చట్టం తన పని తాను చేయడం లేదు : జగన్ భద్రతపై వైసీపీ నేతలు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతపై ప్రభుత్వం ఉద్దేశపూర్వక నిర్లక్యం వహిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
By: Tupaki Desk | 20 Feb 2025 12:30 PM GMTమాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతపై ప్రభుత్వం ఉద్దేశపూర్వక నిర్లక్యం వహిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గుంటూరులో మిర్చి రైతుల పరామర్శకు వెళ్లిన జగన్ భద్రతను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఈ రోజు ఫిర్యాదు చేశారు. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యానారాయణ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం గవర్నరును కలిశారు. రాష్ట్రంలో చట్టం తన పని తాను చేయడం లేదని ఆరోపించారు.
వైసీపీ జగన్ అధినేత జగన్ భద్రతపై వివాదం ముదురుతోంది. ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకోరాదని వైసీపీ నేతలు నిర్ణయించారు. గుంటూరు మిర్చియార్డులో పరిస్థితులపై జగన్ నిన్ననే స్పందించారు. తన భద్రతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తాను మళ్లీ అధికారంలోకి వస్తానని, అప్పుడు సీఎం చంద్రబాబు సెక్యూరిటీ తగ్గించేస్తానని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ కు జడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ సెక్యూరిటీని సగానికి సగం తగ్గించేశారు. అప్పటి నుంచి వైసీపీ శ్రేణులు జగన్ భద్రతపై విమర్శలు చేస్తూనే ఉన్నాయి.
తాజాగా గుంటూరు పర్యటనకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రికి ఎమ్మెల్సీ కోడ్ కారణంగా అనుమతి లేదని, భద్రత కల్పించలేదని పోలీసులు చెబుతున్నారు. దీనిపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. విజయవాడలో ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి నిర్వహించిన మ్యూజికల్ నైట్ కు అడ్డురాని ఎన్నికల కోడ్.. జగన్ రైతులను పరామర్శిస్తే వస్తుందా? అంటూ నిలదీస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రికి ఎన్నికల కోడ్ అడ్డురాదని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇదే విషయాన్ని గవర్నర్ కు వివరిస్తూ రాష్ట్రంలో చట్టం తన పని తాను చేసుకోనివ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
జగన్ కు ఉద్దేశపూర్వకంగా భద్రత ఇవ్వలేదని తమ అనుమానాలను వ్యక్తం చేశారు. భద్రత ఇవ్వమన్న విషయాన్ని ముందుగా తెలియజేయాల్సివుందని అన్నారు. రైతుల పరామర్శకు వెళితే భద్రత ఇవ్వమని ముందే చెప్పి ఉండాల్సిందని బొత్స వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తవుతున్నా, రైతు సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. కాగా, మిర్చి రైతులు పరామర్శకు గుంటూరు వెళ్లిన మాజీ సీఎం జగన్ పై నల్లపాడు పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. ఎమ్మెల్సీ కోడ్ ఉల్లంఘన నేరం కింద అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.