అనవసరపు డ్యామేజ్.. ఇవే జగన్ తగ్గించుకుంటే మంచిదా?
ఇది అసలే సోషల్ మీడియా కాలం.. ఏది చేసినా ఒళ్లు దగ్గరపెట్టుకొని చేయాలి. ఏమాత్రం తేడాకొట్టినా అభాసుపాలవుతాం.. ముఖ్యంగా రాజకీయ నాయకులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
By: Tupaki Desk | 20 Feb 2025 11:30 AM GMTఇది అసలే సోషల్ మీడియా కాలం.. ఏది చేసినా ఒళ్లు దగ్గరపెట్టుకొని చేయాలి. ఏమాత్రం తేడాకొట్టినా అభాసుపాలవుతాం.. ముఖ్యంగా రాజకీయ నాయకులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. పీఆర్ స్టంట్లు వేస్తే కొండను తవ్వేసి ఎలుకను పట్టేసిన చందంగా ప్రత్యర్థులు లూప్ హోల్స్ అన్నీ బయటకు తీసి చెడుగుడు ఆడేస్తారు.. తాజాగా వల్లభనేని వంశీ అరెస్ట్ సందర్భంగా గుంటూరు జైలులో ఆయనను పరామర్శించిన అనంతరం బయటకొచ్చిన జగన్ వద్దకు ఓ పాప ఆత్రంగా రావడం.. ఆమె తాపత్రయం చూసి దగ్గరకు తీసుకొని సెల్ఫీ తీసి ముద్దు పెట్టి జగన్ పంపించారు. అయితే చూడడానికి ఎంతో ఏమోషనల్ గా సాగిన ఈ పాప ఎపిసోడ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఇందులోనూ లూప్ హోల్స్ వెతికి ఇప్పుడు ప్రత్యర్థులు జగన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఏంటీ పాప వివాదం.. అసలేమైంది తెలుసుకుందాం..
-విజయవాడ రోడ్ షోలో చిన్నారి ఎపిసోడ్.. వాస్తవమా, నాటకమా?
విజయవాడలో జరిగిన రోడ్ షో సందర్భంగా ఓ చిన్నారి ఏడుస్తూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గరకు చేరింది. జగన్ ఆ చిన్నారిని ప్రేమగా దగ్గరకు తీసుకుని, ఆమెతో సెల్ఫీ దిగారు. ఇదంతా అక్కడున్న వారిని కదిలించినా, వెంటనే ఆ చిన్నారి ఏడుపు ఆపేసి సంతోషంగా సెల్ఫీ తీసుకోవడం కొందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ముఖ్యంగా టీడీపీ అనుకూల సోషల్ మీడియా వర్గాలు దీనిని ఐ-ప్యాక్ పక్కాగా ప్లాన్ చేసిన డ్రామాగా అభివర్ణించాయి. అయితే, ఆ చిన్నారి ఓ సాధారణ కుటుంబానికి చెందినదని తొలుత భావించినా, ఆమె కుటుంబ నేపథ్యం బయటకొచ్చిన తర్వాత పరిస్థితి మారింది.
- చిన్నారి బ్యాక్ గ్రౌండ్ బయటపెట్టిన టీడీపీ సోషల్ మీడియా
సంబంధిత చిన్నారి రెడ్డి సామాజిక వర్గానికి చెందినదని, ఆమె తండ్రి బంగారు నగల దుకాణంలో ఉద్యోగం చేస్తున్నారని, తల్లి ప్రైవేట్ ఉద్యోగి అని తేలింది. ఆమె విజయవాడలోనే ఉన్నత స్థాయిలోని రవీంద్ర భారతి స్కూల్‌లో చదువుతోందని కూడా తెలిసింది. అంటే, ఆ కుటుంబం సామాన్యంగా చెప్పదగిన పరిస్థితిలో లేనట్టే. దీంతో, ఈ ఘటన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రతికూల ప్రభావాన్ని చూపించేలా మారింది. టీడీపీ సోషల్ మీడియా విభాగాలు ఇప్పుడు దీన్ని హైలెట్ చేస్తున్నాయి.. ఐ-ప్యాక్ ఈ తరహా ప్రచారాన్ని చేసిందని విమర్శలు గుప్పించింది. ప్రజలు ఇకపై ఏది నిజమో, ఏది ప్రచారమో అనే సందేహంలో పడేలా చేసింది.
- ఖండిస్తున్న వైసీపీ.. నిజాలు ఇవీ అట..
జగన్ దగ్గరకు తీసుకున్న పాప పేరు దేవికారెడ్డి అని.. ఆమె రవీంద్రభారతిలో ఎనిమిదో తరగతి చదువుతోందని టీడీపీ వాదిస్తుండగా.. వైసీపీ దీన్ని ఖండిస్తోంది.. ఆ పాప డీపీహెచ్ స్కూల్‌లో చదువుతోందంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా, ఆమె తల్లి వైఎస్సార్సీపీ నాయకురాలు అని, ఆ కుటుంబానికి ఆర్థికంగా మంచి స్థితి ఉందంటూ అసత్య సమాచారాన్ని వ్యాపింపజేస్తున్నారు. నిజానికి, దేవిక తండ్రి అద్దె ఇంట్లో నివసిస్తూ, ఓ షాప్‌లో పని చేస్తూ పిల్లల చదువుకు తోడ్పడుతున్నారు. అయినప్పటికీ, నారా లోకేష్ టీమ్ ఈ విషప్రచారాన్ని ఆపకుండా కొనసాగిస్తూనే ఉందని వైసీపీ వాదిస్తోంది..
ఇలా జగన్ వద్దకు వచ్చి తన ఏమోషన్ ను ప్రదర్శించిన పాప చుట్టూ ఇప్పుడు ఏపీలోని రాజకీయ పార్టీలు వైసీపీ, టీడీపీ ఫైటింగ్ కు దిగుతున్నాయి. మరి ఈ ఇద్దరు చెప్పేదాంట్లో ఏది నిజం? ఆ పాప బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఎవరి వాదన నిజం అన్నది తెలియాల్సి ఉంది.