Begin typing your search above and press return to search.

బాబు పవన్ ని మించిన నటుడు...జగన్ మార్క్ సెటైర్లు

ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు మీద హాట్ కామెంట్స్ చేశారు.

By:  Tupaki Desk   |   13 Sep 2024 12:18 PM GMT
బాబు పవన్ ని మించిన నటుడు...జగన్ మార్క్ సెటైర్లు
X

పిఠాపురం నియోజకవర్గంలో ఏలూరు రిజర్వాయర్ వల్ల వచ్చిన వరదలతో దెబ్బ తిన్న పంటలను లోతట్టు ప్రాంతాల బాధితులను పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు మీద హాట్ కామెంట్స్ చేశారు. వరదలు వస్తే ప్రజలను గాలికి వదిలేసిన ప్రభుత్వం బాబుది అని అన్నారు.

కేవలం ఫోటోల కోసమే బాబు జనంలోకి వస్తారని చేసేది ఏమీ లేకపోయినా అంతా చేసినట్లుగా చూపించే బాబు మంచి నటుడు అని జగన్ సెటైర్లు పేల్చారు. మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ సినీ నటుడని కానీ బాబు ఆయనను మించిన డ్రామా ఆర్టిస్టు అని కామెంట్స్ చేశారు.

పబ్లిసిటీ చేసుకోవడంలో ఉన్న ఫోకస్ ప్రజలకు మేలు చేయడంలో లేదని బాబు మీద విమర్శలు సంధించారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులను నిలువునా ముంచేసింది అని అన్నారు. ఏలేరు రిజర్వాయర్ లో నీళ్ళు నిండా ఉంటే మేనేజ్ చేయకుండా జనాలను అలెర్ట్ చేయకుండా దిగువకు వదిలేశారు అని అన్నారు.

రైతుల పొలాలు నిండా మునిగాయని వారు అన్ని రకాలుగా నష్టపోయారు అని ఆయన విమర్శించారు. ఏ మాత్రం బాధ్యత లేకుండా ప్రభుత్వం వ్యవహరించింది అని అన్నారు. కనీసం కలెక్టర్లతో కూడా రివ్యూ చేయలేదని జగన్ ఫైర్ అయ్యారు. ఈ రోజుల రైతులను ఆదుకునేందుకు కూడా ముందుకు రావడం లేదు అని అన్నారు. రైతులకు పంట భీమా లేదని, అలాగే వారికి ఇన్ పుట్ సబ్సిడీ లేదని, ఎకరాకు పది వేలు ఇస్తామని చెబుతున్న చంద్రబాబు ఆ ఇచ్చేది కూడా తమ పార్టీ వారికే ఇస్తారు తప్ప రైతులు అందరికీ కాదని అన్నారు.

తాము అధికారంలో ఉన్నపుడు రైతు భరోసా క్రమం తప్పకుండా ఇచ్చేవారని, అలాగే రైతులకు మేలు చేయడానికి ప్రభుత్వమే రైతుల తరఫున భీమా కట్టేదని, దాని వల్ల రైతులకు ఈ సమయంలో ఏకంగా 24 వేల నుంచి 29 వేల దాకా ఎకరాకు వచ్చేదని అన్నారు. అలాగే సున్నా వడ్డీకి ఎకరాకు నాలుగు వేల రూపాయలు వంతున రుణం అందేదని చెప్పారు.

ఇలా అన్ని విధాలుగా కలుపుకుని ఒక ఎకరాకి తమ హయాంలో నలభై అయిదు వేల దాకా ఇలాంటి సమయాంలో ఇచ్చేవారని చెప్పారు. చంద్రబాబు జగన్ మీద కోపం పెంచుకుని నన్ను విమర్శిస్తూ పోతున్నారు తప్ప ప్రజలకు రైతులకు చేయాల్సిన మంచిని చేయడం లేదని అన్నారు

ఎన్నికల ముందు ప్రతీ ఇంటికీ వెళ్ళి తల్లికి వందనం అంటూ ఒక్కొక్కరికీ పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారని అలాగే 18 ఏళ్ళు నిండిన మహిళలకు ఏడాదికి 18 వేలు ఇస్తామని చెప్పారని, నిరుద్యోగ యువతకు ఏకంగా నెలకు మూడు వేలు వంతున ఏడాదికి ముప్పయి ఆరు వేలు ఇస్తామని చెప్పారని జగన్ గుర్తు చేశారు.

ఇపుడు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతోందని ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని అన్నారు. దాంతో బాబు మాటలు మోసాలు అని తెలిసి జనాలకు కోపం వస్తోందని అయితే వారి తరఫున మాట్లాడుతున్న తమ లాంటి వారిని కట్టడి చేయడానికి చూస్తున్నారు అని జగన్ ఫైర్ అయ్యారు. ఎన్ని చేసినా ప్రజల ఆగ్రహం నుంచి ఈ ప్రభుత్వం తప్పించుకోలేదని తొందరలొనే తిరుగుబాటు రావడం ఖాయమని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా మాటలు కట్టి పెట్టి చేతలకు దిగాలని ఆయన సూచించారు

ఏలేరు కెనాల్ ఆధునీకరణ పనులు తమ హయాంలో చేపట్టలేక పోవడానికి కారణం మొత్తం కెనాల్ లో నిండు కుండల్లా నీరు ఉండేదని ఆయన చెప్పారు. రైతులకు క్రాప్ హాలీడే ఇచ్చి చేయలేకనే వేగంగా ఆ పనులు చేయలేకపోయామని జగన్ అన్నారు. అదే చంద్రబాబు 2015లో ఏలేరు కెనాల్ ఆధునీకరణ పనులకు 295 కోట్ల రూపాయలతో అంచనాలు వేసి కూడా పని చేయలేదని బాబు గత పాలనలో కరవు మొత్తంగా ఉందని కెనాల్ ఖాళీగా ఉందని అయినా ఎందుకు చేయలేదని జగన్ ప్రశ్నించారు.