ఏదైనా అవార్డు ఇవ్వాలంటే.. అది జగన్‌కే నట!
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై తాజాగా స్పందించారు.
By: Tupaki Desk | 13 Nov 2024 2:21 PM GMTప్రపంచ బ్యాంకు కానీ, ఆర్బీఐ కానీ ఇలా ఏ ఆర్థిక సంస్థ అయినా అవార్డు ఇవ్వాలని అనుకుంటే.. అది తమకే ఇవ్వాలని వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. అప్పులు నియంత్రణలో తమ ముందు చూపును ఆర్థిక సంస్థలు గుర్తించాయని కూడా చెప్పారు. ఏపీని అప్పుల మయం కాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించామని.. ఐదేళ్లు కూడా అన్నీ ఆలోచించి అడుగులు ముందుకు వేశామని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై తాజాగా స్పందించారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలకు నిధులు కేటాయించకుండానే బడ్జెట్‌లో అంకెల గారడీచేశారంటూ కూటమి సర్కారుపై జగన్ విమర్శలు గుప్పించారు. తమ వైసీపీ పాలనలో అప్పులు ఎక్కువ చేశామని, రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని పదే పదే చెప్పిన చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరిలు ఇప్పుడు ఏం చెబుతారంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో రాష్ట్ర అప్పులు కేవలం 6.4 లక్షల కోట్ల రూపాయలుగానే పేర్కొన్నారన్నారు.
కానీ, గతంలో ఎన్నికల సమయంలో 10 లక్షల కోట్లు, 14 లక్షల కోట్ల అప్పులు చేశారంటూ వైసీపీపై విమర్శలు గుప్పించారని జగన్ చెప్పుకొచ్చారు. కానీ, రాష్ట్ర పరిస్థితిని గుర్తించి.. అప్పులు చేయడంలో చాలా నిబద్ధతగా ముందుకు సాగినట్టు తెలిపారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా ఆచి తూచి అప్పులు చేశామన్నారు. ప్రస్తుత బడ్జెట్‌లో ప్రకటించిన దానిలోనూ 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు గతం చంద్రబాబు హయాంలో చేసినవేనన్నారు.
కాబట్టి.. ఎవరైనా రాష్ట్రానికి ''అప్పు రహిత పాలన'' అందించారన్న అవార్డు ఇవ్వాలంటే అది వైసీపీకే ఇవ్వాలని.. చెందుతుందని కూడా జగన్ చెప్పుకొచ్చారు. కూటమి సర్కారు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు నిధులు కేటాయించలేదని విమర్శించారు. తమ హయాంలో తొలి బడ్జెట్ నుంచి కూడా నవరత్నాలకు నిధులు కేటాయించి.. పథకాలను అమలు చేశామని ఆయన పేర్కొనడం గమనార్హం. ఇదిలావుంటే.. బడ్జెట్ సమావేశాలకు రాకుండా.. మీడియా ముందు ఎన్ని చెప్పినా ప్రయోజనం లేదని నెటిజన్లు కామెంట్లు చేయడం గమనార్హం.