూ ఆయన రూలింగ్(ఇదే కీలకం) ఇచ్చి.. విషయానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేశారు. అంటే.. సభ పరంగా ఇచ్చేది లేదని ఆయన తేల్చేశారు.
ఇక, ఇప్పుడు తేలాల్సింది.. తేల్చుకోవాల్సింది.. కోర్టులోనే. ఇది ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేం. అయినప్పటికీ.. జగన్ తన పంతాన్ని మాత్రం వీడడం లేదు. ఇదిలావుంటే.. ఇలా మంకుపట్టు పట్టి.. జగన్ సాధించేది ఏంటనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మరోవైపు.. జగన్‌కు ఈ ఒక్క సమస్యే ఉందా? అంటే.. కాదనే అంటున్నారు పరిశీలకులు. జగన్ కొంత దృష్టి పెడితే.. ఆయన చుట్టూ చాలానే సమస్యలు ఉన్నాయి. ప్రతిపక్ష హోదాను మించిన స్థాయిలో ఈ సమస్యలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. ప్రధానం పార్టీని లైన్‌లో పెట్టడంతోపాటు.. కీలక నేతలను బుజ్జగించి.. పార్టీకి అనుకూలంగా పనిచేయించుకునే దిశగా అడుగులు వేయడం.
ఈ రెండు సమస్యలు పార్టీని వెంటాడుతున్నాయి. వీటిపై జగన్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అదేసమయంలో.. మరో కీలక విషయం కూడా ఉంది. అది.. ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం చేయడం. ప్రస్తుతం జగన్ అనుసరిస్తున్న వైఖరి కారణంగా .. చాలా మంది ఎమ్మెల్యేలు.. నిరాశతో ఉన్నారు. వీరిలో కొత్తవారు ప్రధానంగా నిప్పులు చెరుగుతున్నారు. అవకాశం వస్తే.. వెళ్లి పోయేందుకు కూడా ఒకరిద్దరు రెడీ అవుతున్నారన్న సంకేతాలు కూడా వస్తున్నాయి. కాబట్టి.. ముందుగా.. ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం చేస్తే.. చాలా బెటర్ అన్న సూచనలు వస్తున్నాయి. జగన్ వల్ల.. రేపు మేం ప్రజలకు మొహం చూపించే పరిస్థితి లేకుండా పోయిందన్న వాదనను జగన్ మాత్రం ఎలా కొట్టేయగలరు? అనేది ప్రశ్న.
ఇక, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా? 100 మంది ఉన్నారా? అనేది పక్కన పెడితే.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు అంటే.. జగనే. కాబట్టి.. తనకు ఓటేసి అధికారం ఇవ్వకపోయినా.. ప్రజల పక్షాన గళం వినిపించాల్సిన బాధ్యత జగన్పైనే ఉంటుం ది. ఈ క్రమంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన పోరు ప్రారంభించడం అత్యంత కీలకం. గతంలో చంద్రబాబు కూడా సభకు వెళ్లలేదు. కానీ, ప్రజలను వదిలి పెట్టకుండా.. వారితోనే ఉన్నారు. ఇప్పుడు జగన్ అటు సభకు, ఇటు ప్రజల మధ్యకు కూడా రావడం లేదు. 9 మాసాల తర్వాత కూడా ఇప్పటికీ.. ఒక బహిరంగ సభ పెట్టిన పాపాన పోలేదు. గతంలో 9 నెలల కాలంలోనే చంద్రబాబు రెండు సార్లు బహిరంగం సభలు పెట్టి.. ఇసుక అక్రమాలపై వైసీపీని నిలదీశారు. సో.. జగన్ చేయాలంటే.. చాలానే పని ఉందని అంటున్నారు.