జగన్ శీష్ మహల్...రుషికొండ బంగ్లా !
ఈ నేపధ్యంలో తాజాగా జాతీయ మీడియా మరోసారి జగన్ కట్టుకున్న డ్రీం ప్రాజెక్ట్ రుషికొండ బంగ్లా అని వార్తా కధనాలను ప్రసారం చేయడం విశేషం.
By: Tupaki Desk | 16 March 2025 1:12 AM ISTజగన్ అధికారం నుంచి దిగిపోయి తొమ్మిది నెలలు గడచింది. ఆయన చేసిన సంక్షేమం గురించి ఎవరూ చెప్పుకోవడం లేదు కానీ ఆయన హయాంలో జరిగిన ప్రజా వ్యతిరేక నిర్ణయాలమీద మాత్రం పెద్ద ఎత్తున చర్చ సాగుతోది. వందల కోట్లు ఖర్చు పెట్టి రుషికొండ భవనాన్ని విశాఖ సాగర తీరం వద్ద జగన్ నిర్మించారని దానిని ఏమి చేయాలో అర్థం కావడం లేదని కూటమి నేతలు పదే పదే విమర్శిస్తున్నారు.
ఈ నేపధ్యంలో తాజాగా జాతీయ మీడియా మరోసారి జగన్ కట్టుకున్న డ్రీం ప్రాజెక్ట్ రుషికొండ బంగ్లా అని వార్తా కధనాలను ప్రసారం చేయడం విశేషం. అంతే కాదు ఢిల్లీ మాజీ సీఎం ఆప్ అధినేత కేజ్రీవాల్ ఢిల్లీలో నిర్మించుకున్న అధికార భవనం శీష్ మహల్ తో పోల్చుతూ ఈ కధనాలను జాతీయ చానళ్ళు ప్రసారం చేస్తున్నాయి.
జగన్ రుషికొండ వద్ద ఏకంగా పది ఎకారాల స్థలంలో భారీ ఎత్తున విలాసవంతమైన భవంతిని నిర్మించారని జాతీయ చానళ్ళు ప్రసారం చేయడంతో మరోసారి ఈ అంశం జాతీయ తెర మీదకు వస్తోంది. జగన్ ఎంతో ఖర్చు చేసి మరీ ఈ భవంతి కట్టారని పేర్కొంటూ ఆ భవంతుల వెనక ఉన్న నిర్మాణ శైలిని వర్ణిస్తూ వచ్చాయి.
ఒక విధంగా చెప్పాలీ అంటే జగన్ సొంత ఆస్తిగానే ఈ భవనాలను చూపించేలా ఈ కధనాలు ఉన్నాయని అంటునారు. కేజ్రీవాల్ శీష్ మహల్ తో పోలిక తేవడం మరో విశ్లేషణ. అయితే జగన్ తాను కచ్చితంగా 2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తాను అని తలచారు. అంతే కాదు ఆ వెంటనే విశాఖకు మకాం మార్చాలని విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేయాలని తలపోశారు.
ఇక రుషికొండ భవనాలను తన అధికార నివాసంగా క్యాంప్ ఆఫీసుగా మార్చుకోవాలని చూశారని అందుకే అంత విలాసంగా కట్టారని విమర్శలు ఉన్నాయి. కానీ కేవలం 11 సీట్లకే పడిపోయి దారుణమైన ఓటమిని వైసీపీ మూటకట్టుకుంది. దాంతో జగన్ కలలు కల్లలు అయ్యాయి. ఇక్కడ విషాదం ఏంటి అంటే జగన్ రుషికొండ భవనాలను చూసేందుకు ఏ రోజు రాలేదు. అంతే కాదు ఆయన రుషికొండలో బిల్డింగ్ లో గంట సమయం అయినా గడపలేదు.
మంచి ముహూర్తం చూసుకుని అక్కడకు రావాలని అనుకున్నారు. ఇంతలో కొంప మునిగింది, అధికారం పోయింది. ఈ నేపథ్యంలో జగన్ ఒక్క రోజు కూడా ఉండని రుషికొండ భవనాలను కేజ్రీవాల్ శీష్ మహల్ తో ఎలా పోలుస్తారు అని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. పైగా అది ప్రభుత్వ ఆస్తిగానే ఉంది కానీ జగన్ ఆస్తి కాదని చెబుతున్నాయి.
ఇక అరవింద్ కేజ్రీవాల్ అయితే శీష్ మహల్ అధికార నివాసంలో ఏళ్ళ తరబడి ఉండి పాలించారని గుర్తు చేస్తున్నారు. అయితే కూటమి నేతలు మాత్రం జగన్ సొంత భవనం రుషికొండ అంటూంటే నేషనల్ మీడియా కూడా ఇపుడు అదే విధంగా ప్రచారం చేస్తోంది అని అంటున్నారు. మొత్తానికి జగన్ కి ఈ రుషికొండ తలనొప్పులు తగ్గేట్లుగా లేవని అంటున్నారు.