జగన్ సమీక్షకు రాని ఆ ఇద్దరూ ?
ఈ ఇద్దరూ జగన్ తాజాగా' నిర్వహించిన సమీక్షా సమావేశానికి గైర్ హాజరు కావడంతో జిల్లా వైసీపీలో చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 7 Dec 2024 4:23 AM GMTవైసీపీలో ఆ ఇద్దరూ సీనియర్ నేతలు. వారి రాజకీయ జీవితం దశాబ్దాల కాలం నాటిది. వారే శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఈ ఇద్దరూ జగన్ తాజాగా' నిర్వహించిన సమీక్షా సమావేశానికి గైర్ హాజరు కావడంతో జిల్లా వైసీపీలో చర్చ సాగుతోంది.
జగన్ తాడేపల్లి పార్టీ ఆఫీసులో నిర్వహించిన సమీక్షా సమావేశానికి శ్రీకాకుళం జిల్లా నేతలను అందరినీ పిలిచారు. సర్పంచులు, వార్డు మెంబర్ల నుంచి జెడ్పీటీసీ ఎంపీటీసీలు, మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. అయితే ఈ భేటీకి ప్రసాదరావు, తమ్మినేని సీతారాం. డుమ్మా కొట్టారని అంటున్నారు.
ఇలా ఎందుకు జరిగింది అని పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నారు. తమ్మినేని అయితే ఇటీవల కాలం వరకూ పార్టీ అధినాయకత్వం తో టచ్ లో ఉండేవారు. ఆయన ప్రతీ రివ్యూ మీటింగుకూ వచ్చేవారు. కానీ ఆముదాలవలసలో వైసీపీ ఇంచార్జిగా కొత్త నేత అయిన చింతాడ రవికుమార్ ని నియమించడంతో తమ్మినేని అలిగారని అంటున్నారు. ఆయన తన కుమారుడికి టికెట్ వచ్చే ఎన్నికల్లో ఇస్తారని ఆశిస్తున్నారు. తమ కుటుంబానికి దశాబ్దాలుగా ఆముదాలవలసలో ఉన్న రాజకీయ పలుకుబడిని కంటిన్యూ చేయాలంటే కొడుకుని నిలబెట్టాలని ఆయన అనుకుంటున్నారు.
అయితే ఆయనకు కాకుండా తమ్మినేని వ్యతిరేక వర్గంలో చురుకుగా పనిచేస్తూ గత ఎన్నికల్లో తమ్మినేని ఓటమికి కారణమైన వారికి పార్టీ పగ్గాలు అప్పచెప్పడంతో ఆయన ఆగ్రహంగా ఉన్నారని అందుకే ఆయన వైసీపీ సమీక్షకు రాలేదని అంటున్నారు
ఇక మాజీ మంత్రి ధర్మాన విషయం తీసుకుంటే ఆయన వైసీపీకి దూరం పాటిస్తున్నారు. ఆయనకు కానీ కుమారుడికి కానీ వైసీపీ శ్రీకాకుళం ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తామని చెబుతున్నా ఆయన మాత్రం ఎటూ తేల్చడం లేదు. అసలు ఆయన వైసీపీ నుంచి వేరు పడాలని చూస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఆయనకు వేరే పార్టీల నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే కనుక తన సంచలన ప్రకటన రిలీజ్ చేస్తారు అని అంటున్నారు
ఇలా ఇద్దరి నేతల గైర్ హాజరు వెనక వారి వారి కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఏది ఏమైనా పార్టీ అధికారంలో ఉన్నపుడు ఒక వెలుగు వెలిగిన ఈ నేతలు ఇద్దరూ ఇపుడు వైసీపీకి దూరంగా జరగాలని నిర్ణయించుకున్నారని ప్రచారం అయితే సాగుతోంది. మరి అది ఎంతవరకూ నిజం అనంది రానున్న రోజులలో తెలుస్తుంది. ఏది ఏమైనా వైసీపీ కూడా జిల్లాలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలని చూస్తోంది అని అంటున్నారు. దంతో కూడా సీనియర్లు దూరంగా ఉంటున్నారు అని చెబుతున్నారు.