Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ సేఫ్‌.. సెంటిమెంటు అడ్డొస్తోందా..!

క‌క్ష పూరిత రాజ‌కీయాలు చేసిన వైసీపీ విష‌యంలో వదిలేది లేద‌ని ఆయ‌న త‌ర‌చుగా చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   22 Jan 2025 1:30 PM GMT
జ‌గ‌న్ సేఫ్‌.. సెంటిమెంటు అడ్డొస్తోందా..!
X

వైసీపీ అధినేత‌ను ఇరుకున పెట్టాల‌న్నది.. కూట‌మిలోని కొంద‌రు నాయ‌కుల ల‌క్ష్యం. ముఖ్యంగా ఉప స‌భాప‌తిగా ఉన్న వైసీపీ మాజీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు పెద్ద ఎత్తున ఈ విష‌యంలో ప్ర‌య‌త్నం చేస్తున్నారు. త‌న‌పై జ‌రిగిన థ‌ర్డ్‌ డిగ్రీ స‌హా.. అవ‌మానాల‌ను ఆయ‌న ఇంకా మ‌రిచిపోలేక పోతున్నారు. రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థులు ఉంటారు. కానీ, క‌క్ష పూరిత రాజ‌కీయాలు చేసిన వైసీపీ విష‌యంలో వదిలేది లేద‌ని ఆయ‌న త‌ర‌చుగా చెబుతున్నారు.

ఈయ‌న‌ తో పాటు.. జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి వంటివారు కూడా.. జ‌గ‌న్ విష‌యంలో సీరియ‌స్‌గానే ఉన్నారు. ఆయనపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. మ‌రికొంద‌రు నాయ‌కులు కూడా ప‌ట్టుబ‌డుతున్నారు. అయితే.. ఈ విష‌యం లో ఎక్క‌డో తేడా కొడుతోంది. రాష్ట్ర స్థాయిలో జ‌గ‌న్‌పై కేసులు పెట్టాల‌న్న చ‌ర్చ తొలినాళ్ల‌లో జోరుగా వినిపించింది. వైసీపీ హ‌యాంలో ఇసుక‌, మ‌ద్యం కుంభ‌కోణాలు జ‌రిగాయ‌ని వీటిని ఆస‌రాగా చేసుకుని ఆయన‌ పై కేసులు పెట్టొచ్చ‌న్న‌ది కొంద‌రి వాద‌న‌గా ఉంది.

అయితే.. రెండు మూడు మాసాల కింద‌ట‌.. ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న చంద్ర‌బాబు.. కేసులు పెట్టే విష‌యంపై చ‌ర్చించారు. కానీ, ఆయ‌నే స్వ‌యంగా వెన‌క్కి త‌గ్గారు. ముందు అధికారుల‌పై కేసులు పెట్టి.. వారిని విచారించ‌డం ద్వారా.. యంత్రాంగాన్ని ప్ర‌భుత్వానికి అనుకూలంగా మార్చుకోవాల‌న్న‌ది దీనిలో ప్ర‌ధాన వ్యూహం. ఇక‌, రెండోది జ‌గ‌న్‌పై కేసులు న‌మోదు చేసినా.. ఆయ‌న కోర్టుకు వెళ్లి స్టే అయినా తెచ్చుకోవ‌చ్చు. లేదా.. ముంద‌స్తు బెయిళ్లు పొందే అవ‌కాశం ఉంటుంది.

అయితే.. దీనివ‌ల్ల‌.. సానుభూతి పెరుగుతుంద‌న్న‌ది చంద్ర‌బాబు ప్ర‌ధాన ఉద్దేశం. వైసీపీ ఓడిపోయి.. ఆరు మాసాలు అయిపోయినా.. ఇప్ప‌టి వర‌కు ప్ర‌జ‌ల్లో అయితే.. సానుభూతి ప‌వ‌నాలు ఎక్క‌డా వీయ‌డం లేదు. ఇప్పుడు చేజేతులా.. ఆయ‌న విష‌యంలో కేసులు పెట్టి సానుభూతి గ్రాఫ్ పెంచిన‌ట్టు అవుతుంద‌ని వెనుకంజ వేసిన‌ట్టు తెలుస్తోంది. దీంతో జ‌గ‌న్‌పై కేసుల విష‌యంలో కూట‌మి ప్ర‌భుత్వం మౌనంగా ఉంది. ఇదే అభిప్రాయంతో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఉండ‌డంతో జ‌గ‌న్ ఇప్ప‌టికైతే సేఫేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదే స‌మ‌యంలో స‌ర్కారుకు ప్ర‌జ‌ల్లో బ‌ల‌మైన న‌మ్మ‌కం వ‌చ్చాక‌.. అప్పుడు ఈ కేసులు పుంజుకునే అవ‌కాశం లేక‌పోలేద‌ని చెబుతున్నారు.