వైసీపీ నయా వ్యూహం : బడ్జెట్ సెషన్ కి జగన్ ?
ఈ మేరకు ఆయన అన్ని విధాలుగా సిద్ధమవుతున్నారని అంటున్నారు.
By: Tupaki Desk | 29 Jan 2025 5:47 PM GMTఏపీలో ఫిబ్రవరి మూడో వారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించడానికి ఏపీలోని కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అయితే ఈసారి బడ్జెట్ సెషన్ కి వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ హాజరవుతారని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన అన్ని విధాలుగా సిద్ధమవుతున్నారని అంటున్నారు.
ఇదిలా ఉంటే ఏపీ అసెంబ్లీ ఇప్పటికే మూడు విడతలుగా సమావేశం అయింది. తొలిసారి సమావేశాలు జరిగినపుడు సభ్యులు అంతా ప్రమాణం చేశారు. దానికి జగన్ సహా ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు. ఆ తరువాత ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి జగన్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ఇక ఆ మీదట పది రోజుల పాటు జరిగిన కీలక అసెంబ్లీ సమావేశాలకు మాత్రం ఆయన హాజరు కాలేదు. దాంతో పాటుగా వైసీపీ నుంచి వచ్చిన వాదన ఎలా ఉంది అంటే తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని. అంతే కాదు దీని మీద కోర్టులో కూడా పిటిషన్ వేశారు. ఆ కేసు విచారణ దశలో ఉంది.
ఈ నేపథ్యంలో వైసీపీ అసెంబ్లీకి డుమ్మా కొట్టడం మీద తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానపుడు ఎమ్మెల్యేలుగా ఎందుకు గెలవడం రాజీనామాలు చేయవచ్చు కదా అని కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు విమర్శించాయి. ఒక విధంగా చూస్తే వైసీపీ అసెంబ్లీకి వెళ్ళకుండా ఉండిపోవడం వల్ల మైనస్ అయింది అని అంటున్నారు. ఈ ఫీడ్ బ్యాక్ వైసీపీ అధినాయకత్వానికి చేరింది అని అంటున్నారు.
మరో వైపు చూస్తే వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి ఈసారి హాజరు కావాలని అనుకుంటున్నారు అని తెలుస్తోంది. ఆయన ఈ మేరకు పార్టీ ముఖ్యులతో మాట్లాడి వారి నుంచి అభిప్రాయాలను సేకరిస్తారు అని అంటున్నారు అసెంబ్లీకి వైసీపీ హాజరు కావాలనే పార్టీ అంతా కోరుతోంది అని అంటున్నారు.
ఇక బడ్జెట్ సెషన్ కి జగన్ హాజరు కావాలని నిర్ణయించుకోవడం కూడా రాజకీయ వ్యూహంలో భాగమే అని అంటున్నారు. ఈసారి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతోంది. దాంతో ఏ ఏ రంగాలకు ఎంత కేటాయింపులు ఉంటాయన్నది కూడా పొందు పరుస్తారు. అలాగే కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ మీద కూడా బడ్జెట్ లో ప్రస్తావన ఉంటుందా లేదా అన్నది చర్చగా ఉంది.
వీటిని అన్నింటినీ కూడా అసెంబ్లీ వేదికగానే జగన్ ప్రభుత్వం మీద ప్రశ్నిస్తారు అని అంటున్నారు. అంతే కాదు గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయని పదే పదే ఆరోపిస్తున్న వాటికి కూడా ఆయన అసెంబ్లీ వేదికగానే జవాబు చెబుతారు అని అంటున్నారు. వైసీపీ కనుక బడ్జెట్ సెషన్ కి హాజరైతే మాత్రం ఈసారి హాట్ హాట్ గానే సభ జరిగే వీలుంది అని అంటున్నారు.
అంతే కాదు వైసీపీ ఓడాక జరిగే తొలి బడ్జెట్ సెషన్ లో ఆ పార్టీ ఏ విధమైన అంశాలను లేవనెత్తుతుంది. కూటమి ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కొంటుంది. సభ మొత్తం ఉన్న కూటమి సభ్యులను జగన్ ఏ విధంగా నిలువరించి మాట్లాడుతారు ఇవన్నీ ఆసక్తిని గొలిపే అంశాలుగానే అంతా చెబుతున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.