జగన్ 'సెబ్' రద్దు: 70 వేల మంది హ్యాపీ!
ఈ క్రమంలో అప్పటి వరకు ఉన్న ఎక్సైజ్ అధికారులను ప్రత్యేకంగా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(ఎస్ ఈబీ-సెబ్)ను ఏర్పాటు చేసి.. దానిలోకి 70 వేల మందిని పంపించారు.
By: Tupaki Desk | 12 Sep 2024 4:34 AM GMTగత వైసీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాలు.. తీసుకువచ్చిన కొన్ని పథకాలకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం మార్పు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పథకాలకు అన్నింటికీ దాదాపు పేర్లు మార్చేసింది. అదేవిధంగా కొన్ని నిర్ణయాలను కూడా మార్చుతున్నారు. దీనిలో భాగంగా తాజాగా చంద్రబాబు సర్కారు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(ఎస్ ఈబీ-సెబ్)ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విభాగంలో మొత్తం 70 వేల మందికి పైగా అధికారులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా ఇప్పుడు హ్యాపీగా ఫీలవుతున్నారు. చంద్రబాబు నిర్ణయాన్ని వారు స్వాగతిస్తున్నారు.
ఎందుకు వివాదం?
ప్రతి రాష్ట్రంలోనూ ఎక్సైజ్ అదికారులు ఉంటారు. వీరికి కూడా పోలీసుల మాదిరిగానే కొన్ని అధికారాలు ఉంటాయి. మద్యం అడ్డగోలు రవాణా, అక్రమాలు.. వంటివి అరికట్టేందుకు వీరిని నియమిస్తారు. అలానే ఏపీలోనూ ఎక్సైజ్ అధికారులుఉన్నారు. అయితే.. జగన్ వచ్చిన తర్వాత.. ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు. అన్నీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడిపించారు. అయితే.. ఒక్కబార్లను మాత్రమే ప్రైవేటు పరం చేశారు. ఈ క్రమంలో అప్పటి వరకు ఉన్న ఎక్సైజ్ అధికారులను ప్రత్యేకంగా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(ఎస్ ఈబీ-సెబ్)ను ఏర్పాటు చేసి.. దానిలోకి 70 వేల మందిని పంపించారు.
దీనిని అప్పట్లోనే ఎక్సైజ్ అధికారులు వ్యతిరేకించారు. దీనికి కారణం.. ఎక్సైజ్ అధికారుల కంటే ఎక్కువగా నిబంధనలు ఉండడం.. అక్రమాలకు అధికారులను బాధ్యులను చేయడం.. నిరంతరం తనిఖీలు.. పనివేళలతో సంబంధం లేకుండా డ్యూటీలు వేయడం వంటివి ఉద్యోగులకు కంటిపై కునులు లేకుండా చేశాయి. దీంతో అప్పట్లోనే వైసీపీ సర్కారు తెచ్చిన జీవో 12/2020ని హైకోర్టులోనూ సవాల్ చేశారు. అయితే.. అప్పట్లో సర్కారుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఉద్యోగులు సర్దుకు పోయారు. ఇక, విధుల విషయానికి వస్తే.. ఎక్కడ ఇతర రాష్ట్రాల నుంచి మద్యం పట్టుబడినా.. వీరిదే బాధ్యత గా సర్కారు చర్యలు తీసుకుంది.
అంటే.. ఇతర రాష్ట్రాల మద్యాన్ని నియంత్రించలేక పోయారని వారిపై చర్యలు తీసుకుంది. దీనిపైనా అప్పట్లో అధికారులు విన్నవించారు. ఇది తమకు ప్రాణసంకటంగా మారిందన్నారు. అయినా.. జగన్ సర్కారు వినిపించుకోలేదు. ఇక, ఎన్నికల సమయంలో చంద్రబాబును కలిసిన ఉద్యోగ సంఘాల నాయకులు సెబ్‌ను రద్దు చేయాలని కోరారు. దీనికి ఆయన హామీ ఇచ్చారు. అనుకున్నట్టుగానే తాజాగా జీవో 12ను రద్దు చేస్తూ..చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనిపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదేసమయంలో 'సెబ్' కు చెందిన వాహనాలు, ఫర్నిచర్, కంప్యూటర్లు, అద్దె భవనాలను ఎక్సైజ్ శాఖకు అప్పగించాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఉద్యోగులు ఇక నుంచి ఎక్సైజ్ అధికారులుగానే ఉండనున్నారు.